ఒక వ్యక్తి ఇంట్లో కుక్కని పెంచుకుంటూ ఉంటాడు. ఆఫీసు నుండి రాగానే కాసేపు దానితో ఆడుకోవడం అతనికి అలవాటు. అలా అడుకుంటే ఆఫీసులో పడి వచ్చిన stress తగ్గిపోతుంది అని అతని భావన. దీని వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. అదేంటో తెలుసుకోబోయే ముందు మానసిక వత్తిడి గురించి తెలుసుకుందాం.
మనిషి మైండ్‌కి ఉన్న గొప్ప వరం.. రాబోయే పదేళ్లలో ఈ పరిస్థితి ఏర్పడవచ్చు అని ఊహించడం! అంటే ఒక ఈవెంట్ జరగడానికి ముందే తన గత అనుభవాలు, ఆలోచనా శక్తిని ఆసరాగా చేసుకుని బ్రెయిన్లోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనబడే లాజికల్ బ్రెయిన్ జరగబోయే సంఘటనని అంచనా వేస్తుంది. ఇది ఒకందుకు మంచిదే. తన జాగ్రత్తలో తాను ఉండడానికి.. భవిష్యత్‌ని సక్రమంగా ప్లాన్ చేసుకోవడానికి! దీన్నే మనం “విజన్”, “ముందు చూపు” అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం కూడా! కానీ ఇది శాపం కూడా! పదేళ్ల తర్వాత ఫలానా విధంగా జరగొచ్చేమో అని తన ఆరోగ్యం గురించి, తన ఆర్థిక స్థితిగతుల గురించి, కుటుంబ సంబంధాల గురించి మనిషి ముందుచూపు కలిగి ఉన్నాడనుకోండి. అతను రెండు రకాలుగా ప్రవర్తించవచ్చు.
- ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రశాంతంగా లైఫ్‌ని ప్లాన్ చేసుకోవడం
- పదేళ్ల తర్వాత ఫలానా విధంగా జరుగుతుందేమోనని ఇప్పటి నుండే భయపడుతూ కూర్చోవడం.
ఇలా రెండో విధంగా భయపడుతూ కూర్చుంటే అప్పుడు యాంగ్జయిటీ మొదలవుతుంది. పదేళ్ల పాటు అతని శరీరంలో కెమికల్ ఫార్ములేషన్ మారిపోయి స్ట్రెస్ రెస్పాన్‌తో కార్టిజోల్ వంటి స్ట్రెస్ హార్మోన్స్ నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
అదే కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి ఇతర జంతువుల్ని తీసుకోండి. మా ఇంటి ముందు ఉండే లేక్‌లో కొంగలు వాలుతూ ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ లేక్‌ని బ్యూటిఫికేషన్ చేసి లేదా కబ్జా చేసి మనకు నిలువ నీడలేకుండా చేస్తారని అవేమీ ముందుగా ఊహించి భయపడవు. దీనికి చాలా ఇంట్రెస్టింగ్ కారణం ఉంది. ఆయా జీవుల బ్రెయిన్లో నియో కార్టెక్స్ అనే లాజికల్ బ్రెయిన్ చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఆ కొంగ దగ్గరకో, లేదా ఇప్పుడు హైదరాబాద్‌లో పావురాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఓ పావురం దగ్గరకో బాగా సమీపంగా వెళ్లేంట వరకూ అవి లేచి పారిపోవు. కారణం అప్పటి దాకా అవి మనిషి వస్తున్నాడు, మనల్ని తోలడాడు అనే ప్రమాదాన్ని శంకించవు. మనం వాటికి బాగా దగ్గరగా వెళ్లాక మాత్రమే వాటిలో స్ట్రెస్ రెస్పాన్స్ యాక్టివేట్ అయి అవి రెక్కలు ఆడించుకుంటూ లేచిపోతాయి.
కుక్కయినా అంతే! తన జాతికి చెందని కుక్కలు చుట్టూ ఉన్నప్పుడో, లేదా తన యజమాని తనని తరచూ వేధిస్తుంటేనో తప్పించి అవి ఎప్పుడూ తాము ప్రమాదంలో ఉన్నట్లు భావించవు. చాలా నేచురల్‌గా, ఈ క్షణంలో బ్రతుకుతుంటాయి. మనం ఇలా ఈ క్షణంలో బ్రతకడానికి యోగా క్లాసులకి వెళ్లి నేర్చుకోవాల్సి వస్తుంటుంది. ఆయా జంతువులు ఈ క్షణంలో బ్రతుకుతుంటాయి కాబట్టే నిరంతరం గతం గురించి బాధలో, భవిష్యత్ గురించి భయాలతోనో బ్రతికే మనం వాటిని చూడగానే వాటి అన్ కండిషనల్ ప్రేమని, ఈ క్షణం మన పట్ల చూపించే సరెండర్నెస్ని చూసి ముచ్చటపడి వాటితో గడపాలనుకుంటాం.
అంతెందుకు.. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే బయట నుండి మానసిక వత్తిడితో రాగానే, లేదా అలసిపోయి రాగానే నేరుగా వాళ్ల దగ్గరకు ఎందుకు వెళతారంటే.. వారిలోనూ ఇంకా థింకింగ్, లాజికల్ బ్రెయిన్ అయిన నియోకార్టక్స్ ఎదిగి ఉండదు. వాళ్లు భవిష్యత్‌ని ఊహిస్తూ భయపడుతూ బ్రతకరు. చాలా సహజస్థితిలో నవ్వొస్తే నవ్వుతారు, ఏడుపొస్తే ఏడుస్తారు. ఆ క్షణంలో జరిగే ఈవెంట్ మాత్రమే వారిలో ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేస్తుంది తప్పించి భవిష్యత్‌లో ఫలానా విధంగా జరుగుతుందని భయపడి ముందే ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేసుకోరు.
అంతా బానే ఉంది.. మరి మనిషి లాజికల్ బ్రెయిన్ అయిన నియోకార్టక్స్ ఎందుకు అంతగా సైజ్ పెరిగిపోయింది? ఎందుకు అంత ముందుచూపుతో అంచనాలు వేయగలుగుతోంది, దానివల్ల ఎందుకు స్ట్రెస్‌కి, భయాలకు గురవుతోంది అన్న సందేహం మీకు రావచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఆసక్తిగా చదవండి. మొదట్లో హ్యూమన్ బ్రెయిన్ చాలా చిన్నదిగానే ఉండేది. మానవ పరిణామ క్రమంలో నిప్పుని కనుగొనడం చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు. అప్పటి దాకా మిగతా జంతువుల్లాగే ఇతర జంతువుల్ని, పచ్చి ఆకులు, అలముల్ని తిని బ్రతికే మనిషి నిప్పుని కనుగొన్నాక వాటిని కాల్చుకోవడం, ఉడకబెట్టుకోవడం మొదలుపెట్టాడు. పచ్చి మాంసం, ఆహారాన్ని తీసుకుంటే అవి పూర్తిగా జీర్ణం కావడానికి ఒకటి రెండు రోజుల సమయం పట్టేది. అలా జీర్ణం అయ్యే వరకూ శరీరంలోని ఎక్కువ భాగం రక్తం పొట్ట చుట్టూ జీర్ణక్రియ కోసం కేటాయించబడి ఉండాలి. దాంతో బ్రెయిన్‌కి రక్తం పెద్దగా దొరకదు.
నిప్పుని కనుగొన్నాక ఎప్పుడైతే ఆహారాన్ని కాల్చి, ఉడికించి తినడం మొదలుపెట్టాడో.. అతనికి జీర్ణం అవడానికి తక్కువ మొత్తంలో మాత్రమే, తక్కువ సేపు మాత్రమే రక్తం సరిపోయేది. జీర్ణం అయ్యాక అందుబాటులోకి వచ్చే మొత్తం రక్తం బ్రెయిన్‌కి సిద్ధంగా ఉండేది. ఆ కారణం చేతే ఇంకా ఎలా మెరుగ్గా జీవించాలి… తనకు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తనకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, తన మిత్రులెవరు, శత్రువులెవరు ఇలా ప్రతీదీ విశ్లేషించుకోవడానికి, ఆలోచించుకోవడానికి, భాషలు నేర్చుకోవడానికీ, కొత్త ప్రదేశాలను చుట్టి రావడానికి ఇలా అన్నింటికీ పెద్ద మొత్తంలో రక్తం బ్రెయిన్‌ని సిద్ధంగా అందుబాటులో ఉండేది. అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల నియోకార్టక్స్ అనే థింకింగ్ బ్రెయిన్ ఏరియాలో న్యూరాన్ల సంఖ్య పెరిగిపోయి న్యూరల్ నెట్వర్క్ బలోపేతం అయి, ఆ నియోకార్టక్స్ కాస్తా వాల్నట్ ఆకారంలో అనేక ఫోల్డ్స్తో పెద్దదిగా తయారవుతూ వచ్చింది.
తల్లిదండ్రులకు సంబంధించిన DNA పిల్లలకు ఎలా వస్తుందో వారి ఆలోచనా శక్తి కూడా పుట్టబోయే పిల్లలకు వస్తుంది కాబట్టి కొన్ని వందల సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు పుడుతున్న పిల్లల బ్రెయిన్ పరిమాణం పెద్దదిగా ఉండడం వల్లనే డెలివరీ సమయంలో ఆ పెద్ద తలలు ఇబ్బందికరంగా మారి, సహజస్థితిలో డెలివరీ కష్టమై ఆపరేషన్ చేసి పిల్లలను బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇతర జంతువులకు ఉండదు.. కారణం వాటిలో నియోకార్టక్స్ (థింకింగ్ బ్రెయిన్) చాలా చిన్నదిగా ఉంటుంది. అవి తమ బ్రెయిన్‌ని డెవలప్ చేసుకోలేకపోయాయి.
ముందే ఊహించడం, ముందే ఆలోచించడం ఎంత గొప్ప విషయమో అంతే శాపం కూడా! భవిష్యత్ గురించి ఓ చిన్న భయం చాలు… అప్పటికప్పుడు అర క్షణంలో మీ పొట్టలో యాసిడ్ లెవల్స్ పెరిగిపోతాయి. కడుపులో గడబిడగా ఉంటుంది, లేదా కడుపులో మంట వస్తుంది.. గ్యాస్ ప్రాబ్లెం పెరిగిపోతుంది. భవిష్యత్ గురించి ఒక్క భయం చాలు.. మీ పాంక్రియాస్, అడ్రెనలల్ గ్లాండ్ లాంటివి యాక్టివేట్ అయి హార్మోన్స్, కెమికల్ ఫార్ములా మీ శరీరంలో మారిపోవడానికి! అలాగే కుక్కల్లా, పిల్లుల్లా, పక్షుల్లా ఈ క్షణంలో జీవించకుండా, భవిష్యత్ గురించి చేసే ఒక్క ఆలోచన చాలు.. శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరిగిపోయి ఆవేశపడడానికి! ఇవన్నీ ఏదో జరిగిపోతుంది అని ఏర్పడే టెన్షన్స్ వల్ల ఏర్పడే మానసిక స్థితులు. మనిషి ముందుచూపు ఇలాంటి టెన్షన్లని క్రియేట్ చేస్తుంది.. దీనివల్ల ఇప్పుడు ఉన్న క్షణంలో ప్రశాంతంగా, సంతోషంగా జీవించడం మిస్ అవుతుంటాం.
మరింత వివరంగా మరో ఆర్టికల్‌లో రాస్తాను.
- Sridhar Nallamothu