మనలో ప్రతీ మనిషికీ వర్తించే అయ్యే ఓ ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఉంది..
మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు "పరిస్థితుల" గురించి తెగ బాధపడిపోతాం.
అదే సమస్య ఇతరులకు వచ్చినప్పుడు అది వారి స్వంత తప్పుగా ట్రీట్ చేస్తాం.
దీనికి కొన్ని ఉదా.లు చెప్తాను..
మనం రోడ్ మీద కాలు జారి పడ్డాం..
ఏమైందని ఇతరులు పాపం జాలి చూపుతూ అడుగుతారు..
"అక్కడ రోడ్ మీద గుంతలు ఉన్నాయి… చెత్త గవర్నమెంట్.. వీళ్లకు ఓట్లు వేసి తప్పు చేశాం" అంటూ కాలు నొప్పిని భరిస్తూనే.. "పడిపోయామన్న మన స్థితికి" మన కంట్రోల్లో లేని బలమైన కారణాలు వెదికి టకాటకా చెప్పేస్తాం.
సరిగ్గా అలాగే మనకు కొద్దిగా చనువు ఉన్నవారు పడ్డారనుకుందాం. జాలి చూపిస్తూనే "అంత తొందరైతే ఎలా.. కొంపలేం అంటుకుపోతాయి.. కాస్త చూసుకుని నడుస్తుండాలి.. నేను చూడు… ఎంత జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటానో" అని సోది మొదలెట్టి అది పూర్తిగా ఆ వ్యక్తి లోపం వల్ల జరిగిందని ఓ గిల్ట్ ఫీల్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం.
ఇవే కాదు.. అనేక సందర్భాల్లోనూ అంతే..
సినిమా థియేటర్‌కి వెళ్తే మనకు టిక్కెట్లు దొరక్కపోతే… థియేటర్లో బ్లాక్ టిక్కెట్ల వల్లా, కౌంటర్ క్లోజ్ చేయడం వల్లా టిక్కెట్లు దొరకలేదు అని తప్పు మనది కాదని చెప్పుకుంటాం.
అదే మన ఫ్రెండ్ టిక్కెట్లు సంపాదించలేకపోతే.. "అలా ఊపుకుంటూ బద్ధకంగా వెళ్తే ఏం దొరుకుతాయి బాసూ.." అంటూ ఓ క్లాస్ పీకుతాం.
మన ప్రతీ ఫెయిల్యూర్‌కీ మన కంట్రోల్లో లేని కారణాలెన్నో…
ఇతరుల ప్రతీ ఫెయిల్యూర్‌కీ ఖచ్చితంగా వారే బాధ్యత వహించాలి..
ఇది సగటు మనిషి మనస్థత్వం..
అందుకే చాలామంది ఫెయిల్ అవుతుంటారు.. ఫ్రెండ్స్ సలహా చెప్తారనుకుంటే.. పనికొచ్చే సలహాలకు బదులు మందలింపులు వింటూ "వీళ్ల దగ్గర ఎందుకు చెప్పామురా బాబూ.. క్లాసులు పీకేస్తున్నారు.. అంతా నా తప్పు అంటారే.. పరిస్థితుల తప్పు అయితే" అని లోపల్లోపల తిట్టుకుంటూ ఉంటాం.
ఫెయిల్యూర్ మనదే అయినా… దానికి కారణం.. మనకోలానూ, ప్రపంచానికి ఓలానూ కన్పిస్తుందన్నమాట.
"పరిస్థితులు" అనేవి మనం దేన్నయినా జస్టిఫై చేసుకోవడానికి ఉండే స్విస్ బ్యాంకుల్లాంటివి.. బొమ్మరిల్లు సినిమాలో "అన్నింటికీ కారణం నువ్వే నాన్నా" అని చెప్పడానికి ఇవి చాలా బాగా పనికొస్తాయి 😛
"తప్పులెన్నడం" అనేది మనం ఎవర్నైనా కార్నర్ చేసి "పరిస్థితులన్నీ బానే ఉన్నాయి.. నువ్వే బాలేవు.. ముందు నీ తీరు మార్చుకో.. లేదంటే బాగుపడవు" అని క్లాసులు పీకడానికి ఉంటాయి 🙂
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Ilantivi share chesukodaniki kinda facebook etc links unte bagundedi.
Ippatikaina web page url ni link ivvochchu.kani neruga clickcke soukaryam bagu.