మనస్సూ, బుద్ధీ – ఈ రెండూ ఒక మనిషి తనకు తానూ, ప్రపంచంలో తానూ ఏ విధంగా నడుచుకుంటున్నాడన్నది ప్రభావితం చేసే అంశాలు.
ఒక మనిషీ, ఒక సిస్టమూ (సమాజమే అనుకోండి) రిథమిక్‌గా ఒకదానికొకటి హాని చేసుకోకుండా కొన్ని నైతిక విలువలూ, కట్టుబాట్లూ, సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలూ వంటివి నిర్దేశించబడ్డాయి.
ఇదో auto correction మెకానిజం. ఒక మనిషి దారి తప్పితే సమాజం అతన్ని నిలదీస్తుంది. ఒక వ్యవస్థ దారి తప్పితే ఓ మనిషి ఆ వ్యవస్థలోని మనుషులందర్నీ నిలదీస్తాడు. తప్పు చేస్తే.. చేసిన తప్పుకి గిల్ట్ ఫీల్ కావాలి.. తప్పుుని ఒప్పుకోవాలి, సరిచేసుకోవాలి, మళ్లీ సవ్యంగా నడుచుకోవాలి. ఇలా అందరం సిస్టమాటిక్‌గా నడుచుకున్నంత కాలం మనుషులూ, సమాజం చాలా ప్రశాంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలివితేటలు ఎక్కువయ్యాయి, మన లైఫ్ మనిష్టం అనే నైజం తలకెక్కింది. సో ఎవరికీ ప్రశాంతత మిగలట్లేదు.
ప్రశాంతత కోల్పోయిన సమాజాన్ని next levelలో స్థిమితంగా ఉండగలిగేలా మోటివేట్ చేసేది భక్తి, ఆధ్యాత్మికత. భక్తంటే భగవంతునిలో మమేకం అయిపోవడం. ఓ కొబ్బరికాయ కొట్టి, హారతి వెలిగించి క్షణకాలం పాటు చాలా పుణ్యం వచ్చేసిందని సంతృప్తికి గురై.. ఆ సంతృప్తి ద్వారా వచ్చిన పాజిటివ్ ఫీలింగ్‌నే ప్రశాంతత అనుకుని భ్రమపడి next second మళ్లీ ప్రపంచంలో అశాంతిగా కొట్టుకుపోవడం భక్తి కాదు.
భారతదేశం లాంటి ఆధ్యాత్మిక మూలాలు బలీయంగా ఉన్న దేశంలో దురదృష్టవశాత్తు కొన్ని తరాలుగా భక్తి అనేది తప్పుదోవ పట్టించబడింది. హిందూత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గుడులూ, గోపురాలూ, యాగాలూ, యజ్ఞాలూ వంటి మౌలికాంశాలపై పెట్టినంత శ్రద్ధ ఓ భక్తుడు ఏ మేరకు భగవంతుడితో తాదాత్మ్యం చెందగలుగుతున్నాడన్న దానిపై పెట్టలేకపోతున్నాం. గుడికెళ్లి ఓ కొబ్బరికాయ కొట్టొస్తే ఆరోజుకి భక్తి పని అయిపోయినట్లే! భోజనం చేసినంత ఈజీ పని భక్తి మారిపోయింది. సో మనిషిని ప్రశాంతంగా ఉంచడంలో ఆధ్యాత్మికతా నిస్సహాయంగానే మిగిలిపోతోంది. నేను వ్యక్తిగతంగా చాలా మంది పెద్దవాళ్లని చూస్తుంటాను. గుడికీ, పూజలకూ, భజనలకూ వెళ్లి ఎంత తమని తాము మర్చిపోయి ఎంత లీనమైపోతుంటారో! కానీ బయటకు వచ్చేసరికి అవే మానసికమైన బలహీనతలు.. పక్కింటి వాళ్ల గురించీ, బంధువుల గురించీ అవీ ఇవీ చెప్పుకుని మానసిక వైకల్యంలో బ్రతికేస్తుంటారు.
ఓ కుర్రాడు సినిమాకెళ్లి ఆ సినిమాలో లీనమైపోయి విజిల్స్ వేయడానికీ గుడికెళ్లి అక్కడ మ్యూజిక్‌కీ, అక్కడ ఉండే వాతావరణానికీ ట్యూన్ అయిపోవడానికీ పెద్దగా వ్యత్యాసం ఉండదు. గుడికెళ్తే మనల్ని మనం ఎలా మర్చిపోతామో.. మనకు సంతోషం కలిగించే ఏ పనిలో ఉన్నా అంతేలా మనల్ని మనం మర్చిపోతాం. నేను చెప్పొచ్చేదేమిటంటే భక్తి అంటే నిన్ను నువ్వు తాత్కాలికంగా మర్చిపోవడం కాదు గుడినీ, దేముడినీ ఆశ్రయించవలసింది. నిన్ను నువ్వు ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా detach అయి ఉండే సంకల్పం ఉంటేనే భక్తి మార్గం ఎంచుకో.
మళ్లీ అసలు విషయానికి వస్తాను.. ఒక మనిషిని ప్రశాంతంగా ఉంచడంలో నైతిక విలువలూ, సిస్టమ్, భక్తీ ఏమీ పెద్దగా హెల్ప్ చెయ్యలేకపోతున్నాయి. కానీ ఒక్క అంశం బలంగా ఓ మనిషిని ప్రభావితం చెయ్యగలదని నేను నమ్ముతున్నాను. అది “తత్వం”. ఫిలాసఫీ. తత్వం బోధపడితే ప్రతీ మనస్సూ ఏ ఆధారం లేకుండానే స్థిమితపడుతుంది. సొసైటీతో డిటాచ్ అయి తనలోకి తాను చూసుకుంటుంది. తనని తాను అన్వేషించుకుంటుంది. అయితే ఫిలసాఫికల్ మైండ్‌సెట్ ఈ సమాజంలో గౌరవం కోల్పోయింది. తత్వాన్ని వైరాగ్యం అనేసుకుంటుంటారు.. పిచ్చి అనేసుకుంటారు.. ఏదో డిజప్పాయింట్‌మెంట్‌లో మాట్లాడే మాటలుగా సానుభూతి చూపిస్తారు. ఎవరెలా అర్థం చేసుకున్నా, మనల్ని ఎవరెలా స్వీకరించినా ఓ తాత్వికుడు ప్రపంచం కన్నా తనని తాను తెలుసుకోవడం మీదే దృష్టి నిలుపుతాడు. తననితాను తెలుసుకునే ఏ వ్యక్తీ సొసైటీకి హాని చెయ్యడు, పక్క వ్యక్తిని కష్టపెట్టడు, సిస్టమ్‌ని పాడు చెయ్యడు, సమాజంలో తాను చేయాల్సిన పనేదో తాను చేసుకుంటూ సమాంతరంగా తనని తాను అర్థం చేసుకుంటూ ఓ మునిలా సాగిపోతాడు.
అందుకే మనమూ, సమాజమూ ప్రశాంతంగా ఉండాలంటే ప్రతీ వ్యక్తికీ భక్తీ, ఇతరత్రా అంశాల కన్నా తత్వం బోధపడడం చాలా అవసరం అన్పిస్తుంటుంది చాలాసార్లు నాకు. ఫిలాసాఫికల్గా సొసైటీలోని మనుషులు మారితే, అంత పరిపక్వత రాగలిగితే అస్సలు అన్యాయాలూ, అక్రమామూ, ఒకర్నొకరు దోచుకోవడాల గురించి మాట్లాడుకోనవసరం లేదు. ఎవరి జీవితంలో వారు ప్రశాంతంగా బ్రతికేయొచ్చు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply