5×5 = ఎంత? 25నే కదా..
ఓ హోదా x ఓ మూర్ఖత్వం = దీనికి కరెక్ట్ ఫలితం చెప్పగలమా? చెప్పలేం కదా!
నాలెడ్జ్ x ఇగోనీ అలాగే multiply చెయ్యలేం…
అందం x లెక్కలేనితనమూ అంతే..
ఈ లెక్కలకు ఓ లెక్క ఉంది.
కష్టపడో, అవకాశాలు కలిసివచ్చో.. పైరవీలు చేసో ఎలాగోలా ప్రతీ మనిషీ నిన్నటి కన్నా ఓ మెట్టు పైన ఉండడానికి ప్రయత్నిస్తాడు, సాధిస్తాడు బానే ఉంది.
కానీ చిక్కల్లా ఇక్కడే వస్తుంది. హోదా దర్జాని తెస్తుంది.. డబ్బూ, అందం లెక్కలేనితనాల్ని తెస్తాయి.. పేరు ప్రఖ్యాతులు అహాన్ని పెంచేస్తాయి.. అవి ఓ లేయర్‌గా మనల్ని కమ్ముకునేటప్పుడే ఓ తెలీని హాయీ ఆవరిస్తుంది.. అవి రక్షణావలయాలనుకుంటాం.. ఓ భ్రమలో మనల్ని ఇరికిస్తున్న ఉరితాళ్లని అర్థం చేసుకోలేం.
చిన్నప్పటి నుండీ చూస్తూనే ఉన్నాను.. మనం మాట్లాడుతుంటే లెక్కలేనితనంతో కళ్లెగరేస్తూ.. మన స్థానాన్ని చులకన చేయబోయే ఇరుకు మనసుల్ని 🙂
అదే చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను.. "భృకుటి ముడివేసి ఆసక్తిగా వింటున్నట్లు నటిస్తూ మేధావితనం ఒలకబోస్తూ లోపల్లోపల చిన్నచూపు చూసే నైజాల్ని"
బాడీ లాంగ్వేజ్‌లు ఎవడు కనుగొన్నాడో గానీ.. పెదాల చివర్న వంపుల్నీ పాజిటివ్‌గా తిప్పేస్తూ ఓ false impression ఎదుటి వాళ్లకు కల్పించడం కోసం ఆర్టిఫీషియల్‌గా ప్రవర్తించే బాపతు జనాలూ నా కంట పడ్డారు.
సరే అదలా ఉంచితే.. రేపు మట్టికొట్టుకుపోయే ఈ శరీరానికి అంత మిడిసిపాటు ఎందుకు?
మన నాలెడ్జ్, మన హోదా ఆఫ్టరాల్ సముద్రంలో నీటి బొట్టంత కూడా ఉండవు.. కానీ ఎదుటి వ్యక్తికి మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా చేతులెందుకు తటపటాయిస్తాయి? అవతలి మనుషుల్ని అర్హతల్ని ఎందుకు బేరీజు వేస్తాయి? అంత విలువైన వాళ్లమా మనం?
నాలెడ్జ్‌తో పాటే ఇగోనీ, హోదా, డబ్బులతో పాటే మూర్ఖత్వాలూ, లెక్కలేనితనాలూ ఒంటబట్టించుకుని… చిల్లుగవ్వకు కూడా పనికిరానంత దిగజారుతున్నాం అన్న విషయం ఎంతమంది గ్రహించగలుగుతున్నారు?
ఓ ప్రభుత్వాఫీసులో ఫ్యూనూ తన స్థాయిలో దర్జాని ఒలకబోసేవాడే.. అతని దర్జాని పాపం చిన్న చిన్న పనులకోసం వెళ్లే వాళ్లు బలవుతుంటారు.
ఓ గవర్నమెంట్ ఉద్యోగీ దర్జాని ఒలకబోసేవాడే.. తన దర్జాని తప్పక భరించే తనతో పనిపడిన అల్పజీవుడు దొరికినప్పుడు.
ఓ మీడియా ప్రతినిధికీ లెక్కలేనితనమే.. ఏదో తాను ప్రపంచాన్ని శాసిస్తున్నట్లు..
చిన్నదో పెద్దదో ఇండస్ట్రీ పెట్టినోడూ నలుగుర్ని వెంటేసుకుని తిరుగుతూ తననితాను మోసం చేసుకుంటూనే ఉంటాడు..
ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి.. నేను ఒక ఎడిటర్నన్న దర్జా నాకూ వస్తే నన్ను నేను క్షమించుకోను
ఇక్కడ నేను ఏ వర్గాన్నీ చులకనగా చూడట్లేదు… మన హోదా వేరూ, మన నాలెడ్జ్ వేరూ, మన అందం వేరూ… మన వ్యక్తిత్వం వేరూ అన్న ఒక్కటే క్లారిటీ మనుషుల్లో ఎందుకు లోపిస్తోంది అన్నదే నా మెయిన్ పాయింట్.
అస్సలు మనం బ్రతుకుతన్న ప్రపంచం పరిధి ఎంతని ఇంత ప్రయాస?
అటు చూస్తే ఓ వందమంది ఇటు చూస్తే ఓ వందమందీ.. అటో 100 కిలోమీటర్లు, ఇటో 100 కిలోమీటర్లు మనమంటే ఎవరమో జనాలకు తెలుసేమో. ఈ మాత్రానికి ఏదో ప్రపంచంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయినట్లు రకరకాల పైత్యాల్ని వంటబట్టించుకుని మనల్ని మనం మోసపుచ్చుకోవడం వృధా ప్రయాసగా అన్పించట్లేదా?
చివరిగా ఒక్కటే మాట.. మన కష్టపడే తత్వం వల్లనో, ఏ ఇతర కారణాల వల్లనో మనం ఓ మంచి పొజిషన్లో ఉన్నాం.. ఆ పొజిషన్ శాశ్వతం కాదు.. రేపు ప్రాణం పోయాక ఆ పొజిషన్లో కూర్చోబెట్టి దహనం చెయ్యరు. ఈ మాత్రం దానికి బ్రతికి ఉన్నప్పుడు ఇగోలూ, అహంకారాలూ, లెక్కలేనితనాలూ, పైకీక్రిందికీ చూడడాలూ, "ఆ చెప్పు…" అని ఏదో పరధ్యానంలో బిజీగా ఉన్నట్లు ఒకటికి రెండు సార్లు అవతలివార్ని రెట్టించడాలూ చేసి మనల్ని మనం దిగజార్చుకోవడం అవసరమా కాదా అన్నది ఆలోచిద్దాం.
థాంక్యూ
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Wow ….Nice article….i have that Aha cheppu mentality….now onward i will change
Chala Baga raasaru!!oka position lo vundi kuda ela aalochinche vaalu chala taakuva..elanti philosophy on life ravatam chala kastam but you are great..great analysis of human nature. the way you explained about individual’s greatness based on their hard work or anyother factors…is 100% correct..
everyone should adopt this ego less nature for self devlopment and harmony in the society.