కాలెండర్లో తేదీ మారిందో లేదో ఎంత తేడా…. నిన్నటికీ ఈరోజుకీ మనలో ఎంత ప్రశాంతత, భక్తిభావం!
గణేశుడు మనల్ని కలిపి ఉంచుతున్నాడు… దుర్గమ్మ దసరాకి మనలోని అన్ని జాఢ్యాలనూ పారద్రోలి మనుషుల్ని కలిపి ఉంచుతోంది.. దీపావళికి నరకాసురుడు సంగతేమో గానీ మనలోని రాక్షసులూ పారిపోతున్నారు…
భగవంతుడు ఎక్కడో లేడు.. మన ఆలోచనల్లో ఉన్నాడు…. మన ఆలోచనల్ని భగవంతుడితో నింపుకుంటే మనకు తోటి మనిషీ భగవత్ స్వరూపంగానే కన్పిస్తాడు..
——————————
పండగలూ, ఆచారాలూ, సంప్రదాయాలూ పెట్టుకున్నది మనుషులు కలిసి మెలసి గడపడానికే.. మానవత్వం వెల్లివిరియడానికే!
కానీ “అవంతా ట్రాష్” అనీ… “ఇంత చదువుకునీ… ఈ ఛాదస్తాలేమిటనుకుని” అవహేళనగా చూసుకుంటూ మన మేధస్సు ప్రదర్శించుకుంటూనే ఉన్నాం గానీ.. ఇలాంటి పండగలు మనుషుల మధ్య తరతరాలుగా సాధించిన ఐకమత్యాన్ని నిలబెట్టడానికి మాత్రం మన మేధస్సు అస్సలు పనిచెయ్యట్లేదు.
————————————
అపర మేధావుల్ని సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను…
అస్సలు ఇవ్వాళ వినాయక చవితి రోజు కొన్ని కోట్ల మంది మనస్సుల్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయిన పాజిటివ్ వైబ్రేషన్లని మీరు మీ మేధస్సుతో జనాలు కొట్టుకు చచ్చేటప్పుడు తీసుకువచ్చి వారిని శాంతింపజెయ్యగలరా?
——————————–
పండగొస్తే మనస్సులో ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది… సంతోషం ఉన్నచోట వెకిలీ, మకిలీ కొట్టుకుపోతాయి..
కానీ పండగల్నీ రాజకీయం చేసేస్తున్నారు… దేముడు ముందు నిలబడి భగవత్ స్వరూపులైన మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారు… క్రమేపీ పండగలూ, దేవుళ్లూ కొట్టుకు చచ్చే మనుషుల్ని ప్రేక్షకులుగా చూసే విగ్రహాలుగా మారిపోయారు 🙁
————————-
ఒక్కటే సీక్రెట్…..
ఏ పండగకైనా మనకు రక్షణగా ఉంటోంది… భగవంతుడి కన్నా… పండుగని గుర్తుచేసుకుని మనలో మనం ప్రతిష్టించుకుంటున్న ప్రశాంతత మనల్ని కాపాడుతోంది.
పండగొస్తే మనకు BPలు పెరగవు.. నాలుకలు అసహ్యకరమైన మాటలకు సహకరించవు… చేతులు హింసకు కోపరేట్ చెయ్యవు…
——————————
అందుకే అటు పండుగనైనా జరుపుకోవాలి… వీలైతే ప్రతీ రోజూ ఓ పండుగనైనా జరుపుకునేలా ఉండాలి.. నిరంతరం భగవంతుడిని మనస్సులో నిలుపుకైనా ఉండాలి… లేదా ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటే.. కొట్టుకు చచ్చే మేధస్సులు పక్కనబెట్టి మనుషుల్ని ప్రేమించే విజ్ఞత అయినా కలిగి ఉండాలి….
ఇవేమీ కుదరని రోజున పండుగల సాక్షిగా మనుషులు బలైపోతారు… భగవంతుడు క్రూరమైన మనుషుల్ని బలి కోరే రోజు ఖచ్చితంగా వస్తుంది. క్రూరత్వాన్ని విడనాడదాం…!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply