కనురెప్పలు భారంగా మూతపడి గాఢ సుషుప్తిలోకి జారుకోబోయే లోపు మిగిలే సంధి సమయాన్ని ఎవరైనా అచేతనమయ్యే బుర్రని తట్టిలేపి జ్ఞాపకాల్లో పదిలపరిచే ప్రయత్నం చేశారా ఎప్పుడైనా?
మెలకువ మాయమై కలలు కమ్ముకునే ఆ కొద్ది వ్యవధిలో ఎన్ని మాయలో… ఏ మాయా గుర్తుండదు…
అలసట తాలూకూ చిరాకుకి మనస్సు స్పందించడం మానేసి… అలసటని తీర్చే పనిని శరీరపు కణజాలానికి అప్పజెప్పేసి… నుదుటి వరకూ తలనొప్పులుగా మిగుల్చుకున్న ఆలోచనల చిక్కుముళ్లని వదులు చేస్తుంటే… మెదడులో తరంగాల రూపంలో విహరించే ఆహ్లాదం చేతనాప్రపంచంలో ఎప్పుడూ మనకు ఎంత ప్రయత్నించినా దక్కే ఛాన్సే లేదు.. 🙂
ప్రపంచంలోని ఇన్ని దేహాలూ, హృదయాలూ… సూర్యుని వెలుగు రేఖల సమయానికి కొంగ్రొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటున్నాయంటే… అలసట నుండి విశ్రాంతికీ.. విశ్రాంతి నుండి మెలకువకూ మనల్ని ప్రయాణింపజేసే కొన్ని ఘడియల మేజిక్కుల వల్లనే…!! ఈ మేజిక్ ఘడియలూ దక్కించుకోలేకపోవడం వల్లే కొన్ని నిద్రలు ఎప్పుడూ కలత నిద్రలుగానే మిగిలిపోతాయి.. పగళ్లని చిరాకులతో నింపేస్తాయి.. 🙂
నిజంగా సాధ్యపడని ఎన్ని అనుభూతులూ.. నిజమైపోతే బాగుణ్ణన్పించే ఎన్ని వలయాలూ….
వాస్తవం నుండి గాఢ విశ్రాంతిలోకి జారుకునే ప్రక్రియ గమనించి ఆస్వాదించాలే గానీ ఎంత అద్భుతమైనదో…
బ్రెయిన్లోని కోట్లాది న్యూరాన్లు లయబద్ధంగా సంగీతాన్ని వాయిస్తున్నట్లు రకరకాల తరంగాల్ని అణువణువుకూ చేరవేస్తుంటే… భౌతిక ప్రపంచంలో ఒకేలా సాగిపోయే ఆలోచనలు స్వేచ్ఛాజీవులుగా ఊపిరి పోసుకుంటుంటే… బుద్ధి గనుక కాస్తో కూస్తో స్పృహలో ఉంటే ఆ అనుభూతుల్ని ఎలా నిర్వచించుకోగలుగుతుంది…
కళ్లూ, నిద్రా, కలలూ ఉన్నంత మాత్రాన సరిపోదు… కనురెప్పలు బిగుతుగా మూతబడే ముందు.. మూతబడీ మూతబడని సుషుప్త స్థితిలో సృష్టించబడే alice in wonderland లాంటి అద్భుత ప్రపంచాల్ని సబ్ కాన్షియల్ మైండ్ ఆస్వాదనలోకి తీసుకోవడం చేతకాపోతే నిద్రకు అందమెక్కడిది? 🙂
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
httP://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
…మూతబడని సుషుప్త స్థితిలో సృష్టించబడే alice in wonderland లాంటి అద్భుత ప్రపంచాల్ని…. Awesome!