గతంలో ఫస్ట్ డైమెన్షన్ మొదలుకుని ఫిఫ్త్ డైమెన్షన్ వరకూ వివరించాను. గుర్తుండే ఉంటుంది. క్లుప్తంగా చూస్తే..
1. ఫస్ట్ డైమెన్షన్లో విశ్వ శక్తి అంతా ఒకటిగానే ఉంటుంది
2. ఆ విశ్వశక్తి తనని తాను అభివ్యక్తీకరించుకోవడానికి, తనని తాను చూసుకోవడానికి పాజిటివ్, నెగిటివ్ అనే రెండుగా సెకండ్ డైమెన్షన్లో చీలిపోతుంది
3. పాజిటివ్, నెగిటివ్ దేనికది విడిగా ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ రెండూ కలిసి సృష్టిలోని ప్రతీ మెటీరియల్, చివరకు మగా, ఆడా కలయిక ద్వారా పిల్లలు పుట్టడం వరకూ ప్రతీదీ సృష్టి ఏర్పడడానికి ఆ పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలను ఒకచోట న్యూట్రలైజ్ చేసి మెటీరియల్‌ని సృష్టించే థర్డ్ డైమెన్షన్ వచ్చింది. ఇప్పుడు మనం అందరం ఎక్కువగా జీవించేది ఈ థర్డ్ డైమెన్షన్లోనే!
4. ఫోర్త్ డైమెన్షన్ అనేది ఒక మనిషి ఆలోచనా శక్తి విస్తరించాక అతనికి కలిగే దశ. సృష్టిలోని ప్రతీ అంశం 1. ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్పెరిమెంట్ 3. ఇంటర్‌ప్రెటేషన్ 4. ట్రాన్సండెంట్ అని నాలుగు దశల్లో ఎలా సాగుతుందో ఈ ఫోర్త్ డైమెన్షన్‌కి చేరుకున్న వ్యక్తికి అవగాహన ఏర్పడుతుంది. అంటే జీవితం అనే ప్రాసెస్ పట్ల అవగాహన వస్తుంది. పుట్టడం, నేర్చుకోవడం, కష్టపడి సృష్టి చెయ్యడం, అన్నింటినీ వదిలేసి మరణించడం వంటి నాలుగు దశలు కూడా దీంట్లోకే వస్తాయి. అంటే ఒక సోల్ యొక్క “టైమ్” అనే జీవిత కాలపు దశల గురించి ఈ డైమెన్షన్ తెలిసొచ్చేలా చేస్తుంది.
5. ఫిప్త్ డైమెన్షన్‌కి చేరుకున్న వ్యక్తులు గురువులు లాంటి వ్యక్తులు. థర్డ్ డైమెన్షన్లో అందరూ భావోద్వేగాల్లో, మెటీరియల్ విషయాల్లో ఇబ్బందులు పడే దాని పట్ల పూర్తి అవగాహన ఉండి, వారికి జీవితం మరింత సులభం అయ్యేలా సహాయం చెయ్యగలిగిన స్థితికి చేరుకున్న వారు ఈ ఫిప్త్ డైమెన్షన్ వాళ్లు. వీళ్లకి థర్డ్ డైమెన్షన్లో జరిగే ప్రతీ భావోద్వేగం, సృష్టిలో జరిగే సంఘటనల యొక్క పర్పస్ తెలిసిపోతుంది. అందుకే నిమిత్త మాత్రులుగా అన్నీ గమనిస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు ఆరవ డైమెన్షన్‌కి వద్దాం.
———————-
అన్ని మత గ్రంధాలను తీసుకోండి.. ప్రతీ సంస్కృతిలో చీకటి నుండి వెలుగు వైపు పయనం, నెగిటివ్ నుండి పాజిటివ్ వైపు మారడం అనేది గొప్ప విషయంగా చెప్పబడుతుంది. వాస్తవానికి ఈ పాజిటివ్, నెగిటివ్ రెండూ ఫస్ట్ డైమెన్షన్లో ఒకటే అన్న లోతైన అవగాహన ఈ సిక్త్ డైమెన్షన్‌కి చేరుకున్న వ్యక్తులకు తెలిసిపోతుంది. అందుకే పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్‌ని వేర్వేరుగా చూడరు.
గతంలో నేను చెప్పినట్లుగానే 1వ క్లాస్, తర్వాత 2వ క్లాస్‌కి, మూడవ క్లాస్‌కి వెళ్లినట్లు ఈ డైమెన్షన్స్ ఒక దాని నుండి మరో దానికి చేరుకోవడం వరుసపెట్టి ఉండదు. థర్డ్ డైమెన్షన్ నుండి సిక్త్ డైమెన్షన్ ఉద్భవిస్తుంది. థర్డ్ డైమెన్షన్లో వాడు మంచి, వీడు చెడు అని అన్నింటినీ విడివిడి చేసి చూస్తే ఈ సిక్త్ డైమెన్షన్లో అన్నీ ఒకటిగా చూడడం మొదలవుతుంది.
