ఎక్కడెక్కడివో రంగుల కాంతుల కలబోతతో కళ్లని కనువిందు చేస్తోందీ ప్రాంతం…
చెట్లపై వెలుగు నీడల గమ్మత్తు అందం ఓ వైపూ… దారెంట అలికేయబడిన నీడల అద్భుతం మరోవైపూ…. ఆస్వాదించాలే గానీ మాయా వర్ణాల్లో ఎంత మైమరపు పొంచి లేదూ….?
అలికిడి లేకుండా పొదల పక్కన ఒదిగి కూచున్న జంటల మొహాలపై కూడా ఆ వెలుగు, చీకట్ల కలబోతే…
దేహాల్లో హృదయాల్ని తడిమి చూసుకునే ప్రయత్నమేమో… ప్రపంచపు ఎరుకు లేకుండా మైమరిచి చేస్తూనే ఉన్నారు…
హృదయాల మమైకానికీ…. దేహాల మోహావేశాలకూ…. మధ్య అగాధమంత లోతుని జీవితకాలంలో అర్థం చేసుకునే అదృష్టం ఏ కొందరికైనా ఉంటుందో లేదో…!!
ఎక్కడ చూసినా… పెనవేసుకుపోవాలన్న ప్రయత్నాలే… భుజాలు మొదలుకుని….!! అది వేలెత్తి చూపలేని ప్రేమ కావచ్చు… పొసెసివ్నెస్ కావచ్చు… ఎక్కడ తన వ్యక్తి చేజారిపోతారోనన్న అభద్రతా కావచ్చు… దేహాలతో మాట్లాడుకునే ప్రయత్నాలే ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య…. మనస్సుతో మాట్లాడుకోవడం చేతకాక!!
నిజంగా వెలుగుని ఓ మూలకు నెట్టేసి… ఉండీ లేనట్లు చేసి… పరిసరాన్నంతా తానే ఆక్రమించుకునే చీకటి కల్పించినంత భ్రాంతి వేరేదీ కన్పించదేమో…. అందుకే క్యాండిల్ లైట్ డిన్నర్లు మొదలుకుని…. వెలుగు జిలుగులతో మెరిసిపోయే ఫంక్షన్ల వరకూ చీకట్లోనే పూర్తి వెలుగుని పరిమితం చేసేసి సెలబ్రేట్ చేసుకోబడుతుంటాయి…
మసకబారిన వెలుతురులో దేహాల్లో కొత్త శోభలను వెదుక్కునే డిస్కో థెక్ కల్చర్లకూ ఈ చీకటే ఆధారం…
ఎందుకు చీకటి గురించి ఇంతగా చెప్పుకోవలసి వస్తోందంటే….
చీకటి మభ్యపుచ్చుతోంది… చీకటి హృదయాల్ని తడమనీయట్లేదు…. దేహాలతో సరిపెడుతోంది…. చీకటి భ్రాంతుల్నీ, ఆశల్నీ, కోరికల్నీ… చివరకు ద్వేషాల్నీ ఉసిగొల్పుుతోంది…
హృదయంతో, ప్రేమతో సంబంధం లేకుండా… మోహంతో చీకట్ల నడుమ బలపడే బంధాలకు జీవితాలు జీవితాలు బోరున ఏడుస్తూ చీకట్లలో మగ్గిపోయే ఒంటరితనం పొంచి ఉంది… దేహమే జంటగా ఉండడం చూసుకుంటే… ఆ దేహం వ్యామోహాలు తీరగానే దూరమవుతుంది…. మిగిలేది ఒంటరితనమే…..
దేహాలు కాదు బంధాల్ని బలోపేతం చేయాల్సింది…. హృదయాలు… రెండు heart సింబళ్లతో ఎక్స్ప్రెస్ చేసుకుని… మభ్యపుచ్చుకునేటంత అల్పమైనవి కాదు… హృదయాలంటే!!
అందుకే హృదయాలకు చీకట్లు అవసరం లేదు… దేహాలకే కావాలి…. హృదయాలు ఎంత వెలుగుతో ఒకదానితో ఒకటి పెనవేసుకుపోతే ఆ బంధం అంత సుదీర్ఘకాలం పటిష్టంగా మిగిలిపోతుంది….
దేహపు కోరికలు తప్పని కాదు… కానీ వాటికి సమయమూ, సందర్భమూ… హృదయాల మధ్య హార్మోనీ వంటివన్నీ కలిసొచ్చినప్పుడు వాటికంటూ స్థానం ఎక్కడికీ పోదు…
మన శరీరం మన ఇష్టం అనుకోవడం… బానే ఉంటుంది….శరీరమూ, నరాలూ, ఉద్రేకాలూ ఎంజాయ్మెంట్ ఇచ్చినంత సేపూ….
ఆ శరీరాన్ని కలిగిన మనిషి యొక్క మనస్సు మనతోనే ఉందన్న భ్రమ విడిపోయే క్షణమే జీవితం దుర్భరం అన్పిస్తుంది…
అందుకే శరీరాలతో మనస్సుల్ని కట్టిపడేయడం వ్యర్థ ప్రయత్నం… మనస్సులతో శరీరాలు ఎటూ ఏకం అవుతాయి…
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply