మనం నేర్చుకున్నదీ బయట జరుగుతున్నదీ ఒకదానికొకటి పొంతన లేనప్పుడే మెంటల్ స్ట్రగుల్ మొదలవుతుంది…
ఒకటి రెండు తరాల క్రితం వరకూ చిన్నప్పుడు morals చెప్పేవారు.. అంత మోతాదులో కాకపోయినా ఇప్పుడూ అక్కడక్కడ కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారనుకోండి…
పిల్లల్లో మంచీ, చెడూ అనే రెండు భావాలు నాటబడతాయి… ఏది మంచీ ఏది చెడూ అన్న డెఫినిషన్లు ఒక్కో పేరెంట్‌కీ ఒక్కో విధమైన డెఫినిషన్లు ఉంటాయనుకోండి మళ్లీ.. ఆ పేరెంట్స్ చరిత్రా, ఇప్పటి వారి సోషల్ డ్రైవ్ ఎలా సాగుతోందో దాన్ని బట్టి ఈ డెఫినిషన్లలో మసాలా దినుసులు మారుతుండేవి…
సరే అదలా పెడితే.. ప్రపంచం అనేదే తెలీని వయస్సులో మంచీ.. చెడూ అనే రెండు పదాలు అలవాటు చేశాక.. పిల్లలకు సహజంగానే “ఏది మంచి, ఏది చెడూ” అని చీటికీ మాటికీ డౌట్ వస్తూనే ఉంటుంది.. పేరెంట్స్ చెప్పలేక సతమతమవుతూనే ఉంటారు.
సరే దీన్ని కూడా అలా పెడదాం…
———————-
ఒకరికి అస్సలు డబ్బు లేని బాల్యం… మరొకరికి గొడవలు పడే తల్లిదండ్రులూ, బలంగా లేని రిలేషన్లూ… ఇంకొకరు ఏ ఢోకా లేకుండా దర్జాగా బ్రతికిన బాపతూ..
ఇలాంటి వ్యక్తులంతా కలిసి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ బయట సొసైటీలో తిరుగుతుంటారు… ఎవరి ప్రయారిటీలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి గోల్స్ వారివి.. పక్కోడు ఎందుకలా ముభావంగా ఉంటున్నాడో సరదాగా ఉండడమే చేతనైన వాడికి అర్థం కాదు.. ఇంకొకడు పైసా పైసా అంత జాగ్రత్తగా ఎందుకు వాడుతుంటాడో అర్థం కాక ఏదో ఒక బ్రాండింగ్ వేసేస్తాడు మరొకడు..
అలాంటి లైఫ్స్టయిల్స్ పక్కన పెడితే…. ఎవరి ఆలోచనలూ ఇంకొకరి ఆలోచనలకు అస్సలు match కావు కూడా ..!!
కొందరు మోరల్స్ అంటారు.. మరికొందరు “నా ఇష్టం” వచ్చినట్లు నేనుంటానంటారు…. ఈ ఇద్దరూ ఒకర్నొకరు క్వశ్చన్ చేసుకుంటారు.. గొడవపడతారు… మనస్సు కష్టపెట్టుకుంటారూ.. ఒకరికొకరికి సరిపడదని లైఫ్ లాంగ్ దూరంగా జరిగిపోతారు.
—————————–
ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం…
———————–
అస్సలు మీరైనా, నేనైనా top to bottom మన స్వంత ప్రోడక్ట్ కాదు.. అది మనకు తెలుసు… మనం పేరెంట్స్చే, ఎన్విరాన్మెంట్చే, మనల్ని ఎక్కువ ప్రభావితం చేసిన లీడర్లచే, రచయితలచే, టీచర్లచే, చివరకు న్యూస్‌పేపర్లు, టివి ఛానెళ్లచే భారీగా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యబడుతున్నాం…
సో మన ఆలోచనలు, మన అభిప్రాయాలూ మన స్వంతం కాదు.. మనం వేటినీ స్వంతంగా విశ్లేషించట్లేదు.. రకరకాల బలమైన మాధ్యమాలచే రుద్దబడిన వాటిని మోసుకు తిరుగుతున్నాం.. కాస్తో కూస్తో మేధస్సు ఉండబట్టి ఆ స్టాంప్ అభిప్రాయాలను కొద్దిగా బ్రెయిన్‌తో ప్రాసెస్ చేసినట్లు చేసి.. “ఇక నేను చెప్పేదే కరెక్ట్” అని ఫైనలైజ్ అవుతున్నాం.. అవకాశం ఉంటే టివి ఛానెళ్ల డిబేట్లలోనో… అవకాశం లేకపోతే Facebook డిస్కషన్లలోనూ ఆవేశాలు పెంచేసుకుంటున్నాం.
సో మన మంచికి ఓ ప్రామాణికత లేదు.. మన చెడుకు ఓ ప్రామాణికత లేదు… మనకు “చెడు” అన్పించిన దాన్ని చేసేవాడిని శాపనార్థాలు పెట్టుకుంటూనే మనల్ని మనం మభ్యపుచ్చుకుంటున్నాం… అలాగే మనకు మంచి అయినది ఇంకొకడికి “చెడు”గా ఎందుకు అన్పిస్తోందో, వాడి లాజిక్ ఏమిటో అర్థం కాక వాడినీ తిట్టుకుంటున్నాం…
సొసైటీ, సోషల్ రిలేషన్లలో ఇంత complexed సైకాలజీల్ని, వ్యక్తిత్వాల్నీ ప్రాసెస్ చేసి బాధపడేకన్నా ఎవరి దారిన వారిని జీవించనిస్తూ మన ఆలోచనల్ని తటస్థంగా పెట్టుకుంటూ సాగడమే మంచిది.. చాలా ప్రశాంతంగా ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply