…………
……….
……………
సూది క్రిందపడితే విన్పించేటంత నిశ్శబ్ధం…………
క్షణం క్రితం వరకూ ఆవేశంలో ఎగసెగిసి పడిన గుండెలు తమ గుండె చప్పుడే తమకు విన్పించేటంత నిశ్శబ్ధాన్ని దిగమించుకోలేకపోతున్నాయి…
ఏదో ఒక స్వరమే నెగ్గాలన్న పంతం కొద్దీ అప్పటివరకూ సాగిన స్వరాల సమరం వికలమైన మనస్సుల దగ్గర కుదేలుపడుతుందనుకోలేదు ఆ స్వరాల స్వంతదారులు…..
తెలివిడి వచ్చి చూస్తే ఏం మిగిలిందని…. ఎవరు గెలిచారని… ఎవరు ఓడారని? ఏ లెక్కలు వేసుకుని జరిగిపోయిన నష్టమేమిటో అంచనాకు రాగలిగేది?
"పోతే పోనీ.. నువ్వు మాట్లాడిందే సరైనది…" అని సమర్థిస్తోంది బుద్ధి! నిజమేనని తలెగరేస్తున్నాం… లోతుగా అయిన గాయానికి ఈ తలబిరుసు తాత్కాలిక ఉపశమనమేనని గ్రహిస్తే కదా… గాయపు లోతెంతో అర్థమై మనస్సుని మెలిపెట్టేది!!
అయినా మనిషి విలువ బుద్ధికేం తెలుసు…? దాన్ని నమ్ముకోబట్టే కదా నాలికని ఇష్టమొచ్చినట్లు ఆడిస్తూ మనస్సుల్ని దూరం చేసుకుంటున్నది…
………………………………
ఈ నిశ్శబ్ధంలో కమ్ముకుంటున్న దుఃఖం ఆవేశంలో మనిషిని దూరం చేసుకునేటప్పుడు ఒక్క క్షణం గుర్తొచ్చుంటే ఎంత బాగుండేది…
అయినా కాలమే గాయాలు మాన్చేస్తుంటే గాయాల గురించి బెంగేముందనిలే…. గాయపెట్టడం, గాయపడడం… కాలానికి వదిలేసి సాగిపోవడం….
మధ్యలో దూరం చేసుకున్న మనిషి ఎప్పుడైనా గుర్తొస్తే…. "ఆ మనిషి జీవితంలోంచి వెళ్లిపోయాకే జీవితం సుఖంగా ఉందని" ఓ నవ్వు నవ్వేసుకోవడం…
ఆ వంకర నవ్వుకేం తెలుసు…. ఓ హృదయం తట్టుకోలేనంత బాధపడి దూరమైతే అదెంత శాపంగా వెంటాడుతుందో….
…………
"పోయేవాళ్లు పోనీండి.. వచ్చేవాళ్లు వస్తారు.." అన్నట్లు జీవితాన్ని రైలు బండి ఎక్కే దిగే బేరంలానే జీవిస్తే ఎన్ని అద్భుతమైన సంబంధాల్ని మన చేతకానితనంతో పక్కన కూర్చోబెట్టుకోలేకపోయినట్లు? 🙁
బ్రతడానికి గుండెల్ని నమ్ముకోవడం వదిలేసిన క్షణమే… నాలికలు వంపులు తిరుగుతూ కరాళ నృత్యం చేస్తున్నాయి… ఆ నృత్యం తాలూకూ అస్సలు నష్టం గుండెకు చేరనీకుండానే బుద్ధి లెక్కలేసి పెదవి విరిచేస్తోంది.
అంతా చక్కబడాలంటే తలబిరుసుతో స్వయంగా చేసుకున్న నష్టం గుండెకర్థమై యుద్ధప్రాతిపదికన హృదయాన్ని వికసింపజేసుకోవాలి… లేదా తట్టుకోలేక ఆ గుండైనా ఆగిపోవాలి…. అంతవరకూ మనుషులూ లేరు, సంబంధాలూ లేవు… మాటకు మాటా అంది వచ్చే బుద్ధి చేసే గారడీ పనులు తప్ప!!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
చాలా బాగుంది శ్రీధర్ గారు!