కదలకుండా నీళ్లు స్థిరంగా ఉండే చెరువుని గుర్తు తెచ్చుకోండి. అందులోకి ఎవరో తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిల్ ఉంది అనుకోండి. అది నీళ్ల మీద తేలుతూ ఉంటుంది కదా! ఆ చెరువులో పెద్దగా గ్రావిటేషనల్ శక్తి లేదు కాబట్టి అలా కదలకుండా ఆ బాటిల్ నీటి ఉపరితలం మీద తేలుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఆ బాటిల్ పడేసి ఉన్న దగ్గరలో ఓ తూము ద్వారా నీరు బయటకు పోతోంది అనుకోండి. ఇప్పుడు కదలకుండా ఉన్న వాటర్ కి గ్రావిటీ (గురత్వాకర్షణ శక్తి) జత అయింది. దీంతో ఏమవుతుంది? ఆ తూము దగ్గర ఓ సుడిగుండం లాంటి స్ట్రక్చర్ ఏర్పడి నీరు అక్కడ సుడులు తిరుగుతూ లోపలికి లాగి వేయబడుతుంది. దీంతో దూరంగా ఉన్న నీళ్లు కూడా సుడులు తిరుగుతూ (spin) ఆ తూము వైపు వస్తుంటాయి. ఆ నీళ్ల బాటిల్ కూడా ఆ గురత్వాకర్షణ శక్తి వైపు గుండ్రంగా తిరుగుతూ వస్తుంది.
సరిగ్గా విశ్వం నుండి మన శరీరంలో ఉండే ఆటమ్స్, సబ్ ఆటమిక్ పార్టికల్స్ వరకూ ఇలా నిరంతరం సుడులు తిరగడం జరుగుతూనే ఉంటుంది. అలా తిరగడంలో భాగమే భూమి, ఇతర గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగడం లాంటివి.
మనకు సమానమైన వేగంతో ఉన్నవి మనకు కదలకుండా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదా.కి.. మీరు ఒక బస్ లో కూర్చున్నారు అనుకోండి. మీ ముందు సీట్లో ఉన్న వ్యక్తి స్థిరంగా కూర్చున్నట్లు కనిపిస్తాడు. అదే మీరు బస్ దిగి, కదిలే బస్ని బయట నుండి చూస్తున్నారు అనుకోండి. అదే సీట్లో ఉన్న వ్యక్తి వేగంగా వెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది. అంటే మీ స్పీడ్ బస్ స్పీడ్ వేరు అయినప్పుడు మాత్రమే బస్ వేగంగా వెళుతున్నట్లు మీకు తెలుస్తుంది.
సో మనం భూమ్మీద ఉన్నప్పుడు భూమి సూర్యుడి చుట్టూ గంటకి 1000 మైల్స్ చొప్పున తిరుగుతూనే ఉంది అన్నది అర్థం కాదు. కారణం భూమి తనతో పాటు మనల్నీ అదే స్పీడ్ లో తిప్పుతోంది కాబట్టి! అదే వేరే గ్రహం మీదకి వెళ్లి చూస్తే భూమి పరిభ్రమిస్తున్న విషయం తెలుస్తుంది.
సరిగ్గా అలాగే ఈ విశ్వమంతా కేవలం ఈ స్పిన్నింగ్ ద్వారానే నిర్మితమవుతోంది. ఉదా.కి.. మనిషి రక్తాన్ని మైక్రోస్కోప్ లో పరిశీలిస్తే రక్తంలోని పార్టికల్స్ స్పిన్ అవుతున్నట్లు గమనించవచ్చు. చివరకు పైకి నున్నగా ఉండే చర్మంలోని కణాలను, వాటిలోని ఆటమ్స్, ప్రోటాన్స్ని పరిశీలిస్తే అవి 99 శాతం ఖాళీ ప్రదేశంతో, 1 శాతం ఎనర్జీతో వేగంగా తిరుగుతూ ఉండడం ద్వారా ఓ గుండ్రని వంపు తయారై, కోటానుకోట్ల ఆటమ్స్ కలిసి ఓ కణంగా, అలాంటి కోట్ల కణాలు కలిసి టిష్యూగా ఒకదానికొకటి గ్రావిటేషనల్ శక్తితో అతుక్కుపోయినట్లు ఏర్పడి పైకి మనకు బరువుగా, బలంగా ఉన్న శరీరంగా తయారవుతాయి.
పైన మనం చెప్పిన చెరువులో నీళ్ల ఉదాహరణనే తీసుకుంటే.. తూము వైపు నీళ్లు లాక్కునేటప్పుడు… అలా కదులుతూ ఉండే నీళ్లలో మళ్లీ చిన్న చిన్న సుడులు (వీటినే కోహరెంట్ ప్యాట్రర్న్స్ అంటారు) కనిపిస్తూ ఉంటాయి కదా! ఇలా విశ్వం నుండి మన శరీరంలోని ప్రోటాన్స్ వరకూ ఎనర్జీ పరిభ్రమణం జరిగేటప్పుడు.. అక్కడక్కడ ఏర్పడే సముదాయాలే మనం బయట ప్రపంచంలో చూసే మెటీరియల్ రియాలిటీ. అంటే మనం చూసే బిల్డింగులు, మనుషులు, దేశాలు ఇలా మనకు కళ్లకు కనిపించే ప్రతీదీ ఇలాగే ఏర్పడుతుంది అన్నమాట.
