విశ్వప్రయత్నాతోనూ నిలువలేక విడిచిన శ్వాస ఒకటి..
చావూబ్రతుకుల మధ్య వేలాడుతున్న దేహం మరొకటి..
రేపేమిటో తెలీని అగాధమంత శూన్యతతో కొట్టుమిట్టాడుతున్న మనస్సొక్కటి..
దేనికది పరాకాష్టకి చేరుకున్నాయి.
ఆ స్థితులన్నీ.. మనిషి ఉనికి అస్థిరమని నిరూపిస్తూనే ఉన్నాయి.
అలాంటి ఎన్నో శవాల్నీ, దేహాల్నీ, మనస్సుల్నీ మన కళ్లెదుట చూస్తూ కూడా మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఏ కోశానా మనసొప్పదు..
లైఫ్ అంటే ఛెక్ బుక్ లాంటిది మనకి. ఛెక్లు రాసుకుంటూ వెళ్తాం.. ఏటికేడూ చెల్లుబాటవుతూ ఉంటాయి.. అంతలో పూర్తిగా లైఫ్‌కి "ఛెక్" చెప్పేయబడుతుంది.. ఛెక్బుక్కూ ఉండదు.. లైఫూ ఉండదు.. గోడన ఫొటో తప్ప!
రోజుల్ని గడిపేయడానికీ కాలక్షేపాలనూ, శరీరాన్ని పోషించుకోవడానికీ డబ్బునీ, అహాల్ని సంతృప్తిపరుచుకోవడానికి మనుషుల్నీ సంపాదించుకుంటూ ఏదోలా నెట్టుకొచ్చేయడమే లైఫ్ అయితే.. 🙂 🙂 🙂 ఈ స్మైలీల్లోనే అర్థం చేసుకున్న వాళ్లకు అర్థమైనంత అర్థం దాగుంది.
మరుక్షణం శాశ్వత నిద్రలోకి జారిపోబోయే ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఊగిసలాట మనకు అనుక్షణం ఎదురైతే ఇంత నిమ్మళంగా ఉండగలుగుతామా?
ఎందుకూ పనికిరాకుండా పోయే అవయువాలతో జీవశ్చవాలుగా మారిన క్షణం మానసిక స్థితిని తలుచుకుంటే… ఇంత నింపాదిగా "ఏదోలో మనది కాని జీవితం" అన్నంత కూల్‌గా గడిపేస్తామా?
శూన్యతే తప్ప ఆశనేదే లేని స్థితి దాపురిస్తుందంటే.. ఆ దాపురించేలోపు ఉన్న జీవితాన్ని కరువుతీరా ఆస్వాదించాలనిపించదూ!
ఈ క్షణం ఈ దేహంలో "నేను" అనుకుంటున్న ఈ ఆత్మ తప్ప మరొకటి జొప్పించబడడానికి ఆస్కారం ఉంది కదా! అలాంటిది "మనమే" ఈ దేహంలో ఎందుకు ప్రాణం పోయబడి ఉన్నామన్న దానికి ఓ లాజిక్‌నీ వెదికి పట్టుకోవాలి కదా? ఆ ప్రయత్నమేమీ చెయ్యకుండానే గుడ్డిగా ఏదో శరీరంలో ఏదో మనం ప్రాణం పోయబడ్డాం కాబట్టి లైఫ్‌ని గడిపేస్తుంటామా?
స్టేజ్ మీద అన్ని క్యారెక్టర్లతో పాటు చాలా సీరియస్‌గా మనమూ నటిస్తూ పోతున్నామే గానీ.. అప్పుడప్పుడు స్టేజ్ దిగి.. అస్సలు మనమేంటో సమీక్షించుకుంటూ ఉండాలన్న స్పృహ ఉంటున్నదెందరికి?
"ఇదంతా ఫిలాసఫీ.. మన ఒంటికి అస్సలు సరిపడనే పడదు.." అని ఓ వెకిలి నవ్వు నవ్వుకుని దులపరించుకుని జీవించనూ వచ్చు.
ఈ వాస్తవాలకు ఫిలాసఫీ అని పేరుపెట్టుకున్నా, ఇంకెలా ఫీలైనా.. అవి ప్రతీ మనిషికీ అనుభవంలోకి రాకుండాపోవు.. ఈరోజుకి ఎస్కేప్ అయి పారిపోయినా! అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.. "అయ్యో ఇంత విలువైన లైఫ్‌ని ఇలాగెందుకు వృధా చేశానూ.. ఇంకా బెటర్‌గా జీవించి ఉండొచ్చు కదా.." అని!!
ప్రతీ హ్యూమన్ soulకీ ఓ purpose ఉంటుంది.. దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తాం అన్నది.. మన ప్రయత్నం పైనే ఆధారపడి ఉంటుంది.
ఆనందాల్లో, అనుబంధాలతో పెనవేసుకుపోతూ కూడా.. purposeతో లింక్ తెగ్గొట్టుకోపోతేనే లైఫ్ పర్పస్ నెరవేరుతుంది..
చుట్టూ సమూహం మధ్య చాలా సౌకర్యవంతంగా జీవితం గడిపేస్తున్నప్పుడూ.. ఎక్కడో తెలీని వెలితి వెంటాడుతూ ఉండేది.. ఈ గమ్యాన్ని గుర్తుచెయ్యడానికే!
పాపం మనం మూర్ఖులం.. అంతమందిలో ఉన్న ఆనందం చెడిపోతోందని భయపడిపోయి.. అదేదో చిన్న ఇన్ సెక్యూరిటీ అని ఎక్కడో ఆకాశంలోకి లోతుగా చూసే ఆ కళ్లని బలవంతంగా మనుషుల్లోని చిరునువ్వుల వైపు ప్రొజెక్ట్ చేసుకుని.. మనసులోని వెలితిని ఎదుటి మనిషిలోని చిరునవ్వుతో పూడ్చుకోవాలని చూస్తాం.
అస్సలు ఇక్కడ.. ఈ దేహంలో.. మనమెందుకు ఉన్నాం…?
"ఇంత సీరియస్ టాపిక్ ఏమిటిరా బాబూ." అని నవ్వుకుని.. ఏవో పనుల్ని మునిగిపోవడం కాకుండా ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నించండి..
మీరు నవ్వుకుని వెళ్లిపోతే.. ఖచ్చితంగా మిమ్మల్ని తలుచుకుని నేను మరింత నవ్వుకుంటాను.. ఎందుకంటే ఏదోరోజు ఇదంతా ఆలోచించే మానసిక స్థితి మీకూ రాకపోదు అని తలుచుకుని!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply