తలెత్తి ఆకాశంలో చందమామ వైపు చూస్తున్నాను..
చుట్టూ నగరపు దర్పాన్ని వెలగబెడుతూ ధగధగా వెలిగిపోతున్న కాంతులెన్నో ఆకాశానికి ఎగబాకుతున్నా… ప్రతీ కాంతీ ఆ నిర్మలమైన కాంతి ముందూ నిలవలేక వెలవెలబోయేదే…
వెన్నెల మనస్సుని ఎంత పులకింపజేస్తుందో సున్నిత నాడీస్పందనలు మిగిలున్న మనుష్యజాతికి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.. ఆ వెన్నెల రాత్రులు నియోకల్చర్ అడుగుజాడల్లో కనీసం గుర్తు కూడా రానంత విలువ కోల్పోవడమే పెద్ద దురదృష్టం..
మనస్సు కలతపడితే కుమిలిపోతూ కూర్చోవడం తెలిసిన మనిషి… దిగులు ధరించి ఏ స్వాంతన పలుకుల కోసమో పరితపించే మనిషి.. ఒక్కసారి వెన్నెలొంకా.. చందమామొంకా.. తలెత్తి చూసే ధ్యాస కరువవడం కొరతేగా…! గుండె బరువుని దించే తోడు రోజూ కూడా వస్తున్నా.. ఏ వ్యర్థప్రయత్నాలతోనో మనస్సు కూడబలుక్కోవాలనుకునే తెలివితక్కువతనాన్నేమనాలి?
————
కళ్లు మిరిమిట్లు గొలిపేలా వెలిగేది వెలుగూ కాదూ… చీకటి మాటుల పబ్బుల్లో, పార్టీల్లో తెల్లారించుకునేది జీవితమూ కాదు…
సెల్ఫోన్ స్క్రీన్ల వైపూ, మోనిటర్ తెల్లటి తెరల వైపూ కళ్లకి నరకయాతన మిగుల్చుతూ, ఏ క్షణం ఈ మనిషి కళ్లు మూసుకుంటాడా అని కళ్లు ప్రాధేయపడేలా రోజుల్ని లాగించేయడమూ జీవితమే కాదు…
మనం దూరంగా జరిగిపోదామనుకున్నా ప్రకృతిలో మనం భాగమే…
చందమామనీ, వెన్నెలమ్మనీ.. చివరకు చురుక్కుమనే సూర్యుడినీ తప్పించుకోవాలనుకుంటే ఇంకేం మిగల్చగలుగుతుంది ప్రకృతి తనకు మాత్రమే సాధ్యమైన శోభని మన జీవితంలో!!
జాబిల్లిని కప్పేస్తూ వడివడిగా సాగిపోయే మేఘాల రూపురేఖల్ని తన్మయత్వంతో మనస్సుతో తాకితే వచ్చే అనుభూతులు ఎన్ని సినిమాలూ, ఎన్ని గంటల ఛాటింగ్ కబుర్లూ మిగల్చగలవూ…
————-
జీవితం తెల్లారకముందే వెన్నెలని ఆస్వాదించకపోతే మిగిలేది చీకటే.. ఇది గ్రహిస్తే చాలు ప్రతీ ఒక్కళ్లం!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply