తెరుచుకున్న కళ్లు మూతబడేలోపు కళ్లల్లో ప్రపంచాన్ని ఇముడ్చుకుని పోవాలన్న వెర్రి తపన…
ఇముడ్చుకోకముందే కళ్లు మూతబడతాయేమోనన్న పిచ్చి భయమూ కూడా…
నిన్నటి ఆనందానికీ, నేటి ఆవేశానికీ, రేపటి నిస్తేజానికీ కారణాలు పోగుచేసుకునే ముందే…
అన్నింటికీ కారణాల్ని స్వయంగా మనం అర్థం చేసుకునేలోపే.. ప్రపంచం తప్పుడు కారణాల్ని రుద్దేస్తుంటే వాటిని ఒప్పుకోలేక సతమతమయ్యే వ్యవధిలోనే కళ్లు మూతలుబడతాయేమోనన్న ఆదుర్ధా…
ఏ చర్యా, ఏ కారణమూ, ఏ పర్యవసానమూ మన అస్థిత్వాన్ని నిలపలేవని అర్థం చేసుకోలేని అమాయకత్వమూ… ఆ ఆమాయకత్వంలో చర్యా, కారణమూ, పర్యవసానల ఛట్రం చుట్టూ గానుగెద్దుగా బ్రతికే కొద్దిపాటి జీవితమూ…
ఈ మాంసపు ముద్దకూ… భౌతికంగా గాయమైతే కమిలిపోయే దేహానికీ.. మానసికంగా గాయమైతే అగాధాల్లోకి కూరుకుపోయే ఆలోచనలకు ప్రాణమెందుకు పోయబడిందో గ్రహించేలోపే నాటకీయంగా ముగిసిపోతుంది ఈ లిప్తపాటు జీవితం.
నిన్న రాసినట్లు మన ఆలోచనలూ, కోరికలూ అద్భుతమైన మనుషుల్ని, మానవ సంబంధాల్నీ మనకు ముడిపెట్టినా…
మొన్న రాసినట్లు సూక్ష్మస్థాయిలో సారించలేని ఆలోచన మనుషుల్ని మానసికంగానో, శారీరకంగానో సమూలంగా నాశనం చేసినా…
ఇవన్నీ ఈ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే ఎగసిపడే ఆలోచనలూ, ఈ ప్రపంచంలో ఉనికి ఉన్నంతకాలమే చెల్లుబాటయ్యే అనుబంధాలూ…!!
అంతకుమించి ఏం లేదు….
మరుజన్మ ఉన్నా, పాపపుణ్యాలున్నా… గడిపే జీవితం నుండి వాటిని మోసుకుపోదామనుకున్నా… ఉన్న జీవితంతో రాబోయే జీవితం గురించి ఓ బేరాన్ని కుదుర్చుకుని… terms and conditions ప్రకారం నడుచుకుంటున్నట్లు అవుతుందేమో…
కర్మఫలాలు ఫలితాలు అందించొచ్చు.. ఆ ఫలితాలపై ముందుచూపు వ్యవహారం మన బుద్ధికి అనవసరమేమో..
ఈ ప్రపంచంలో కాస్తంత చోటు దక్కించుకున్నందుకు రైల్వే బెర్త్ కన్ఫర్మ్ అయినంత అల్ప సంతోషిగా మిగిలిపోవడం మంచిదేమో…
మనుషులు చుట్టుముడతారు, ఆకాశానికి ఎగరేస్తారు, ఈడ్చి క్రిందా పడేస్తారు.. కాలితో కసిదీరా తొక్కేస్తారూ.. అంతలోనే కొబ్బరికాయ కొట్టి పూజిస్తారూ… ఇదంతా 20-20 మ్యాచ్ టైప్ అంతే. ఆట ముగిస్తే వికెట్లు పీక్కుని ఎవరి దారిన వాళ్లు వెళ్లవలసిందే.
జీవితం ఎంత మాయలమారి అంటే… ఎంతో ఆనందంలో ఉన్నప్పుడు ఇలాంటి గంభీరమైన ఆలోచనల్ని మనస్సులోకి స్వీకరించనీయకుండా అడ్డుపడి.. మనల్ని మరింత భ్రాంతిలో ముంచేసి వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకుడి లాంటి జీవితం మనది.
నిస్తేజమో, నిర్లిప్తతో, వైరాగ్యమో కమ్ముకున్నప్పుడు పట్టలేని ఆనందాన్ని కళ్లెదుట నిలిపి.. మళ్లీ మరో మాయలోకి లాగేసే మొసలి లాంటి జీవితం…..
అన్ని రసాల్నీ ఆస్వాదిస్తూ జీవించడం ఎంత ముఖ్యమో మన పాత్రకు నిర్దేశించబడిన నిడివిని గ్రహింపులో పెట్టుకుని ఏ క్షణమైనా తృణీకారంగా జీవితాన్ని వదిలేసేలా జీవించడమూ అంతే ముఖ్యం!!
ఆ మెళకువ అలవడని రోజున అసంతృప్త ప్రాణాలే గాల్లో కలుస్తాయి..!!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుందన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
చాలా కవితాత్మకంగా చెప్పారు శ్రీధర్ గారూ ! మీరు చెప్పినదాంట్లో 10% తనంత తానుగా గ్రహించగలిగితే మనిషి జీవితమే మారిపోతుంది. మీరు అనుమతిస్తే ఈ వ్యాసాన్ని మా సైట్ లో పెడతాను.
తాడేపల్లి గారు అంతకన్నా సంతోషమేముంది సర్. తప్పకుండా పెట్టండి సర్. ధన్యవాదాలు
దయతో అనుమతిచ్చినందుకు నెనర్లు శ్రీధర్ గారూ !
తాడేపల్లి గారు మీలాంటి వారికి నా ఆలోచనలు నచ్చడమే నాకు చాలా సంతోషం. దయ వంటి మాటలు వద్దు సర్. ధన్యవాదాలు