పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ।। 21 ।।
ఏ జ్ఞానము చేతనయితే భిన్నభిన్న దేహములలో ఉన్న వివిధ రకముల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.
వివరణ:
నా కులమే గొప్ప, నా మతమే గొప్ప, నా ప్రాంతమే గొప్ప, నా దేశమే గొప్ప, మనుష్య జాతే గొప్ప..
రచయితలు సమాజంలో గొప్ప వాళ్లు.. మగవాళ్లు గొప్ప వాళ్లు.. నాలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్లు చాలా అరుదు.. ఫలానా హీరోని అభిమానించకపోతే శుద్ధ దండగ..
ఇలా మాయ అనేక విధాలుగా మన జీవితంలో పెనవేసుకుపోయి ఉంటుంది. సృష్టిలోని ప్రతీ జీవీ అది నివశిస్తున్న ప్రదేశం, తెగ, జాతి, కలిగి ఉన్న అభిప్రాయాలు, అభిరుచులు, జెండర్లకు ఆతీతంగా అన్నింటిలోనూ ఒకే రకమైన ఎనర్జీ (శక్తిరూపకం) సోల్ రూపంలో దాగి ఉంది అన్నది తెలుసుకోవడం సత్త్వ గుణ జ్ఞానమని భగవానుడు గత శ్లోకంలో ఎలాగైతే చెప్పారో ఈ శ్లోకంలో రాజస జ్ఞానం గురించి చెబుతున్నారు. ఏ మనిషైతే పైన చెప్పిన విధంగా వాళ్లు వేరు, నేను వేరు అని ప్రతీ దానితో తనని తాను సపరేట్ చేసుకుంటూ ఉంటారో ఆ మనిషి రజోగుణ జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు లెక్క.
నేను, నాది, నా వాళ్లు, నా వృత్తి లాంటివి మాత్రమే గొప్ప అని భావించేది అహం (ఇగో) వల్ల వచ్చే గుణం. అసలు ఇగో అంటే ఏమిటో వివరంగా అర్థమైతే దానిని జయించడం ఎలాగో తెలుస్తుంది.
అప్పుడే పుట్టిన నెలల పిల్లలను చూడండి. వారికి నేను, నాదీ అనే భావన ఏదీ ఉండదు. ఎవరు నవ్వినా బోసి నవ్వులు నవ్వుతుంటారు. భౌతికమైన అవసరాలైన ఆకలేస్తే మాత్రమే, ఏదైనా అసౌకర్యం కలిగితే మాత్రమే ఏడుస్తారు తప్పించి వారిలో నిరంతరం సంతోషమే దాగి ఉంటుంది. అటూ ఇటూ దొర్లాడుతూ వాళ్లలో వాళ్లు నవ్వుకుంటూ కూడా ఉంటారు. అలా నవ్వుకోవడానికి మనకు పెద్ద వాళ్లలా వాళ్లకి ప్రత్యేకంగా ఏ కారణం అవసరం లేదు. హార్ట్ చక్ర కేంద్రీకృతం అయ్యే పాజిటివ్ ఎనర్జీ వారిని విశ్వంతో సంతోషంలో మునిగితేలేలా చేస్తుంది. పుట్టినప్పటి నుండి ఏడేళ్ల వయస్సు వచ్చే వరకూ మెదడులో ఉండే పీనియల్ గ్లాండ్ వారిలో యాక్టివేటెడ్గా పనిచేస్తుంది. పీనియల్ గ్లాండ్ గురించి గతంలో చెప్పుకున్నాం. అందులో చిన్న ఉప్పు కణాల మాదిరిగా ఉండే మైక్రోక్రిస్టల్స్ ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు ఉత్పత్తి అయి నిరంతరం విశ్వశక్తితో తల పై భాగంలో ఉండే సహస్రార చక్ర ద్వారా అనుసంధానం అయ్యే ఏర్పాటుని చేస్తాయి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిల్లలు నిరంతరం దైవ శక్తితో కనెక్ట్ అయి ఉంటారన్నమాట. అందుకే మన పెద్దవాళ్లు కూడా పిల్లలు దైవ శక్తితో సమానం అని చెబుతుంటారు. వారి దగ్గరకు సకల జీవజాతులు ప్రేమతో వస్తాయి. పిల్లలకు భాష రాకపోయినా వారు విశ్వంతో ప్రేమగా కనెక్ట్ అయి ఉంటారు. విశ్వమంతా ఒకటే అనే భావన వారి ఆత్మకి ఉంటుంది.
ఏడేళ్ల వయస్సు దాటాక పీనియల్ గ్లాండ్ ప్రాధాన్యత తగ్గిపోయి మెదడులో ముక్కు వెనుక భాగంలో అడుగున అతి చిన్నగా ఉండే పిట్యూటరీ గ్రంధి యాక్టివేట్ అవడం మొదలుపెడుతుంది. దీనిని “మాస్టర్ గ్లాండ్” అని పిలుస్తారు. ఇది శరీరంలోని హార్మోన్లని ఉత్పత్తి చేసే అన్ని ఇతర గ్రంధులను నియంత్రిస్తుంటుంది. ఆ వయస్సు నుండే హార్మోన్స్ విడుదల మొదలవుతుంది. సరిగ్గా హార్మోన్స్ విడుదల పెరిగాక మనిషికి “ఇగో” అనేది బలపడుతుంది. అప్పటి వరకూ పీనియల్ గ్లాండ్ మూలంగా బ్రెయిన్లో అత్యద్భుతంగా విశ్వానికి కనెక్ట్ అయి ఉన్న ఎనర్జీ మొత్తం, సహస్రార చక్ర, ఆజ్ఞా చక్ర అని పిలవబడే థర్డ్ ఐ చక్ర నుండి.. శక్తి మొత్తం శరీరంలోకి వస్తుంది. శరీరంలోని అడుగు భాగంలో ఉండే మూలాధార చక్ర, స్వాధిష్టాన, మణిపూరక చక్ర వంటి జీవ శక్తిని ఎక్కువగా వినియోగించుకునే చక్రాల వద్ద ఎనర్జీ వృధా అవడం మొదలుపెడుతుంది.
“నేను వేరు, మిగతా ప్రపంచం వేరు.. నాకు ఫలానా రంగు ఇష్టం, నాకు ఫలానా ఫుడ్ ఇష్టం, ఫలానా సినిమా, కార్టూన్ ఇష్టం..” ఇలాంటి అన్నీ తన దృష్టితో చూసే అహం భావనలు ఇక్కడే మొదలవుతాయి. చాలా పరిశుభ్రంగా ఉండే పిల్లల మనస్సులో “మన కులం వాళ్లు చాలా గొప్పోళ్లు”, “అలాంటి అలవాట్లు కలిగిన వాళ్లంతా తక్కువ వాళ్లు” అని తల్లిదండ్రులు, సమాజం నూరిపోస్తూ ప్రతీ దగ్గరా ఒక మనిషి మరో మనిషితో వేరుపడి ప్రవర్తించే పరిస్థితికి వచ్చేస్తాం.
ఒక ముగ్గురు స్నేహితులు లంచ్‌కి కలిశారు అనుకోండి. వారిలో ఇద్దరు మొదటిసారే కలిసి ఉంటే.. ఒకరినొకరు పరిచయం చేసుకునేటప్పుడు ఇద్దరూ ఒకే ఊరి వారు అవడం వల్ల వారిద్దరి మధ్య ఏర్పడే అనుబంధం కాస్తా.. వారు తీరా ఆహారం తినేటప్పుడు ఒకరు వెజిటేరియన్, మరొకరు నాన్-వెజిటేరియన్ అయినప్పుడు కొద్దిగా పలుచనపడుతుంది. ఈ రెండు భావనల్లో ఒకే ప్రాంతం అనే దానికి ప్రాధాన్యత ఇస్తారా, లేదా ఒకటే ఆహారపు అలవాటు అనే దానికి ప్రాధాన్యత ఇస్తారా అన్న దాన్ని బట్టి మనుషులు ఒక దగ్గర కలుస్తూ, విడిపోతూ ఉంటారు.
కృష్ణ భగవానుడు చెప్పిన ఇలా ప్రతీ వేరుగా చూసేలా చేసే ఈ “రాజస జ్ఞానం” మనిషిని ప్రతీ క్షణం అసంతృప్తికి గురిచేస్తుంది. నాకు ఓ రాజకీయ నాయకుడు నచ్చాడు అనుకోండి. మీకు మరో రాజకీయ నాయకుడు నచ్చితే.. గత శ్లోకంలో భగవానుడు చెప్పిన సత్త్వ గుణ జ్ఞానం నాకు ఉంటే “మనమంతా ఒకటే, మన అభిప్రాయాలు, ఆలోచనలే వేరు” అని మైండ్ సృష్టించే మాయ నుండి బయటకు వచ్చి మీ సోల్‌తో నిరంతరం కనెక్టివిటీ కలిగి ఉండడానికి ఇష్టపడతాను. అదే మీకు ఇప్పుడు చెప్పబడిన రాజస జ్ఞానముంటే.. “ఈయనకు ఫలానా రాజకీయ నాయకుడు ఎందుకు నచ్చుతాడో ఎంతకీ అర్థం కాదు” అని నా పట్ల మీరు అసంతృప్తి చూపిస్తుంటారు. అంటే మీ ఎమోషన్ వలన మీ ఎనర్జీ మొత్తం భావోద్వేగాలకు కేంద్రమైన స్వాధిష్టాన చక్రలో ఎనర్జీ బ్లాక్‌గా ఉండిపోతుంది. ఇలా ప్రతీదీ సపరేట్గా చూసే దృష్టి మారనంత వరకూ మీ ఎనర్జీ ఇలా భావోద్వేగాలకు గురవుతూ శరీరంలోని పై భాగాల్లో ఉండే అనాహత చక్ర (హార్ట్ చక్ర), థర్డ్ ఐ చక్ర, సహస్రార చక్ర (విశ్వంతో కనెక్ట్ చేసేది) వైపు ముందుకు సాగదు. దాంతో విశ్వ దృష్టి నుండి విశ్వంతో, విశ్వంలోని అన్ని జీవజాతులతో వేరుపడి భావోద్వేగాలతో బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది.
మీరు వేరు, నేను వేరు అని భావించిన వెంటనే మీలో ఓ అభద్రత మొదలవుతుంది గమనించండి. “నేను ఎక్కడ దాడి చేస్తానో, నా అభిప్రాయాలు ఎక్కడ దాడి చేస్తాయో, ఆ దాడి నుండి రక్షించుకోవాలి” అనే ఇన్ సెక్యూరిటీ నుండి మీ ఇగోని మీరు కాపాడుకోవడం కోసం వాదనలు సృష్టించుకోవడం, మనిషికి దూరంగా జరగడం మొదలవుతుంది. అలా కాకుండా “మా అన్నే, మా తమ్ముడే” అని హృదయానికి దగ్గరగా తీసుకుంటే నా పట్ల మీకు, మీ పట్ల నాకు ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదు. రెసిస్టెన్స్ లేని చోట ఎనర్జీ చాలా ఆదా అవుతుంది. ఎంతకాలమని అన్నింటి దూరంగా జరుగుతూ కేవలం మీ మైండ్ సృష్టించే ఇగో కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ అన్ని చక్రాస్‌లో బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన ఎనర్జీని కేవలం మూలాధార స్వాధిష్టాన, మణిపూరక చక్రాలలో బ్లాక్ చేసుకుంటారు?
“నేను వేరు, నేను చాలా ప్రత్యేకం, నా బ్లడ్ చాలా గొప్పది” వంటి ఇగోని మన మైండ్ (మనస్సు) సృష్టిస్తుంది. మైండ్ సృష్టించే ఈ మాయని దాటిపోతేనే సోల్‌కి చేరుకోగలుగుతాం. సోల్‌కి చేరుకోవడానికే మెడిటేషన్ లాంటివి ఉపయోగపడతాయి.
“నా కులం గొప్పది అని మీ మైండ్ మీకు ఆలోచనని సృష్టించిన వెంటనే ఏం జరుగుతుందో ఆలోచించండి. మిగతా కులాల పట్ల చిన్నచూపు ఏర్పడుతుంది. అలా ఇతర జీవుల పట్ల చిన్నచూపు చూడడం అనేది తక్కువ కాన్షియస్నెస్ కలిగిన దారుణమైన మానసిక కర్మ. ఆ కర్మకి స్పేస్‌టైమ్‌లో ఎప్పుడోసారి కర్మఫలం అనుభవించక తప్పదు. అలాగే మీ కులాన్ని, మతాన్ని, మీ అభిప్రాయాలను, మీ హీరోని, మీ రాజకీయ నాయకుడుని రక్షించుకోవడం కోసం మీరు ఒక్కరే పోరాడుతున్నారు అన్న భ్రమతో మీ విశ్వగుణాన్ని పోగొట్టుకుని సమాజంలోని ఇతరులందరినీ బూతులు తిడుతూ, ఇష్టమొచ్చినట్లు అహంతో, లెక్కలేనితనంతో మాట్లాడుతూ విచక్షణని కోల్పోతారు. ఇవన్నీ భావోద్వేగాలే. ఇవన్నీ మానసిక కర్మలే. ఈ కర్మలను చేసే పరిస్థితిని ఏర్పరిచేది మైండ్ అనే మన చెప్పు చేతల్లో ఉండాల్సిన మాయ.. తానే అంతా అని యజమానిగా మన భావోద్వేగాలను రెచ్చగొట్టే స్థితికి మారిపోవడం వల్ల ఏర్పరుస్తుంది.
చిన మాయని పెనుమాయ ఆక్రమిస్తూ ప్రతీచోటా మాయ మాత్రమే కనిపిస్తూ మనల్ని మనకు కాకుండా చేస్తుంది. ఆ మాయ ఎంతగా పెనవేసుకుపోతుంది అంటే.. అసలు మనం సృష్టి నుండి అహంతో వేరుపడుతున్నాం అన్నది పూర్తిగా మర్చిపోతాం. ఓ చిన్న ఉదాహరణతో ముగుస్తాను..
రోడ్ మీద వెళుతుంటే ఓ మహిళ టూ వీలర్ డ్రైవ్ చేసుకుంటూ బ్యాలెన్స్ కుదరక ఇబ్బందిగా వెళుతోంది అనుకోండి. “ఈ ఆడాళ్లంతా డ్రైవింగ్ రాకపోయినా రోడ్ మీదకు వస్తారు” అనే జడ్జ్మెంట్ ద్వారా ఓ మానసిక కర్మని చేస్తూ.. ఆడా, మగా అనే మైండ్ చేసే సపరేషన్తో కొట్టుకుపోతూ మనకు మనం సకల జీవులను ఒకటిగా చూసే సత్వ్త గుణ జ్ఞానానికి దూరంగా జరుగుతున్నామన్నది మర్చిపోతాం. “ఇంత చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలా.. ఒక చిన్న తిట్టు, అసహనం కూడా ప్రదర్శించకూడదా” అని మీ మైండ్ మారాం వేయొచ్చు. అలా మారాం వేస్తోంది కూడా మీలో ఇగోని పెంచే మైండ్ మాత్రమే. ఆ మైండ్ ఇచ్చే ఆలోచనని అధిగమించి, కేవలం విశ్వంలోని ప్రతీ దాన్నీ ఎనర్జీ రూపంలో, ఏక రూపంగా చూడడం మొదలుపెట్టినప్పుడు మనిషి మహాత్ముడవుతాడు. దీనికి చాలా సాధన కావాలి.. ఇలా రోడ్ మీద మనం ప్రవర్తించే విషయాలు మొదలు నిజ జీవితంలో మనం నిరంతరం కలిగి ఉండే అభిప్రాయాల వరకూ అన్నింటినీ సంస్కరించుకుంటూ పోవాలి. ఇవన్నీ మానసిక కర్మలే అన్నది గ్రహించాలి. అప్పుడే కృష్ణ భగవానుడి “గీతా జ్ఞానం” మనకు ఆభరణంగా నిలుస్తుంది.
– Sridhar Nallamothu