ఉదా.కి.. ఒక కులానికి చెందిన వ్యక్తులు ఓ సంఘంగా ఏర్పడి ఓచోట కలిశారు అనుకోండి. వారి ఆలోచనల్లో కులం అనే ఒక అంశం ఆధారంగా కోహరెన్స్ (పొందిక) ఏర్పడి ఉంది. మరికొందరు హిందూ మతమని, క్రిస్టియానిటీ అని ఇలా ఒకే విధమైన ఆలోచనల ద్వారా కోహరెన్స్ కలిగి ఉంటారు. మరికొందరు దేవుడు, భక్తి అని నిరంతరం భజనల గురించి, పూజల గురించి మాట్లాడుకుంటూ కోహరెన్స్ కలిగి ఉంటారు. విశ్వం మొత్తం స్పిన్ అయ్యేటప్పుడు ఇలా ఒకే రకమైన వేవ్‌లెంగ్త్, ఎనర్జీ ఫీల్డ్‌తో ఉన్న వ్యక్తుల ఎనర్జీ వారంతా కలిసి ఓచోట కూర్చున్నప్పుడు వారు యూనివర్శ్లోకి వెదజల్లే వైబ్రేషన్ ఆధారంగా ఓ ప్యాట్రర్న్గా తయారవుతుంది. ఆ ప్యాట్రర్న్ థింకింగ్ నుండి “మనమంతా ఓ సొసైటీ రిజిస్టర్ చేసుకుందాం” అనే ఆలోచన ఉద్భవించడం, ఆ ఆలోచన వచ్చిన వెంటనే సొసైటీ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి అన్నది వారి థాట్స్ స్పిన్ అవడం ద్వారా అందరి ఏకాభిప్రాయంతో ఒకరిని సూచించడం, వారి ఆలోచనలకు తగ్గట్లు వారి బ్రెయిన్, నెర్వస్ సిస్టమ్ లో మోటార్ మెకానిజం ద్వారా చేతులు, కాళ్లలో కదలికలు ఏర్పడి సంతకాలు చెయ్యడం, రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లడం ఇవన్నీ చకాచకా జరిగిపోతాయి. వీటన్నింటి వెనుకా ఉన్నది ఏంటంటే.. స్పిన్నింగ్ ద్వారా ఏర్పడిన ఒకే రకమైన కోహరెన్స్ ఆలోచనలు మాత్రమే.
విశ్వంలోని గ్రహాలు, దేశాలు, రాష్ట్రాలూ, కులాలూ, మతాలు, సమూహాలు, ఒకే రకమైన పక్షులు, జంతువులు, ఒకే రకమైన ఆలోచనలు ఇలా ప్రతీదీ ఎప్పటికప్పుడు తమ వైబ్రేషన్ ద్వారా ఓ పొందిక (కోహరెన్స్) ఏర్పరుచుకుని తమ లక్ష్యాలను నెరవేర్చుకుని మన కళ్లకి కనిపించే వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఉదా.కి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేదే తీసుకుందాం. కోట్ల మంది తెలంగాణ వాసుల ఆలోచనల్లో ఉండే కోహరెన్స్ ఆ రాష్ట్ర సాధన వెనుక ఉన్న ఉద్యమాలకు కారణం అయింది.
అంతెందుకు ప్రకృతిలో మన కళ్లకి కనిపించని పొందిక ఎంతో ఉంది. ఒక కెమెరాని ట్రైపాడ్ కి పెట్టి ఓ రెండు రోజుల పాటు ఓ గులాబీ మొక్కని ఫ్రేమ్ చేసి కదలకుండా రికార్డ్ చేస్తూ ఉండండి. టైమ్ లాప్ప్ మోడ్ లో రికార్డ్ చేస్తే.. గులాబీ చిగురు తొడిగి మొదట ముడుచుకుని, ఆ తర్వాత విచ్చుకోవడం వరకూ ఓ ప్యాట్రర్న్, కోహరెన్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొగ్గ తొడగడం మొదలుకుని పువ్వుగా విచ్చుకోవడం వరకూ అది spin అయింది. కానీ అలా వివిధ దశలు దాటడానికి చాలా సమయం పట్టింది కాబట్టి మనకు అది spin అయినట్లు అర్థం కాలేదు. కేవలం timelapseలో చూసినప్పుడు మాత్రమే ఇంత మార్పు జరిగిందా అన్నది తెలిసింది. సో విశ్వమంతా ఓ పొందికలో ఇలా నిర్మితమవుతూనే ఉంటుంది.
అంతెందుకు మీరు వాడే స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి రావడం వెనుక.. ఆయా కంపెనీల డిజైనింగ్ టీమ్, ఇంజనీరింగ్ టీమ్, ప్రొడక్షన్ టీమ్ మొత్తం తమ ఆలోచనల్లో ఉండే ఐడియాని ఎగ్జిక్యూట్ చేసి ఉత్పత్తి చేసే వరకూ కలిగి ఉండే కోహరెన్స్, వారి ఆలోచనల్లో నిరంతరం సుడులు తిరిగే ఆ లక్ష్యమే ఈరోజు.. రకరకాల ముడి పదార్థాలను వేడి, చల్లబరచడం, వత్తిడి ద్వారా కర్వ్ గా వంగేలా చెయ్యడం ఇలా కావలసిన విధంగా మార్చుకుంటూ ఫోన్ తయారయ్యేలా జరిగాయి.
ఇలా తెలుసుకుంటూ పోతే విశ్వం ఎంత పొందికలో ఉందో అర్థమవుతుంది.
- Sridhar Nallamothu