గర్భంలో ఊపిరిపోసుకుని.. కణాల నుండి అవయువాలుగా రూపుదాల్చి సంపూర్ణ దేహంగా ప్రపంచంలోకి అడుగిడి…
శ్వాసిస్తూ… శక్తిని పుంజుకుంటూ.. జగన్నాటకంలో “అంతా తానే” అన్నంతగా భ్రమపడుతూ.. ఎగిరెగిరి పడీ, ఎగసెగసీ పడీ..
శక్తి సన్నగిల్లీ, దిగులుపడీ, చూపు శూన్యంలో ఇరుక్కుపోయీ.. తోలు తిత్తుల మధ్య ఎముకల గూడుగా మిగిలిపోయీ…
శ్వాస మందగించీ… ప్రాణం అవయువాలన్నింటినీ క్రమేపీ విడిచిపెడుతూ… అచేతనం చేస్తుంటే…
ప్రకృతిలోని వాయువు శరీరపు ఆయుష్షుని ఏమాత్రం కాపాడలేకపోతుంటే…
కొండెక్కిన ప్రాణం చిగురుటాకులా వణికిపోయేలా… తుది శ్వాస ఉక్కిరి ఉక్కిరి చేసీ… దేహాన్ని మట్టితో సమానంగా మార్చేస్తే…
ప్రాణప్రతిష్టకూ, సమాధికీ నడుమ ఏ బావుకోగలమనీ ఈ జగన్నాటకంలో మన వింత ఛేష్టలు?
ఉద్వేగాలూ, ఉద్రేకాలూ… ఆవేశాలూ.. ఆందోళనలూ.. నవ్వులూ… నటనలూ… అన్నీ అణిగిపోయి దేహం మంచు ముద్దలా మిగిలే తరుణం ఉండనే ఉంది…
ప్రాణం నిలిచి ఉన్నంతలో నీకు నీవుగా మిగలలేని నీకు ప్రాణం ఎందుకు?
మరణం తధ్యమే… మరణం భయానకమే.. మరణం గురించి ఆలోచన ఆందోళన కలిగించేదే… కానీ జీవించి ఈ ప్రపంచానికి ఏం చేస్తున్నావని?
నీ ఆత్మన్యూన్యతతోనూ, అసూయతోనూ, కోరికలతోనూ, కాంక్షతోనూ, స్వార్థం తోనూ… మనుషుల మధ్య మానసిక సమతౌల్యానికి విఘాతం చేకూరుస్తుంటే… ఏ ప్రకృతి నిన్ను రక్షిస్తుంది? అస్సలు మనలాంటి వినాశక శక్తి సంహరించబడాలే గానీ ప్రాణం కొనసాగింపబడకూడదు కదా!
—————————–
గమనిక: ఈ భాషా, ఈ ఆలోచనలూ మిత్రులు చాలామందికి కటువుగానూ, జీర్ణింపశక్యం కానివిగానూ ఉండొచ్చు… కానీ ఇది యధార్థం.. మనిషి ఆద్యాంతాల చుట్టూ సాగే జగన్నాటకం!
– నల్లమోతు శ్రీధర్
Chala nijayithi ga rasaru..
Sati manishi kosam mee tapana.. arthamavuthundi.