థర్డ్ డైమెన్షన్లో మేటర్ (పదార్థం) సృష్టి జరగాలంటే కొంత సమయం వెచ్చించాలి, కష్టపడాలి. అయితే సిక్త్ డైమెన్షన్లో విశ్వంలోని ఎనర్జీస్‌ని మేనిప్యులేట్ చెయ్యడం ద్వారా, బలమైన ఇంటెన్షన్ అనే ఎలక్ట్రో మాగ్నటిక్ వైబ్రేషన్‌ని ఆసరాగా చేసుకుని ఉన్న ఫళంగా టైమ్‌తో సంబంధం లేకుండా రియాలటీలను సృష్టించవచ్చు. ఉదా.కి.. నేను గతంలో రాసినట్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే కొంత టైమ్ ప్రయాణించి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి (స్పేస్) చేరుకుని టైమ్, స్పేస్‌లతో దర్శనం అనే రియాలిటీని సృష్టించుకోవలసిన పనిలేదు. అనే అనుభవాన్ని ఉన్న దగ్గరే పొందొచ్చు. అలాగే కేవలం బలమైన ఇంటెన్షన్ని ప్రతీ సెకన్ కలిగి ఉండడం ద్వారా టైమ్‌లో ఎక్కువ ప్రయాణించాల్సిన పని లేకుండా జీవితంలో కావలసిన ప్రతీదీ సృష్టించుకోవడం కూడా ఈ సిక్త్ డైమెన్షన్‌కి చేరుకున్న వ్యక్తు చెయ్యగలుగుతారు.
కొంతమంది సాధకులు తాము ఉన్న చోటి నుండే కాలంతో, స్థలంతో సంబంధం లేకుండా వేరొక చోట ఉన్న విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. ఇది కూడా సిక్త్ డైమెన్షన్ వల్లనే సాధ్యం. టైమ్, స్పేస్‌లను వాడుకుని థర్డ్ డైమెన్షన్లో మానసిక వత్తిడి వంటి వాటితో సాధించే ఫలితాలను ఎలాంటి శ్రమా లేకుండా టైమ్, స్పేస్ అనే హద్దులకు ఆవల ఉన్న ఫళంగా సాధించే శక్తి వీరికి ఉంటుంది. విశ్వంలోని పదార్థాలను ఎలా ప్రభావితం చేయాలి, ఈ క్షణం నుండి మానసిక, శారీరక స్థితిగతులను పూర్తి భిన్నమైన హైయ్యర్ కాన్షియస్నెస్ కలిగిన పేర్లల్ ప్రపంచాలను ఎలా సృష్టించుకోవాలి వంటివన్నీ వీరికి చాలా సులభం. ఇప్పటి వరకూ పైన మనం చూసిన డైమెన్షన్స్ అన్నీ జీవితంలో జరిగే వివిధ దశలను, పాజిటివ్ నెగిటివ్ వంటి విషయాలను, ఆ పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీస్ కలయిక ద్వారా మేటర్ సహజసిద్ధంగా ఎలా ఏర్పడుతుంది అన్న దానికి చెందినవైతే.. ఈ సిక్త్ డైమెన్షన్లో ఎనర్జీస్‌తో ఆడుకోవడం మొదలవుతుంది. వాటిని మనకు నచ్చినట్లు మేనిప్యులేట్ చేసుకోవడం కుదురుతుంది.
విశ్వంలోని ఎనర్జీ అంతా కాంతి రూపంలో ఉంటుంది కాబట్టి ఆ కాంతిని కాస్మిక్ ఎనర్జీగా నిరంతరం స్వీకరిస్తూ దాన్ని రకరకాల రియాలిటీలుగా మార్చుకోగలిగే శక్తి వీరికి ఉంటుంది. చీకటి, కాంతి అనే రెండు వేర్వేరు భిన్న ధృవాలు లేకపోతే సృష్టి అభివ్యక్తీకరణ జరగడం కష్టం. అందుకే కాంతిని, పాజిటివ్‌ని తీసుకుని, చీకటి, నెగిటివ్ అనే దుప్పటి మీదకు వెదజల్లడం ద్వారా కావలసిన రూపంలో మెటీరియల్ తయారయ్యేలా వీరు ఆటలు ఆడుకోగలుగుతారు. ఇలా ఎనర్జీస్‌తో ఆడుకోవడం జరగాలంటే థర్డ్ డైమెన్షన్లో మాదిరిగా నెగిటివ్లోనో, పాజిటివ్లోనో ఒక మూసలో కొట్టుకుపోవడం జరగకూడదు. ఈ రెండు రకాల ఎనర్జీస్‌ని అర్థం చేసుకోగలిగి, వాటితో అద్భుతాలు చేసే సిక్త్ డైమెన్షన్‌కి ఎదగగలగాలి.
వాస్తవానికి సృష్టిలోని చీకటి మీదనే వెలుతురు అనేది ఎక్స్‌ప్రెస్ కాగలుగుతుంది. మా బాల్కనీలో ఓ లైట్ ఉంది. రాత్రి టైమ్ ఆ లైట్ వేస్తే ఆ లైట్ ఎంత మేరకు ప్రసరిస్తుందో అక్కడి వరకూ మాత్రమే కదా మేటర్ అనేది కళ్లకి కనిపించేది. మిగతా అంతా చీకటేగా! ఒక నల్లగా ఉన్న ఖాళీ కాన్వాస్ మీద తెల్లటి లైన్లతో ఓ ఇంటి బొమ్మ గీస్తున్న పెయింటర్ని ఊహించుకోండి. అతని బ్రష్ ముందుకు సాగే కొద్దీ ఆకారం, సృష్టి కొనసాగుతూ ఉంటుంది. లైట్ ఎనర్జీ మేనిప్యులేషన్ కూడా అలాంటిదే. సిక్త్ డైమెన్షన్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటెన్షన్ అనే బ్రష్‌ని తీసుకుని ఖాళీగా ఉన్న కాన్వాస్ లాంటి జీవితం, విశ్వం మీద వెలుతురు అనే పెయింట్‌తో ఆకారాలు సృష్టించుకుంటూ వెళుతూ సృష్టి చేస్తుంటారు.. అదీ టైమ్, స్పేస్ అనే బంధనాలకు ఆవల!
మరింత వివరంగా మరోసారి రాస్తాను.
– Sridhar Nallamothu