చాలా సాధన కావాలి….
ఈ ప్రపంచం వదిలిపెట్టదు….
ఏవో ఒక మెలికల్లో బంధించేస్తూనే ఉంటుంది…
ఎక్కడికక్కడ ఆలోచనలు తెంపుకుని సాగాలనే ఉంటుంది.. కానీ ఓ పట్టాన తెగదు… ఆలోచన వెంబడి మరో ఆలోచన పునఃసృష్టించబడుతూనే ఉంటుంది…. ఈ ప్రవాహం కాస్తా సుడిలా ఓచోట కుదేస్తుంది…
ఇది కాదు జీవితం అని తెలుసు…. ఈ ప్రాపంచిక విషయాలు జీవితేచ్ఛ కోసం కృత్రిమంగా నిర్వర్తిస్తున్న క్రతువులనీ తెలుసు.. కానీ ఏ బంధుత్వాల్లోనో, సరదా అయిన రిలేషన్స్లోనో, కాపీ, పేస్ట్ పోస్టుల్లాంటి అతి సాధారణ విషయాల్లోనో ఓ క్షణం ఆగి… మళ్లీ నడక సాగాన నవ్వుకోవలసి వస్తుంటుంది..
భౌతిక జీవితంతో ఆత్మని వేరు చేసి… ముందుకు సాగడం ప్రతీ క్షణం కత్తి మీద సామే… కానీ సాధ్యమవుతోంది… రోజురోజుకీ ఇంకాస్త మెరుగ్గా… సాధన పరిపక్వత చెందే కొద్దీ మరింత అలవోకగా!!
పేరూ, డబ్బూ, కీర్తీ, ప్రతిష్టలూ…. ఇంకేవో.. ఇంకేవో కోసం.. సాగుతున్న జీవితంగా అన్పించే జీవితాన్ని నిర్మలంగా ఏ ఇచ్ఛా లేకుండా ముందుకు నడపడం… గమ్యానికి చేరువవుతున్నట్లుగా ఉంది…
మాటల వేదాంతమా అని పలుమార్లు తరచి తరచి సందేహించి ఏళ్లు గడిచిపోయాక.. ఇప్పుడు గమ్యం తప్ప సందేహాలేమీ మిగల్లేదు….
ఎక్కడికి చేరాలో…. దానికేం చేయాలో… స్పష్టంగా అర్థమవుతూనే ఉంది…..
టెక్నాలజీ, మనుషులూ, సమాజమూ, స్నేహితులూ, బంధువులూ…. ఎన్ని లింకుల మధ్య ఇరికించుకున్న జీవితేచ్ఛో…. ఇదంతా స్వయంకల్పితమని గుర్తొచ్చినప్పుడల్లా… సమాజం పట్ల నేను ప్రదర్శించే ఆవేశానికీ, మానవ సంబంధాల గురించి రాసే మాటలూ, తాజా టెక్నాలజీ విషయాలూ… అన్నీ ఎంత బాధ్యతగా.. నాటకాన్ని రక్తికట్టించగలుగుతున్నానో అర్థమై… వద్దనుకున్న క్షణం మాయమయ్యే ఈ మాయాప్రపంచం పెదాలపై ఓ చిరునవ్వుని మెరిపిస్తోంది….
వడివడిగా నడుస్తూనే ఉన్నాను…. భౌతికంగా చాలా ఉత్సాహంగానూ…. అంతర్లీనంగా చాలా స్వేచ్ఛగానూ…. గమ్యం వైపు!!
ఆ గమ్యానికి చేరువయ్యే మానసిక ఔన్నత్యం.. భౌతిక విషయ వాంఛల నుండి విడిపడి మరింత సమకూరాలని కోరుకుంటూ.. దాని కోసం సాధన చేస్తూ….
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply