సాయంత్రం కాసేపు డాబా మీదకెళ్లి చంద్రుణ్ణి చూస్తూ చుక్కల వరుసల్ని అబ్బురంగా చూడాలన్న ఆలోచన కలిగి ఎన్నాళ్లవుతోంది?
కాసేపు బండిని, కారుని పక్కన పడేసి… అలా నడుచుకుంటూ పరిసరాల్ని చూసుకుంటూ వెళ్లడం మనకు మిగిలున్న జీవితంలో సాధ్యపడే పనిలాగే తోస్తోందా… అస్సలు ఆ ఆలోచన వస్తుందన్న నమ్మకం ఉందా…?
తెలీకుండానే అందరం కొన్ని ఆలోచనల మధ్య ఇరుక్కుపోతున్నామనిపిస్తోంది…. అంతకుమించి లైఫ్‌ని ఊహించుకోలేకపోతున్నాం…
భిన్నంగా ఎలాగుండాలో తోచనూ తోచట్లేదు… భిన్నంగా ఉండాలన్న ఆసక్తీ ఏ కోశానా లేదు…
ఆఫీసూ.. ఇల్లూ.. ఉంటే పిల్లలూ… టివి… బోర్ కొడితే కంప్యూటరూ.. గానుగెద్దు జీవితం…. కొత్తదనం పట్ల ఇంకెక్కడ ఆసక్తి వస్తుంది?
మనస్సు స్వభావం చంచలం….. అంటే నిరంతరం మనస్సులో ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి…. ఆ ఆలోచనలు 90% ఈ క్షణం మనం ఉన్న పరిసరాలూ, మనుషులూ, మానసిక స్థితి చుట్టూనే తిరుగుతుంటాయి…. అవి అక్కడ తిరిగినంత కాలం మనస్సు వేరే అంశం వైపు మళ్లించబడలేదు…. బలవంతంగా మనం మళ్లించుకుంటే తప్ప!
అందుకే జీవితాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి తప్ప… రొటీన్‌గా సాగే జీవితంలో రొటీన్ మనుషులుగా మిగిలిపోతే చాలా నిస్సారంగా అన్పిస్తుంది లైఫ్!
ఈరోజు మనకు కొత్త రకాల ఆనందాలు కావలసి వస్తున్నాయి… ప్రతీ క్షణం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం… కారణం మనం ఈ జీవితంతో చాలా విసుగెత్తి పోతున్నాం….
విసుగెత్తిన జీవితాన్ని రీఏక్టివేట్ చేసుకోవడానికి కొత్త ఆనందాలు అవసరం లేదు… మనం ఆస్వాదించలేకపోతున్న పాత అభిరుచులు చాలు…
అంటే సినిమాలకో, పబ్‌లకో, రెస్టారెంట్లకో, కాఫీడేలకో, డ్రైవ్లకో వెళితేనో జీవితం హాపీగా ఉంటుందనుకోవడం.. చాలా చాలా చిన్న జీవితాన్ని చూస్తున్నట్లే..
ప్రేమగా మొక్కలకు నీళ్లు పోసినా చాలా సంతోషంగా ఉంటుంది…. (ఇది ఆడవాళ్లు మాత్రమే చేయాల్సిన పని అని మళ్లీ మైండ్‌లో restrictions పెట్టుకోపోతే)
సోది చెప్పి చంపేస్తున్నారు అని విసుక్కోకుండా.. తాత ముత్తాతల దగ్గర కూర్చుని కబుర్లు, అనుభవాలు మనస్ఫూర్తిగా వింటున్నా ఆనందం కలుగుతుంది…
ట్రాఫిక్‌లో బండి ఆగిపోయి ఎంతకీ స్టార్ట్ అవక మన తోవకు అడ్డంగా ఉన్న మనిషిని చిరాకుగా చూడడం మానేసి… ఓ చిరునవ్వు నవ్వు పక్కకు తప్పుకుని వెళ్లినా సంతృప్తిగా ఉంటుంది….
కష్టపడే వ్యక్తిని మనసారా అప్రిషియేట్ చేస్తే ఆనందం రాదా…?
చిన్న ఉదాహరణ చెప్తాను.. ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల ఓ హాస్పిటల్‌కి వెళ్లి వస్తూ ఉన్నాను.. అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ పేరు తెలుసుకుని మనస్ఫూర్తిగా వెళ్లినప్పుడల్లా పలకరిస్తుంటే ఆవిడ ఎంత సంతృప్తిగా నవ్వుతుందో…. ఆ నవ్వు చూస్తే హాస్పిటల్ వాతావరణంలో ఉన్నానన్న నా బెరుకు మాయమవ్వదా?
పాజిటివ్ ఎనర్జీస్నీ, హాబిట్స్నీ కల్టివేట్ చేసుకోవాలే గానీ దేనిలో ఆనందం లేదూ….?
ఆనందం కోసం వెంపర్లాడినంత కాలమూ అది మనకు అస్సలు దక్కదు.. దక్కిందనుకుని లోకానికి ప్రదర్శించుకోగలుగుతామే తప్ప అలా వెంపర్లాడి పొందాలనుకున్న ఆనందం ఎప్పుడూ వెలితిగానే ఉంటుంది….
ఆనందం స్వభావసిద్ధంగా మన పనుల్లో ఉండే విభిన్నత, పాజిటివ్ నేచర్ ద్వారా కలగవలసింది….!!
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
yes sir. aina meru okariki samadhanam cheppalsina avasaram ledani na abhiprayam. alochinche manastatvam unnavallaitey thappakunda artham chesukuntaru.