యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ।। 34 ।।
వివరణ: ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు) మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
కొంత మందిని చూస్తూ ఉంటాం.. “ఈ పని చేస్తే నాకేమొస్తుంది?” అని ప్రతీదీ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. వారు కష్టపడి పనిచేస్తారు, తమ విధులను నిర్వర్తిస్తారు గానీ, దానివలన ఏదో ఒక ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా ఆశిస్తారు.
ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు అన్ని వసతులు కలిగి, అన్ని వస్తువులు కొనుగోలు చేసే సామర్థ్యం కలిగి, అవసరమనుకుంటే ఖరీదైన కార్లు, ఇతర సౌకర్యాలన్నీ పొందగలిగి, కొన్ని తరాలకు తరబడి సంపద కలిగి ఉంటేనే అది అర్ధవంతమైన జీవితం అనే భావనలో ఉంటారు.
వస్తువులు, మెటీరియలిస్టిక్ సంపదల పట్ల ఆసక్తి విపరీతంగా ఉండడం వల్ల సమకాలీన జీవితంలో ఇలాంటి వ్యక్తులు తమకు నేరుగా అప్పటికప్పుడు స్తోమత లేకపోయినా EMIల ద్వారా వస్తువులు సమకూర్చుకోవడం, వాటిని తీర్చడానికి విపరీతంగా కష్టపడడం చేస్తుంటారు.
“నేను ఎలాగైనా ఆడి కార్ కొనాలి” వంటి వివిధ కోరికలు కలిగిన ఇలాంటి వ్యక్తుల మొండి పట్టుదలని “రాజసిక ధృతి” అని భావించాలి. ఒక కోరికను కలిగి ఉండటం, ఆ సంకల్పం కోసం అవిశ్రాంతంగా కృషి చేయటం వీరి లక్షణం.
“దీంట్లో తప్పేముంది.. అందరూ చేసేదేగా” అని మీకు అన్పించవచ్చు. అయితే వస్తూత్పత్తుల మీద పెద్దగా ఆసక్తి లేని సత్త్వ గుణ సంపన్నులు ఎవరైనా మీ సర్కిల్లో ఉంటే, ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా వారు ఈ కోరికలతో కొట్టుకుపోయే వారి కన్నా ప్రశాంతంగా ఉండడం నిశితంగా గమనిస్తే రెండు జీవన విధానాలకు మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది.
ఫలాపేక్ష అనేది ఇలాంటి వ్యక్తుల ఆలోచనల్లో ఉండే కీలకమైన డ్రైవింగ్ ఫోర్స్. “నేను ఎంతైనా కష్టపడతాను, కానీ నేను కోరుకున్న ఫలితం మాత్రం నాకు కావాలి” అన్న ఆలోచనలో వీరు ఉంటారు. ఎప్పుడైతే ఫలితం పట్ల ఆసక్తి ఉంటుందో అప్పుడు గతంలో ఓ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన “ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయి” అనే సత్యానికి దూరంగా బ్రతికినట్లవుతుంది. ఫలితం పట్ల ఆసక్తి ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు, అనుకున్న ఫలితం రాకపోతే నిరుత్సాహానికి గురి అయ్యే విత్తనాలు కూడా మనస్సులో నాటబడతాయి. దీంటో ఆ కర్త యొక్క స్వాధిష్టాన మరియు మణిపూరక చక్రలలో ఎనర్జీ బ్లాక్స్ మొదలవుతాయి. దాంతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం సమతౌల్యం దెబ్బతింటుంది.
కావలసినంత సంపద, చుట్టూ మనుషులు ఉంటేనే “తాము జీవితంలో చాలా సాధించాము” అనే అహం తలకు ఎక్కించుకుని చాలా సెక్యూర్డ్‌గా ఉన్నామని చాలామంది భ్రమిస్తుంటారు. ఇలాంటి వారికి ఒక్కసారిగా ఆర్థిక నష్టాలు వచ్చినా, చుట్టూ ఉన్న మనుషులు దూరమైనా తట్టుకోలేరు. డిప్రెషన్‌కి గురవుతారు. చుట్టూ ఎవరూ లేకపోయినా, ఆదాయం చాలా తక్కువగా ఉన్నా ఉన్నదాంట్లో సంతృప్తిగా లౌకిక జీవితం బ్రతకొచ్చు అనే ప్రజ్ఞ వీరికి ఎప్పటికీ ఏర్పడదు.
వస్తువులకు, మనుషులకు దూరంగా ఒంటరిగా వదిలేసినా తన ఆత్మలో నిశ్చలంగా ఉంటూ, మైండ్‌ని, మైండ్ కేలిక్యులేషన్స్ని పట్టించుకోకుండా బ్రతకగలిగే వ్యక్తులను తయారు చెయ్యడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు చేత భగవద్గీత చెప్పబడింది.
ఎడతెరిపిలేని కోరికలు సంపదని పెంచుతాయి, సర్కిల్‌ని పెంచుతాయి. దీంతో అవి వచ్చాక అహం మొదలవుతుంది. అహం అనేది “నేను మాత్రమే గొప్ప” అనే మానసిక స్థితికి దిగజారుస్తుంది. దీంతో మిగతా మనుషుల్ని జడ్జ్ చెయ్యడం, వాళ్లే చీర కట్టుకున్నారు, ఎలాంటి కారు వాడుతున్నారు, మనం సామాజికంగా ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఇంకా ఎలైట్ పీపుల్‌గా చలామణి కావాలంటే ఇంకెంత కష్టపడాలి వంటి లెక్కలు మొదలవుతాయి. దీంతో మనుషులకి మధ్య సపరేషన్ ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తి యొక్క ఇగో ప్రతీ మనిషీ దైవ స్వరూపమే అనే మానసిక స్థితి నుండి యోజనాల దూరంగా జరిగిపోతుంది. అతను విశ్వాన్ని, భగవంతుడినీ ఎప్పటికీ తెలుసుకోలేడు.
- Sridhar Nallamothu