మనం చాలానే దాస్తాం….
కానీ మన శరీరాలు దాచినవన్నీ బయటకు చెప్పేస్తూనే ఉంటాయి.. అర్థం చేసుకోవడానికి జీవితకాలం కూడా సరిపోని మనుషుల్ని కొద్ది రోజులు గమనించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి బాడీ లాంగ్వేజ్ తెలిస్తే చాలు!
బాడీ లాంగ్వేజ్ అంటే ఓ మనిషి ఇలా కూర్చుంటే… అతని బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఉన్నట్లు.. లేదా… అలా నవ్వితే లోపల ఆ మాదిరి అర్థాలు ఉన్నాయని గుడ్డిగా చెప్పే శాస్త్రం కాదు.. సహజసిద్ధంగా బయటకు ప్రదర్శించబడే శారీరక భంగిమల్నీ.. వాటి వెనుక ఉన్న ఆలోచనా కోణాల్నీ నగ్నంగా చూపించే అద్భుతమైన సబ్జెక్ట్.
భయమూ, కోపమూ, ద్వేషమూ, చిరాకు.. వంటి అనేక ఎమోషన్లని చాలామంది చాలా niceగా మొహంపైకి రాకుండా తొక్కి పెడతారు… అలా తొక్కి పెట్టబడిన విషయాలు బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలిసిపోతూనే ఉంటాయి… ఈ నేపధ్యంలో వీలువెంబడి బాడీ లాంగ్వేజ్పై 15 సంవత్సరాలకు పైగా నేను తెలుసుకున్న వివిధ విషయాలను షేర్ చేస్తాను….
——————————————————————-
అబద్ధం దాగదు..
బాడీ లాంగ్వేజ్ 1 – నల్లమోతు శ్రీధర్
———————–
అబద్ధం చెప్పడం తప్పు అనేది నరనరానా జీర్ణించుకున్న మనుషులం మనం… సో అబద్ధం చెప్పాల్సి వస్తే నోరు దాటి అది బయటకు వచ్చే వరకూ దాన్ని అడ్డుకునే ప్రయత్నం శరీరం సహజసిద్ధంగానే చేసేస్తుంది…. మనం తప్పు చేస్తున్నామన్న భయం కొద్దీ!
ఇక్కడ ఫొటోని చూస్తే వేర్వేరు వయస్సుల వ్యక్తులు అబద్ధం చెప్పినప్పుడు వేర్వేరు భంగిమలు పెట్టడాన్ని మీరు గమనించొచ్చు.
చిన్న పిల్లలు అబద్ధం చెప్తే..
మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గమనించండి.. వాళ్లు ఏదైనా అబద్ధం చెప్తే వెంటనే రెండు చేతులూ నోటికి అడ్డం పెట్టేస్తారు… అబద్ధాన్ని ఆపాలని శరీరం చేసే ప్రయత్నం ఇది.. కానీ అప్పటికే బ్రెయిన్ నుండి గొంతు నాలిక ద్వారా ఆ మాటలు మాట్లాడించేసి ఉంటుంది…
టీనేజ్లో అబద్ధాలు ఇలా..
టీనేజ్ పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు తెలీకుండానే వారి ఒక చేయి పెదాల చివర టచ్ చేస్తారు.. అంతలోనే మళ్లీ చేయి తీసేస్తారు…
లౌక్యం బాగా పెరిగాక, పెద్ద వయస్సులో:
ఇక మధ్య వయస్సు వాళ్లు వీలైనంత వరకూ తమ భంగిమల్ని బయటపడనివ్వరు… దాంతో వాళ్లని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంటుంది… అయినా వాళ్లూ అబద్ధాలు చెప్తారు… అలా అబద్ధం చెప్పినప్పుడు చాలా వేగంగా ముక్కుని వేలు టచ్ చేసి నార్మల్కి వస్తుంది.. మీరు గనుక ఇంకా నిశితంగా గమనిస్తే.. అలా ముక్కు టచ్ చేసేటప్పుడు వాళ్ల కళ్లల్లో అసౌకర్యమూ బయపడుతుంది.
చిన్న అబ్జర్వేషన్ ఇలా చేయండి:
ఈసారి ఎప్పుడైనా టివిల్లో విలేఖరుల అడిగే ప్రశ్నలకు రాజకీయ నాయకులు సమాధానాలు చెప్పేటప్పుడు వారి చేయి ముక్కుని టచ్ చేసే సందర్భం చూడండి…
నేను ఎందరో మన రాజకీయ నాయకులు అబద్ధాల్ని ఇలా అర్థం చేసుకున్నాను… తర్వాత పేపర్లలో వాస్తవాలు బయటపడ్డప్పుడు నిదానంగా నా అబ్జర్వేషన్ కరెక్ట్ అని అర్థమైంది కూడా! సో మీరూ ట్రై చేయొచ్చు.
మరో ఇంట్రెస్టింగ్ విషయం మరోసారి చెప్తాను.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ఫొటో కర్టసీ: సైకాలజీ చదువుకునేటప్పుడు నేను సేకరించిన కలెక్షన్ నుండి.. ఆయా ఫొటోల వివరాలు ఆ క్లిప్పింగ్స్లో లేవు!
Leave a Reply