నేను ఔనన్నాను… నువ్వు కాదన్నావు.. నా “ఔను”కి నీ “కాదు” ఓ అసంకల్పిత ప్రతీకార చర్య మాత్రమే.. అది నీకూ తెలుసు, నాకూ తెలుసు. కానీ నేను నువ్వు కాదన్నావని నీచేత ఔను అన్పించడానికి వాదనకి దిగాను. నా వాదన ముందు తలొగ్గకూడదన్న పట్టుదల నీలో పెరిగింది..
నిరంతరం ప్రపంచంలో ప్రతీ విషయమూ.. ఔను, కాదుల మధ్యనే నడుస్తుంది. మనం గొడవపడడానికి కావలసినన్ని కారణాలు.. మన స్వభావం పైకి నిర్మలంగా కన్పిస్తున్నప్పటికీ మన నిజమైన అభిప్రాయాలను దాటిపోయి ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేదే అయినట్లయితే ఏ కారణాన్నయినా pick చేసుకోవచ్చు.
నా అభిప్రాయం సరైనదైనా నాకు పొందికగా హృదయం నుండి పదాల్ని పేర్చేసి మాట్లాడడం చేతకాకపోతే నీ లాజిక్ ముందు ఓడిపోవడం సహజం. నేనెలా ఓడిపోయానన్నదీ, ఏ పాయింట్ దగ్గర మాటలు పెగిలిరాక మౌనాన్ని ఆశ్రయించానన్నదీ ఒకటికి పదిసార్లు గుర్తు తెచ్చుకుని నువ్వు సంబరపడతావు.. నా ఓటమిని చూసి చుట్టూ సమాజమూ కాస్తో కూస్తో శాడిస్టిక్ నవ్వు నవ్వు కుంటుంది. కానీ నేనేంటన్నది నాకూ తెలుసు.. నీకూ తెలుసు.
నా అస్థిత్వం గురించి నేనూ.. నా ఓటమి గురించి నువ్వూ చేసే మాటల పోటీ బ్రెయిన్లోని న్యూరాన్లలో విపరీతంగా విద్యుత్ చలనాలను కలిగించి.. మాటల కోటలు దాటిస్తోంది.. ఈ వాదన అర్థరహితమని తెలిసీ.. వెనక్కి తగ్గాలంటే దేహం చుట్టూ కన్పించకుండా పేరుకున్న అహం అడ్డొస్తోంది.
ప్రతీ దాని గురించీ లోతైన అభిప్రాయాలు కలిగి ఉండడమే జ్ఞానమనుకుంటే నేను అజ్ఞానిని. నలుగురు ముచ్చట్లాడుకుంటూ నిలబడ్డప్పుడు మౌనంగా నోరు పెగల్చడం కూడా చేతకాక అలా మొహాలు చూస్తుంటాను తప్పించి దేనిపై నాకు స్పష్టమైన అభిప్రాయాలు లేవు. ఈ లౌకిక ప్రపంచపు జ్ఞానం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వ్యక్తినీ, తనలోతానే నిరంతరం మధనపడే వ్యక్తినీ ఏ సోషల్ ఏనిమల్ ఎంటర్టైన్ చెయ్యలేదనుకుంటా… పైకి అనకపోయినా వేస్ట్ ఫెలో అనుకోనూవచ్చు 🙂 నిజమే, కాసిన్ని కబుర్లకి కూడా బుర్రలో స్టఫ్ లేనోడు జనాలకు అలా అన్పించడంలో తప్పేముంది? సంఘర్షణల నడుమ, అలౌకికమైన విషయాల నడుమా భగ్గున మండే నా అంతరంగాన్ని బయటకు ఆవిష్కరించినప్పుడు ఆ మాటలు అర్థం చేసుకోగలిగేదెవ్వరు? నా మౌనం నా హృదయంలో ఏమీ లేదని కాదు.. నా మాటలు మీకు అర్థం కావని మాత్రమే 🙂 వేవ్లెంగ్త్ మ్యాచ్ అవని చోట మాటల కన్నా మౌనమే గొప్ప ప్రదర్శన!
సినిమాలు చూడడం, షాపింగులు చెయ్యడం, మనుషులతో స్పెండ్ చెయ్యడం బాహ్యమైన చర్యలు.. అవి మాత్రమే నేనేమిటో నిరూపించలేవు. వాటిని చూసి నా స్వభావాన్ని అంచనాకి వస్తే ఒక్క మంచు బిందువుని చూసి అదంతా అంటార్కిటికా కాబోలని భ్రమపడడంతో సమానం. నా హృదయం, ఆ హృదయం నుండి పుట్టుకొచ్చే ఆలోచనలూ, వాటి ఉప-ఆలోచనలు, వాటి గమనం, అవన్నీ న్యూట్రలైజ్ అయి మరో తరంగం ఎగిసిపడడం, ఇలాంటి కోటానుకోట్ల మానసికమైన చర్యల ద్వారా ఏర్పడే తాత్విక చింతనా ఇవన్నీ టచ్ చెయ్యడానికి కూడా నా చుట్టూ ఉన్న సమాజానికి వాటిపై అస్సలు ఆసక్తి గానీ, అవగాహన గానీ లేనే లేదు.. అసలు నాలో ఇన్ని ఉన్నాయని తెలీను కూడా తెలీదు.
మన ఔను కాదుల మధ్య నా లౌకిక అజ్ఞానమూ.. అలౌకిక జ్ఞానమూ.. నీ లౌకిక జ్ఞానమూ దాగున్నాయని.. మన మాటలు మెదడు పొరల్లో సుదూరంగా ప్రయాణం చేసి మరికొన్ని పార్శ్యాలను తాకుతాయని ఆలోచన కూడా రాని అజ్ఞానంలో ఇలాగే లౌకిక జ్ఞానంతో మాట్లాడుకుందాం, వాదించుకుందాం.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply