అభద్రత తొంగిచూడడం ఆలస్యం.. మేకపోతు గాంభీర్యం మాటల్నీ, చేతల్నీ చుట్టేస్తుంది. కుదేలయిన క్షణమూ.. లేని మొండితనం ప్రదర్శిస్తూ అస్థిత్వం బలహీనమవకుండా సవాలక్ష జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మొండితనమే మన ఆయుధం. శత్రువులా వెంటాడి వేటాడే ప్రపంచాన్నీ, మనుషుల్నీ ఎదిరించి నిలదొక్కుకోవాలంటే మొండిగా బ్రతకాల్సిందే, మనసుని రాతిని చేసుకోవలసిందే. ఈ వైచిత్రిలో ఎన్నో సున్నిత హృదయాలు.. స్పందనలే లేనంత బండబారిపోతుంటే అది చూస్తూ బాధతో స్పందించే హృదయం మిగిలి ఉండడం అదృష్టమో, దురదృష్టమో అంతుపట్టదు. చిన్న నవ్వుకే పొంగిపోయే భోళాతనం ఇప్పుడెక్కడ? ఎంత కఠినశిలలమైతే అంత స్థితప్రజ్ఞులం అన్నమాట. దేనికీ చలించనంత బండబారిపోయే పరిణామక్రమంలో ఎన్నో శోభగాలను వదిలించుకుంటున్నాం.. అలా వదిలించుకోపోతే ఆ చంచలత్వమే మనల్ని మానసికంగా చిత్రవధకు గురిచేసే విచిత్రమైన పరిస్థితి. సున్నితత్వాన్ని పొలుసులుగా విడిచేసి కాఠిన్యాన్ని సంతరించుకోవడంలో ఎంత ఆనందమో మనకు! బేలతనం ఇక ఉండబోదన్న నిశ్చింతే మనకు కావలసింది. ‘హృదయమనేదే నీకసలు లేద’ని ఎవరైనా అంటే ఎంత పరమానందమో! ఏ హృదయపు చప్పుడుల కోసమైతే స్నేహాలూ, బంధాలూ, ప్రేమలూ పరితపించేవో ఆ చప్పుడులు ఎప్పుడో ఆగిపోయాయి. కొండొకచో స్పందించే హృదయాలు మిగిలినా.. ఆ స్పందనలు మనుషులు నరనరానా దట్టించుకున్న వెకిలితనం ముందు అవహేళన అవుతున్నాయి. గాఢమైన స్పందన మనుషుల మొద్దు బుర్రల్ని స్పృశించలేక పలుచబడిపోతోంది. మనిషికి జన్మతః ఉండే కొద్దోగొప్పో సున్నితత్వం కూడా మాయమైపోతుంటే ఇంకేమి మిగిలుంటుంది? కోటులూ, బూటులూ మధ్య ఒలకబోసే డాబూదర్పం.. బుర్రని పురుగులా తొలిచేసి ఆక్రమించుకుపోయిన తలబిరుసుతనమే మనం భ్రమిస్తున్న నిండైన వ్యక్తిత్వం. రక్షణావలయం నిర్మించుకున్నామని సంతోషిస్తున్నాం తప్ప స్వయానా బంధీఖానాలో ఇరికించుకుంటున్నామన్న స్పృహ తట్టడం లేదు.
//చిన్న నవ్వుకే పొంగిపోయే భోళాతనం ఇప్పుడెక్కడ? ఎంత కఠినశిలలమైతే అంత స్థితప్రజ్ఞులం అన్నమాట.
ఎంత బాగా చెప్పారు( !!
శ్రీధర్ గారికి నమస్కారం,
మీ బ్లాగులో ఇదే మొదటిసారి పాల్గొనడం.ఆ భోళాతనాలు ఇప్పుడెక్కడ? నిజమే ఈకాలంలో భోళామనసుతో మనుగడ సాగించగలమా?ప్రతిఒక్కరు ఎదుటి వాడిని ఎలా మోసం చేయాలని చూడడమే తప్ప, మనిషి లోని సున్నితత్వాన్ని అర్థం చేసుకునే వారెందరు ప్రస్తుత సమాజంలో ఉన్నారండి?ఎక్కడ చూసిన దగా,మోసం, కుట్ర తప్ప మంచితనం మచ్చుకైనా కనిపిస్తుందా?ఇక మన పిల్లలకు ఎలా ఉండమని చెపుదాం,భోళాగానా లేక కల్మశంతోనా?
ప్రతిఒక్కరు ఆలోచించాల్సిన అంశం ఇది.మంచితనాన్ని అమాయకత్వం,చేతకానితనం అనుకొనే రోజులు ఇవి.ఎలా బ్రతకాలో…
మీతో నేను నూరు శాతం ఏకీభవిస్తానండి. ఏదో ప్రవాహంలో కొట్టుకొని పోతున్నట్టు అందరం మారిపోతున్నాం. మన వ్యక్తిత్వాలకేమవుతుందో, పిల్లలకేం నేర్పిస్తున్నామో అర్ధమే కావటం లేదు. సున్నితత్వమూ, ప్రేమా, ఆప్యాయతా స్నేహమూ అన్ని విలువలూ మాసిపోయి కేవలం జీవితపు పరుగు పందెంలో “గెలుపూ” “ఓటమీ” అన్న రెండు పదాలే వినపడుతున్నవేళ…..
శారద