రాగీ కర్మఫలప్రేప్సుః లుభ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ।। 27 ।।
కర్మఫలముల పట్ల ఆసక్తి తో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు.
వివరణ:
ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు రజో గుణం కలిగిన కర్తల (కర్మలు చేసే మనుషులు) స్వభావం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.
ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు.. అందులో పాస్ అవ్వాలనే ఆరాటం ఫలితాలు వచ్చే వరకూ ఉంటుంది.
ఓ ఉద్యోగి కష్టపడి ఓ ప్రాజెక్టులో తన శాయశక్తులా కృషి చేశాడు.. తనకి సేలరీ హైక్ రావాలి అనే కోరిక వెంటనే మైండ్‌లో నాటుకుపోతుంది!
“ఎగ్జామ్ రాసిన స్టూడెంట్‌కి పాస్ అవ్వాలనే కోరిక ఉండకూడదా” అని చాలా తరాల తరబడి “ఎగ్జామ్ రాయడం, ఫలితం కోసం ఎదురు చూడడం” లాంటి ఈవెంట్లని మనమో, మన చుట్టూనో చూసి ఉంటాం కాబట్టి సమర్థించుకుంటూ ఉంటాం. కానీ దీనివల్ల ఫలితాలు వచ్చే వరకూ మానసికంగా ఏర్పడే వత్తిడి మనిషి స్వభావంపై ఎక్కువగా ఉంటుంది. అలా ఫలితం పట్ల ఆసక్తితో చేయబడే ప్రతీ కర్మా రజో గుణ కర్మకే దారి తీస్తుంది. ఆశ, అంచనా, స్వార్థమూ ఈ మూడూ మన మైండ్ సృష్టించే మానసిక చర్యలు. బాగా చదివి సంతృప్తిగా ఎగ్జామ్ రాశాను అనే ప్రస్తుత సంతృప్తి నుండి రిజల్ట్స్ ఎలా వస్తాయో అనే కొన్ని రోజుల తర్వాత వచ్చే ఫలితాల వైపు ఆందోళన దిశగా మనస్సుని రజోగుణం వైపు ఇవి లాక్కెళతాయి.
“ఎగ్జామ్ ఫలితాల కోసం ఎదురుచూసే చిన్న పిల్లలకు ఆధ్యాత్మికత అవసరమా” అనిపించవచ్చు. దీనికి ఒకటే సమాధానం.. మనస్సుని ప్రశాంతంగా ఉంచేది ఆధ్యాత్మికత, మనస్సుని రకరకాల భావోద్వేగాల వైపు మళ్లించేది లౌకిక జీవనం. చిన్న వయస్సు నుండే చిత్తశుద్ధితో చదవడం, ఆఫీసులో కర్మయోగిగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం అలవాటు అయితే ఫలితాలను కాకుండా ప్రాసెస్‌ని ఎంజాయ్ చెయ్యడం తెలుస్తుంది. మనస్ఫూర్తిగా చదివేటప్పుడు ఏర్పడే సంతృప్తినీ, కష్టపడి పనిచేసేటప్పుడు కలిగి జాబ్ శాటిస్ఫేక్షన్నీ ఆస్వాదించిన ఏ వ్యక్తీ ఫలితాల పట్ల పెద్దగా ఆసక్తి కలిగి ఉండరు. “వస్తే రానీ, నేను పెద్దగా కేర్ చెయ్యను, నా డ్యూటీ నేను చాలా బాగా నిర్వర్తించాను” అనే సంతృప్తి వారిలో ఉంటుంది. వాస్తవానికి వత్తిడితో చదివే వారి కన్నా ఇలా ఎంజాయ్ చేస్తూ సంతృప్తిగా చదివే వారికి మెరుగైన ఫలితాలు వస్తుంటాయి.
ఇకపోతే కొంతమందిని చూస్తుంటాం.. “మనకు పెద్దగా టాలెంట్ లేకపోయినా ఏదో ఒకటి లక్ కలిసి వచ్చి మంచి ఛాన్స్ వస్తే బాగుణ్ణు” అని ఆశిస్తుంటారు. దీన్నే దురాశ అంటారు. నువ్వు సమర్థుడివి అయితే ఫలితం అదే మంచిగా రావచ్చు, రాకపోవచ్చు.. నీ సమర్థత చూపించడం వరకే నీ కర్మ. ఫలితం ఏదో రూపంలో వస్తుంది. కానీ అసలు సమర్థతే చూపించకుండా, కష్టపడకుండా విపరీతంగా ఆశపడడం కూడా రజో గుణమే.
కొంతమంది హింసా ప్రవృత్తి కలిగి ఉంటారు. హింస అంటే కత్తితో గాయం చేయాల్సిన పనిలేదు. తోటి వ్యక్తులకు పదునైన మాటలతో ఈర్ష్యతో అసూయతో వాళ్లు ఎదిగిపోతున్నారు అనే ప్రొఫెషనల్ జెలసీ కొద్దీ మానసికంగా గాయం చేయడమూ హింసే! భౌతిక గాయమైనా కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది కానీ మానసికంగా చేసే గాయం అవతలి వ్యక్తి ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే అతనిలో సెల్ఫ్ ఎస్టీమ్, భావోద్వేగాలకు కేంద్రాలైన స్వాధిష్టాన, మణిపూరక చక్రలలో ఎనర్జీ బ్లాక్‌కి కారణం అవుతూ ఉంటుంది. ఒక దైవ సమానమైన సోల్‌కి క్షేత్రంగా ఉన్న మనం మరో దైవ సమానమైన సోల్‌ని గాయపరిచే గుణం రజోగుణం అవుతుంది. అది తీవ్రమైన పాపంగా వివిధ రూపాల్లో తిరిగి స్పేస్, టైమ్ పరిధులు దాటి మన సోల్‌ని చుట్టుకుంటుంది.
భగవద్గీతలోని పై శ్లోకంలో “అపవిత్రత” అంటే శారీరకమైనది కాదు. మానసికమైనది. మన ఆలోచనలు కలుషితం అయినప్పుడు “ఇతరులను కష్టపెట్టకూడదు, అందరితో ప్రేమగా ఉండాలి, నిరంతరం విశ్వశక్తి పట్ల సరెండర్ స్వభావం కలిగి ఉండాలి” వంటి నైతిక విలువల రూపంలో ఉండే సత్యాలను పాటించడం మానేస్తాం. “అందరూ తప్పులు చేస్తూ కూడా బానే ఉంటున్నారు కాబట్టి మనం తప్పు చేసినా ఏం కాదు” అనే పవిత్రంగా ఉండే మైండ్ సెట్ నుండి అపవిత్రత వైపు సాగుతాం. అసలు మన దృష్టిలో ఉండే “అందరూ” ఎవరు? మహా అయితే మనకు బాగా పరిచయం ఉన్న ఓ పదిమందో, వందమందో మన ప్రపంచం! వాళ్లని చూసి, వాళ్ల థాట్ ప్రాసెస్ నుండి ఇన్స్పైర్ అయి మనల్ని మనం పొల్యూట్ చేసుకోవడం ప్రశాంతతను ఇచ్చే సత్త్వ గుణం నుండి రజోగుణానికి దారితీస్తుంది. ఇతరుల్ని గుడ్డిగా అనుకరించడం ద్వారా మన కాన్షియస్‌నెస్‌ని, స్వచ్ఛతని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. అవతలి వ్యక్తికి చేయాల్సిన కర్మలు మిగిలి ఉండి గానీ, లేదా ఆధ్యాత్మిక జ్ఞానం లేక కొత్త చెడు కర్మలు చేస్తూ తన సోల్‌ని శిక్షించుకుంటూ ఉండొచ్చు. కానీ గుడ్డిగా ఆ వ్యక్తి వైపు చూసి, “నేనూ నీలాగే పాడవ్వాలని ఉంది” అని దిగజారిపోవడం అనేది మన సోల్ నుండి మనం దూరంగా జరగడంతో సమానం. సోల్‌ని తెలుసుకోలేని వ్యక్తి మెల్లగా కాసేపు సంతోషం, కాసేపు బాధ వంటి ఛట్రంలోకి ఇరుక్కుపోతాడు. అతన్ని నిరంతరం భావోద్వేగాలు వెంటాడుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలా చెయ్యబడే ప్రతీ కర్మా కృష్ణ భగవానుడు పై శ్లోకంలో చెప్పినట్లు “రజోగుణ కర్మ” అవుతుంది.
– Sridhar Nallamothu