"ఇది తప్పు" ఇలా అనేయడం చాలా సులువు…
"ఇది ఇందుకు తప్పు" అని ఓ బలమైన లాజిక్ ని చాలా పటిష్టంగా నిర్మించుకుని ఓ సమాజం మొత్తాన్నీ కన్విన్స్ చేయడం మరింత సులువు…
"ఇది నిజమే" అని లాజిక్ కి అందని విషయాల్ని నమ్మడం మాత్రం అతి కష్టం..
భారతీయత, భారతీయ సమాజానికే స్వంతమైన ఆధ్యాత్మిక సంపదపై ఇలాంటి లాజిక్ అడ్డుపెట్టుకునే నమ్మకం పోగొట్టబడుతోంది.
హిమాలయాల్లో మునులు తపస్సు చేస్తుంటారంటే మనకు నమ్మబుద్ధి కాదు… మునులు, రుషులు, మహర్షులంటే… "టివిల్లో మనకు చూపించబడే దొంగ బాబాలే" పదేపదే మనకు స్ఫురణకు వస్తారు.
త్రేతాయుగాలూ, ద్వాపర యుగాలూ… కృష్ణుడూ.. రాముడూ… ఇవన్నీ మనకు నాటకాలూ, పౌరాణిక సినిమాలూ, ఏడాదికోసారి వచ్చే పండగలకే పరిమితం అయ్యే విషయాలు…
మన తాతముత్తాతలు మన తల మీద రుద్దారు కాబట్టి అనుసరిస్తున్న ఆర్భాటాలుగానూ, గుడ్డి నమ్మకాలుగానూ అన్పిస్తాయి..
"సైన్స్ ఇంత పురోగతి చెందినా ఈ మూఢ నమ్మకాలేంటి" చాలా అవహేళనగా తరచూ మేధావులచే వేయబడే ప్రశ్న ఇది.
మనకు అన్నింటికీ నిరూపణలు కావాలి…… నిరూపణ లేనిదేదైనా మూఢ నమ్మకమే…
మరి పుట్టి, పోయే లోపు తారసపడే ప్రతీ అంశానికీ నిరూపణ వెదకగల మేధస్సు మన బుర్రలకుందా?
భారతదేశం, భారతీయులు తమ నమ్మకాల్నీ, విశ్వాసాల్నీ అనుసరించడం వల్ల నష్టపోయిందీ లేదూ.. నష్టపోబోయేదీ లేదు. ఇంకా చెప్పాలంటే ఎంతో కొంత సమాజం బాగుపడుతోందనే చెప్పాలి. విశ్వాసాలను అనుసరించడం వల్ల మన ప్రజలు పుణ్యం మూటగట్టుకోవాలనో, పాపభీతితోనో పరులకు హాని చేయడానికి వెనుకంజ వేసేవారు.
ఇప్పుడు ఆ విశ్వాసాలు అవహేళన చేయబడుతున్నాయి. "వీటినేంటి నమ్మేది ఇంత బ్రతుకూ బ్రతికి" అని ఎగతాళి చేస్తున్నాం… మనకు ఏదీ పాపమూ కాదు, ఏదీ పుణ్యమూ కాదు… నేరాలూ, నేరప్రవృత్తి పెరుగుతున్నాయంటే… మనం మూలాలు పునాదులతో పీకేసుకోవడం వల్ల కాదూ?
వాదించదలుచుకుంటే దేన్నయినా తప్పని వాదించగలిగేటంత Alpha-lipoic ఏసిడ్, Acetyl L-carnitine ఏసిడ్లు పుష్టిగా ఉండే ఆకుకూరలు తిని బ్రెయిన్‌ని షార్ప్ చేసేసుకుంటున్నాం.
ఓ బుషి తన అభ్యాసంతో.. నిరంతర ధ్యానప్రక్రియ ద్వారా సాధించే శక్తికి లాజిక్‌ని వెదికిపట్టడం మన వల్లవుతుందా?
వెదికిపట్టలేక బుషీ లేడూ.. అభ్యాసమూ లేదు, ధ్యానమూ లేదు.. అని కొట్టిపారేస్తే సరిపోతుందా 🙂
వంద తలనొప్పులు తగ్గించుకోవడానికి పది నిముషాలు కళ్లు మూసుకుని కుస్తీపట్టి.. "ఇదేదో బాగుందే మెడిటేషన్" అని సంబరపడిపోతాముగా మరి?
పురాణేతిహాసాలూ, వేదాలూ, శాస్త్రాలూ, నమ్మకాలూ, ఆచారాలూ.. అన్నీ సమూలంగా నమ్మడం మానేయడం వల్ల మనిషి తన ఆత్మశక్తిని కోల్పోతున్నాడన్న విషయం గ్రహించే విజ్ఞత ఎంతమందికి ఉంటోంది?
ఏ ఆధ్యాత్మిక సంపదైనా, ఏ వారసత్వ సంపదైనా గౌరవంగా స్వీకరిస్తేనే మనకు అలంకారంగా నిలుస్తుంది తప్ప.. "నీ అస్థిత్వాన్ని ముందు రుజువు చేసుకుని నన్ను నమ్మించి.. అప్పుడు నాకు సంప్రాప్తించు" అంటే మూర్ఖుల చెంతకు ఏ అలౌకిక విషయమూ దరిచేరలేదు… మూర్ఖుడి చేత ప్రశ్నించబడడానికి మించి అవమానం సరస్వతీ మాతకు లేదు..!!
గమనిక: ఇది ఎవరినైనా ఆలోచింపజేస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
Leave a Reply