అర్థాలు భలే ధ్వనిస్తాయి.. ఆ ధ్వనింపులకు తగ్గట్లే స్పందనలూ వస్తుంటాయి..
కష్టాలో, సుఖాలో, ఇబ్బందులో ఇతరులతో పంచుకోవడం మనకు కామన్.
మన కష్టాలు జనాలకు "జాలి కోసం ఆరాటాలుగా" ధ్వనించొచ్చు.. టన్నుల కొద్దీ జాలీ కుమ్మరించబడి.. బక్కెట్ల కొద్దీ కన్నీళ్లని ఆ దయామూర్తులు ఆశించనూవచ్చు. మన కళ్లల్లో వారి జాలికి తగ్గ బాధ కన్పించకపోతే మన కష్టం కపట నాటకం అనేయనూవ
"ఏదో పెద్ద సముద్రాన్ని ఈదినట్లు వెధవ ఫోజులు కాకపోతే" అని మొదటి క్షణమే లోపల్లోపల ఏహ్యంగా చూడనూవచ్చు.
జాలో, సానుభూతో చాలామందికి అవసరం లేదు. మన వాళ్లు అనుకుని గుండెల్లో భారం తీర్చుకోవడానికి కష్టాలు చెప్పుకుంటే చాలు.. రంగూరుచీవాసనలు పులమకుండా విని ఓ చిరునవ్వుతో అవతలి వ్యక్తి మనస్సుని తేలికపరిచే తెలివితేటలు ఎందరికున్నాయి?
మన కష్టాలు భూతద్ధాల్లో కన్పిస్తాయి.. ఇతరుల కష్టాలు మైక్రోస్కోపుల్లో బ్యాక్టీరియాలా అన్పిస్తాయి.
బండరాయి వచ్చి మీదపడి నలిగిపోతూనైనా ఉందాం.. అంత బాధలోనూ అరుపుని బలవంతంగా తొక్కిపెట్టుకోవడం బెటర్. ఆ అరుపుకి సహాయం అందుతుందో లేదో తెలీదు కానీ బండలో ఇరుక్కుపోయిన మనవైపు ఏమాత్రం మానవ ప్రయత్నమూ చెయ్యని సానుభూతి మాత్రం సినిమాల్లో దేవతల కళ్ల నుండి ప్రసరించే కరుణాకటాక్షాల లాగా ప్రసరిస్తుంటుంది.
మన బాధలూ, మన గతాలూ, మన ఇబ్బందులూ జనాల "జాలి బ్యాంకు"ల్లో లైఫ్‌టైమ్ డిపాజిట్ల లాంటివి. బాధలు పోయి ఆనందాలు వచ్చినా.. ఆ డిపాజిట్లు కన్పించినప్పుడల్లా మానిన పుండుని రేపే కారంలా వెంటాడుతూనే ఉంటాయి.
మీరే ఓ బాధ పంచుకున్నారనుకుందాం.. రకరకాల మనుషులు.. రకరకాలుగా స్పందిస్తారు.. అస్సలు మన మానసిక స్థితి వారికి అనవసరం. ఆ స్పందనల్లో 99శాతం మనల్ని ఇరిటేట్ చేస్తాయి. కానీ తప్పదు వాళ్లు చూపించే concernకి ముందు ఆ జాలినీ, మన మెచ్యూరిటీ స్థాయిలకు సరితూగని సలహాలనూ భరించాల్సిందే.. తలపట్టుకోవలసిందే.
అందరికీ ఎప్పుడోసారి ఎదురయ్యే సమస్యే ఇది.. మన పట్ల concern చూపిన వారిని కించపరచట్లేదు నేను. మన బాధలకు రకరకాల అర్థాలు రకరకాల వ్యక్తులకు ధ్వనించడం వల్ల "షేర్ చేసుకుని భారం దించుకుందా"మన్న ఆశ కాస్తా "ఇదెక్కడి గోలరా బాబూ.. అస్సలు వీళ్లతో చెప్పకుండా నా బాధేదో నేను పడితే బాగుండేది కదా" అనే స్టేజ్‌కి పాపం పడిపోతుంది.
ప్చ్.. అర్థం చేసుకోరూ……..
స్వర్ణకమలం భానుప్రియ స్టైల్లో అర్థం చేసుకోండి.. పై లైన్‌ని!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply