లేజర్ ఫోకస్.. ఎంత శక్తివంతమైన ఫోకస్ అంటే, నీ గుండెలో ఓ దీపాన్ని ఊహించుకున్నా నీ దృష్టి ఆ దీపం నుండి అర క్షణం కూడా చెక్కు చెదరనంత ఫోకస్..
నీ సర్వశక్తులూ ఏకం చేసి, ఆ ఎనర్జీ మొత్తాన్నీ నీ లక్ష్యం వైపు బలంగా ప్రొజెక్ట్ చేయి… ఎంత పెద్ద లక్ష్యమైనా చచ్చినట్లు దిగి వస్తుంది.
బ్రతకడం చేత గాక ఎవడినో మోసం చేసి, నాలుగు కబుర్లు చెప్పి బ్రతికేస్తున్నాం అంతే! అలాంటివి సిగ్గు లేని బ్రతుకులు. నీ జీవితంలో ఏ క్షణమూ అలాంటి బ్రతుకు కోరుకోకు. బ్రతికితే రాజాలా బ్రతుకు. నిన్ను చూసి అందరూ గర్వపడాలి. అందరి కన్నా ముందు నీకు నీపై గర్వం కలగాలి.
ఎంత కష్టపడతావో అంత కష్టపడు.. అవసరం అయితే రాత్రింబవళ్లూ కష్టపడు!! నువ్వు సాధించి తీరాలంతే! నువ్వు సరిగా పనిచెయ్యని రోజున తిండి మానేయ్ అంతే.. నీ బద్ధకానికి నువ్వు ఇచ్చుకునే పనిష్మెంట్ అది. దెబ్బకి దెయ్యం దిగి వచ్చినట్లు బద్ధకం బుర్రని వీడిపోతుంది.
రోజుకి కొన్ని గంటలు నేను కొత్తవి నేర్చుకుంటాను, చదువుకుంటాను, ప్రయోగాలు చేస్తాను, మెడిటేషన్ లాంటి ప్రాక్టీసులు చేస్తాను. నిన్నటి కన్నా ఈరోజు మెరుగ్గా ఉండాలంతే! నిన్నటి కన్నా ఈరోజు నా ఆలోచనలు గొప్పగా మారాలంతే! అంతే తప్పించి ఏ క్షణమూ తుచ్చమైన ఆలోచనలతో దిగజారడం మన బోటి వాళ్లకి అవసరం లేదు.
బ్రతికేద్దాం… కష్టపడి, కాలరెగసేసి.. బ్రతుకంటే ఇదీ అని అణువణువూ పులకించిపోయేలా నిజాయితీ, నిఖార్సయిన బ్రతుకు మాత్రమే బ్రతికేద్దాం. Get ready to live a meaningful life. All the best.
- Sridhar Nallamothu