అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ।। 12 ।।
స్వప్రయోజనము మీద ఆసక్తి కలిగి ఉండి, స్వార్థం కలిగిన వారికి మరణించిన తర్వాత కూడా సుఖము, దుఃఖము, కొన్నిసార్లు ఆ రెండింటి మిశ్రమమూ ఈ మూడు విధములైన కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ కర్మ ఫలమును త్యాగం చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకంలో గానీ పర లోకంలో గానీ ఉండవు.
వివరణ: స్వర్గం, నరకం వంటి దృక్పధం నుండి కొద్దిగా విశాలంగా ఈ అంశాన్ని తెలుసుకుందాం.
సృష్టిలో ప్రతీదీ ఎనర్జీ (శక్తి) రూపమే అన్నది ఇప్పటికే స్పష్టమైంది కదా! సైన్స్‌నే తీసుకుంటే ధర్మోడైనమిక్స్ ప్రకారం శక్తిని సృష్టించడమూ, నాశనం చెయ్యడమూ సాధ్యపడదు. కేవలం ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి వివిధ చర్యల చేత మారుతుంది. ఉదా.కి.. స్టవ్ మీద నీటిని కాచినప్పుడు ద్రవ రూపంలో ఉన్న నీరు అనే ఎనర్జీ కాస్తా ఆవిరి అనే ఎనర్జీగా మార్పిడి చెందడం అందరికీ తెలిసిందే. సైకిల్ తొక్కుతున్నప్పుడు కాలి ద్వారా ఏర్పడే ఆ వత్తిడి అనే ఎనర్జీ కైనటిక్ ఎనర్జీగా మారి సైకిల్ లైట్ వెలగడానికి ఉపయోగపడే బ్యాటరీలో శక్తి కాసేపు నిల్వ ఉండేలా ఏర్పాటు చెయ్యబడుతుంది. అంటే మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ జీర్ణ రసాలుగా పిలవబడే డైజెస్టివ్ జ్యూసెస్ని విడుదల చేసి ఆహారాన్ని జీర్ణం చేసి, మెటబాలిజం అనే శరీరం కలిగి ఉండే ఓ ఇంటెలిజెన్స్ ఆ శక్తిని శరీర కణాల్లో నిల్వ చేస్తే, మన మైండ్‌లోని ఆలోచనలు అనే శక్తి ద్వారా సంకల్పం అనే మరో శక్తితో కేంద్రీయ నాఢీ వ్యవస్థ ద్వారా కాళ్లకి చేతులకి సిగ్నల్స్ పంపించబడి మన కణాల్లో ఉన్న శక్తి కాస్తా కాళ్ల ద్వారా వత్తిడి అనే మరో శక్తిగా మారుతోందన్నమాట.
మనిషి శరీరంలోని వివిధ భాగాల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి ఇలా ఒక ఎత్తయితే… మనిషి ఈ భూమ్మీద చేసే కర్మల (పనుల) ద్వారా ఏర్పడే పాజిటివ్ గానీ, నెగిటివ్ గానీ శక్తి స్థూలమైనది. అంటే ఆహారం, ఆక్సిజెన్, ఎక్సర్సైజ్, నిద్ర వంటి శరీర అవసరాల ద్వారా ఏర్పడే శక్తిని ఒక మనిషి బయటి ప్రపంచంలో పరిస్థితులు, సమస్యలు, తనకి ఎదురయ్యే మనుషులు, విశ్వం పట్ల తన దృక్పధం వంటి పలు అంశాల మీదకు తన ఆలోచనలు అనే వైబ్రేషన్స్ ద్వారా వెదజల్లుతున్నారు, ఆ ఆలోచనల ద్వారా ఎలాంటి చేతలు (పనులు) చేసి కర్మలకు కారణం అవుతున్నాడు అన్నది స్థూల దృష్టి.
విశ్వంలో ఓ చెట్టూ, పుట్టా, ఓ రాయీ, పక్షీ, ఇతర జీవులన్నీ కూడా శక్తి స్థావరాలే! వాటిలో ఉండే ప్రతీదీ ఆటమ్‌లో మళ్లీ సబ్ ఆటమిక్ పార్టికల్స్ వంటి సూక్ష్మ రూపాలైన ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఫోటాన్ వంటివి కళ్లకు కన్పించనంత వేగంగా ఆణువు యొక్క వ్యాసార్థం చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఏర్పడతాయి. లోపల ఇలా నెగిటివ్, పాజిటివ్ ఛార్జ్లతో కూడిన ఈ అణువులన్నీ కలిసి ఓ రాయిగానో, జంతువుగానో, మనిషిగానో ఏర్పడతాయి. మనిషి శరీరంలో ఈ అణువులను కణాలని పిలుచుకుంటున్నాం. మరి మనిషికీ, రాయికీ తేడా ఎక్కడ వస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. ఉదా.కి.. రాయి అలా కదలకుండా ఎందుకు ఏళ్ల తరబడి అలా ఉండిపోతుంది అంటే దీని వెనుక సైన్స్ అర్థం చేసుకోవాలి. సృష్టిలోని ప్రధానంగా మూడు రకాలైన ఎనర్జీ ఉంటుంది. ఘన పదార్థాలు (సాలిడ్స్), ద్రవ పదార్థాలు (లిక్విడ్స్), వాయువులు (గ్యాసెస్). రాళ్లనే తీసుకుంటే వాటిలో ఎనర్జీ కదలకుండా స్థిరంగా చాలా తక్కువ వేగంతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ రాయికి వేడిని జత చేస్తే అలా వైబ్రేట్ అయ్యే వేగం పెరిగి ఆ రాయి కాస్తా ద్రవ రూపంలోకి మారుతుంది. ఇది అర్థం కావాలంటే అగ్ని పర్వతాలను గుర్తు తెచ్చుకోండి. రాయిగా ఉన్నది కాస్తా విపరీతమైన వేడి తగలగానే ఆ వేడికి రాయి కరిగిపోయి లావా అనే ద్రవ రూపకంగా మారి ఆ తర్వాత వేడి తగ్గగానే అది మళ్లీ ఘనీభవించడం తెలిసిందే కదా!
సో నేరుగా మనిషి విషయానికి వస్తాను. మనిషి భౌతిక రూపం సాలిడ్‌గా (ఘన పదార్థం) కనిపిస్తున్నప్పటికీ ఆ ఘన పదార్థానికి ఇంటెలిజెన్స్ కలిగి ఉండడం వల్ల మనిషిలో ఉండే ప్రతీ భాగమూ చాలా వేగంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతీ అవయువంలోని టిష్యూస్, సెల్స్ వరకూ వెళితే ప్రతీ సెల్కీ సెల్ ఇన్ఫర్మేషన్ పేరిట స్వంత ఇంటెలిజెన్స్ కలిగి ఉంటుంది అన్నది శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని ఆధారంగానే ఒక మనిషి లివర్ని మరో మనిషికి మార్పిడి చేసినప్పుడు, ఆ మార్పిడి చెయ్యబడిన మనిషికి లేని ఆహారపు అలవాట్లు కొత్తగా వచ్చినట్లు కూడా స్టడీస్ ఉన్నాయి. కేవలం కణాల స్థాయిలో మాత్రమే కాదు, మనం నిరంతరం చేసే ప్రతీ ఆలోచనా కాంతి వేగాన్ని కలిగిన ఓ శక్తివంతమైన వైబ్రేషన్. ఆ వైబ్రేషన్‌కి తగ్గట్లే, అంటే మీ ఆలోచనకు తగ్గట్లే మీ కేంద్రీయ నాఢీ వ్యవస్థ (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్) ద్వారా శరీరంలో ఏ అవయువం కదిలించాలి, ఏ ఫీలింగ్ కలిగి ఉండాలి వంటివన్నీ ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అంటే బాహ్య ప్రపంచం అనే ఉత్ప్రేరకాన్ని (స్టిములై) తీసుకుని దానికి ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్లు తన ఇంటెలిజెన్స్‌ని బట్టి, ఇగోని బట్టి, మోరల్ని బట్టి ప్రతిస్పందించడం ద్వారా తన వైబ్రేషనల్ ఎనర్జీని మార్చుకుంటూ ఉంటాడు అన్నమాట.
ఇలా వైబ్రేషనల్ ఎనర్జీ మారుతూ ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేస్తే, జీవితం పట్ల నిరంతరం నిరుత్సాహమైన దృక్పధం కలిగి ఉంటే కణాల్లోని ఉన్న ఎనర్జీ ప్రభావితం అయి, దాని ప్రభావం క్రోమోజోమ్‌ల చివర DNA సీక్వెన్సింగ్ రూపంలో ఉండే టెలిమెర్ల మీద పడి, కొత్తగా సృష్టించబడే కణాలు తక్కువ ప్రొటీన్‌తో తయారై మనిషి అవయువాలు, చర్మం వంటివన్నీ దెబ్బతినడం మొదలుపెడతాయి. చర్మం యొక్క ప్రొటీన్ సరిగ్గా తయారు కాకపోతే చర్మ ముడతలు పడిపోవడం, లివర్ కణాల ప్రొటీన్ సరిగా తయారవకపోతే లివర్, హార్ట్ ఇలా.. ప్రతీ అవయువ నిర్మాణం దెబ్బతిని అవి కాస్తా ఇన్‌ఫ్లమేషన్‌గా, ఎడీమాగా ఆ తర్వాత క్యాన్సర్ కణాల వరకూ రకరకాల స్థాయిల్లోకి వెళ్లిపోతాయి. అంటే మనిషి తన వైబ్రేషనల్ ఎనర్జీ ద్వారా తన జబ్బులను తెచ్చుకుంటూ తన మరణాన్ని తెచ్చుకుంటున్నట్లు లెక్క.
మరి ఇదంతా సైన్స్ అయినప్పుడు మనిషి ఎప్పుడు చనిపోతాడు.. అతని ఆయుష్షు ఎంత అనేవి సృష్టి ఎలా డిసైడ్ చేస్తుంది, అదంతా ట్రాష్ కదా అనే భావన మీకు రావొచ్చు. మీకు ఓ సమస్య ఏర్పడింది అనుకుందాం, నాకూ అదే సమస్య ఏర్పడింది అనుకుందాం. మీరు చాలా హడావుడిగా, ఆందోళనగా దానికి స్పందిస్తే నేను దాన్ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు నా కణాలను నేను స్ట్రెస్ హార్మొన్ల చేత కష్టపెట్టుకోవట్లేదు. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇంతవరకూ అర్థమైంది కదా! మరి మీరు అలాగే ఎందుకు స్పందిస్తున్నారు, నేను ఇలాగే ఎందుకు కూల్‌గా స్పందిస్తున్నాను అంటే జీవితంపై అవగాహన కలిగేలా పరిస్థితులు కల్పించడం, మెడిటేషన్ వంటివి చేసేలా నాకు ఆసక్తి కలిగించడం వంటివన్నీ నా నిర్ణయాలు కాదు, నేను చేసిన గత కర్మలు (వైబ్రేషన్స్) ద్వారా నాకు ఏర్పడిన ప్రాప్తాలు. అలాంటి ప్రాప్తం మీకూ ఉంటే మీరూ బద్ధకించకుండా మెడిటేషన్ చేస్తారు, లేదా ప్రతీదీ పాజిటివ్‌గా తీసుకుంటారు. కాబట్టి మనం వెదజల్లే ఎనర్జీ మన ఇంటెలిజెన్స్ రూపంలోనూ, మన బుద్ధి రూపంలోనూ తిరిగి మనకు ఏర్పడుతుంది. అందరికీ మంచి చేస్తే కళ్లకు కన్పించే మంచి విషయమే మనకు జరగాలని లేదు.. మన బుద్ధి, మన విచక్షణ, సత్యాసత్య విచారణ వంటి పైకి కళ్లకు కన్పించనవన్నీ కూడా మనం ఇచ్చిన ఎనర్జీ మరో రూపంలో ఉన్న ఎనర్జీగా మనకు చేరినట్లే!
పై శ్లోకంలో భగవానుడు చెప్పినట్లు మరణించిన వారు అంటే అర్థం తమ భౌతిక దేహం నుండి వారి సోల్ మరో ఎనర్జీ రూపంలోకి మారిపోవడం క్రింద లెక్క. అంటే రాయి ఎలాగైతే నీరులా మారిందో అలా! ఒక మనిషి అనే ఎక్కువ వైబ్రేషనల్ ఎనర్జీ కలిగిన వ్యక్తి తాను ఒక రూపంలో ఉండగా క్వాంటమ్ ఫీల్డ్‌లోకి వెదజల్లిన ద్వేషం, పగ, కోపం, విచారం, దుఃఖః వంటి ఎనర్జీ వేరే రూపంలోకి వెళ్లినప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. వాటి ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలములను త్యాగం చేసిన వారికి అటువంటి ఫలితాలు ఉండవు అంటే అర్థం.. తాను చేసిన పనుల పట్ల మమకారాన్ని గానీ, ఇది నేనే చేశాను అనే అహాన్ని గానీ విడిచిపెడితే, సాక్షీభూతంగా కేవలం విట్నెస్ చేస్తూ ఉంటే అతని వైబ్రేషనల్ ఎనర్జీ స్థిమితంగా ఉంటుంది. అతని కాన్షియస్నెస్ విశ్వం యొక్క వైబ్రేషన్‌కి తగ్గట్లు ట్యూన్ అయి ఓ క్రమపద్ధతిలో మారి అతని కర్మల ఫలితాలు మరో రూపంలోకి వెళ్లినప్పుడు వెంటాడవు.
– Sridhar Nallamothu