“ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటానూ.. ప్రతీ నిముషమూ నేను..” చాలామందికి ఇష్టమైన పాట…
ఓ మనిషిని ఆరాధించడం, విరహంలో ప్రతీ క్షణం వారి గురించే ఆలోచించడం… వాళ్లూ మన గురించే ఆలోచిస్తున్నారని భ్రమించడం.. మన గురించే ఆలోచించాలని మొండికేయడం… మనకు అలవాటు కాబట్టే.. ఆ పాట అంత హిట్ అయింది.
నిజంగా అది ప్రేమో, వ్యామోహమో తెలీదు గానీ ప్రేమిస్తున్నామన్న ఫీలింగ్‌నే చాలామంది థ్రిల్లింగ్‌గా ఫీలవుతుంటారు.
“మన కోసం అన్ని పనులూ మానేసి మన గురించే ఆలోచిస్తున్న ఓ మనిషి ఈ ప్రపంచంలో పుట్టేశారు” అన్న థాట్ మనకు భలే నచ్చేస్తుంది.. మనస్సు పులకించిపోతుంది 😛
ఒకరి హృదయంలోకి జొరబడ్డాక.. ఆ హృదయం మొత్తాన్నీ ఆక్రమించుకోవాలన్న పిచ్చి కోరిక మనది… ఆ మనిషి ఇంకేం ఆలోచించకూడదు.. అన్ని ప్రయారిటీలూ పక్కనబెట్టి ఫస్ట్ ప్రయారిటీగా వాళ్లు మనల్ని తీసుకోవాలి…
మన కళ్లల్లోకి కళ్లు పెట్టి తన్మయత్మంతో చూడాలి… మన పరోక్షంలో ఆ కళ్లగుండా ఏ ఆలోచనా వారి మనస్సులోకి జొరబడి మన ప్రయారిటీని పక్కకు తోసేయకూడదు!! 🙂
ఇలా కళ్లూ, మాటలూ, చేతలూ అన్నీ మనవైపోవాలి.. అప్పుడే ఆ మనిషి పూర్తిగా మన స్వంతం అన్న సంతృప్తి కలుగుతుంది. దీన్నే పొసెసివ్‌నెస్ అని ముద్దుగా పిలుచుకుంటాం అనుకోండి… 🙂
—————————————————————–
పిచ్చి కాకపోతే… ఎంతసేపని ఒక మనిషి ప్రపంచాన్ని మొత్తాన్ని వదిలేసి మరొక మనిషి గురించే ఆలోచిస్తూ బ్రతికేస్తారూ..?
ఈ పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిపోయి.. “నువ్వు నా గురించి ఆలోచించట్లేదు.. నన్ను పట్టించుకోవట్లేదు..” అని సూయిసైడ్స్, హత్యలూ చేసే మానసిక రోగులు పుట్టుకొస్తున్నారు 🙁
————————————————————-
ప్రతీ ఒక్కరికీ పర్సనల్ స్పేస్ ఉండాలి కదా… దాన్ని కూడా ఆక్యుపై చేయాలని చూస్తే ఎలా? లవర్ అయినంత మాత్రానా, పెళ్లయినంత మాత్రానా, లేదా ఫ్రెండ్ అయినంత మాత్రానా… అన్నీ మనకు చెప్పేయాలనీ, షేర్ చేసుకోవాలనీ, ఒడిలో తలపెట్టి ఏడవాలనీ, మనం ఓదార్చాలనీ.. తద్వారా ఉదాత్తులుగా మిగలాలనీ ఎన్ని పిచ్చి కోరికలు?
ఒక మనిషి తనని తాను కోల్పోయి మనకు సరెండర్ అవడం మనకు ఇష్టం… దానికి ప్రేమ అని ఓ గొప్ప పేరు తగిలించేశాం… అలా సరెండర్ అవడం కోసం పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి… “ఈ మెంటల్ ఫెలోతో తట్టుకోలేం” అని ఇక భరించలేక అవతలి వారు ఒప్పుకునే వరకూ, సరెండర్ అయినట్లు నటించేవరకూ సాగదీసి… ఓ మనిషి పూర్తిగా మన కంట్రోల్ లో ఉన్నారని సంబరపడిపోతుంటాం 🙂
—————————————
అమ్మాయికైనా, అబ్బాయికైనా… అదే పొసెసివ్‌నెస్! ఈ మనిషి పూర్తిగా మనకే స్వంతం కావాలి!! అదేమైనా సెల్‌ఫోనా.. కొనేసి భద్రంగా పాకెట్లోనో, పర్సులోనో పెట్టుకోవడానికీ?
పనులన్నీ మానేసుకుని… “ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో..” అనుకుంటూ తన్మయత్వంలో మునిగిపోవడం ప్రేమ అన్పించుకోదు… అలా ఆలోచిస్తేనే ప్రేమ అనుకునే గుడ్డితనం మనకు కమ్ముకుంటే తప్పించి!!
పాపం మీరు ప్రేమించిన వాళ్లకు పర్సనల్ పనులు చాలానే ఉంటాయి.. చేసుకోనీయండి… 🙂 అన్నీ మీరు ఊహించుకుంటూ కూర్చుంటే ఎలా.. వాళ్లకీ కొంత ఊపిరాడాలి కదా…. మన పిచ్చి ప్రేమ నుండి!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply