ఓ గంట సేపు Facebook ముందు కూర్చోండి… అక్కడి నుండి కదలబుద్ధి కాదు… టివి అయినా అంతే… చివరకు మనం చేసే పనైనా అంతే….
ఏదో ఒక దానికి జిడ్డులా అతుక్కుపోయి ఒక సీక్వెన్స్‌లో కొట్టుకుపోతుంటాయి మన బ్రెయిన్లోని ఆలోచనలు…! చివరకు శరీరం అలసిపోయి మూలనపడాల్సిందే తప్ప మనం అతిగా అతుక్కుపోయిన పని గురించి ఆలోచనలు మాత్రం సద్ధుమణగవు.
చేసే పని మంచా చెడా అన్న పట్టింపు మొదట్లో కాసేపు ఉంటుంది తప్ప తీరా చేయడం మొదలెట్టాక.. మంచీచెడూ అన్న డిఫరెన్షియేషన్ పక్కకెళ్లిపోయి మరింత వ్యామోహంలో ఆ పనిలో మునిగిపోవడానికి అలవాటు పడిపోతాం.
అందుకే మన వ్యవహారం తేరిపార చూసిన వాళ్లెవరైనా.. “పొద్దస్తమానూ ఆ ఫేస్‌బుక్‌లోనో, లేదా అలా ఆఫీస్ పనిలోనో ఉండకపోతే కాస్తంత గాలి మార్పుకి అలా బయట మనుషులతో తిరగొచ్చు కదా” అని మాటవరుసకు అన్నారే అనుకోండి.. పైకి కాకపోయినా మనస్సులో కయ్యిన లేస్తాం.. “ఇలా ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి మీ పని మీరు చూసుకోవచ్చు కదా” అని!
———————————
“చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యాలి… ” అనే ఓ తప్పుడు అభిప్రాయం మన చిన్నప్పటి నుండి మన మెదళ్లలో బలంగా నాటబడింది. Perfection needs more attention and resources. ఎంత ఎక్కువ అటెన్షన్ పెట్టే కొద్దీ ఆ పని పట్ల అంత మమకారం పెరిగిపోతుంది. పనే కాదు.. రిలేషన్లూ అంతే… 🙂 కావాలంటే ఓ మనిషితో అన్నీ మర్చిపోయి ఓ 10 రోజులు ఎడాపెడా మాట్లాడేయండి… “ఆ మనిషి లేకపోతే అస్సలు లైఫే లేదన్నంతగా” మైండ్ మౌల్డ్ అయిపోతుంది.
టైమూ… ఆలోచనలూ, విశ్లేషణలూ, శ్రమా వంట్ని సకల వనరుల్నీ పోగేసి ఫేస్‌బుల్ లాంటి వాటిలో గడిపినా…. లేదా మరో ప్రొడక్టివ్ పనిలో గడిపినా పెద్ద తేడా ఏం ఉండదు. రెండూ ఆరోగ్యానికీ, మనస్సుకూ మంచిది కాదు. ఓ అగాధంలోకి అవి లాగేస్తుంటాయి.
———————————————–
ఈ ట్రాప్‌కి మరో కారణం కూడా ఉంది.
ప్రతీ మనిషికీ ఓ వ్యాపకం కావాలి. సరైన పనీపాటా లేకపోతే ఖచ్చితంగా బ్రెయిన్ శరీరం మొత్తాన్నీ బిల్డింగ్‌పై నుండి దూకేలానూ ప్రేరేపించేటంత క్రూరమైనది.. సరిగ్గా ఈ సందర్భంలో వ్యాపకాలుగా మొదలైన పనులు వ్యసనాలుగా మారుతున్నప్పుడే కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. డిటాచ్ కాలేనంతగా అటాచ్ అయిపోవడం… అంత బలమైన అటాచ్మెంట్ వల్ల కొత్త తలనొప్పులు పుట్టుకురావడం… మరో నిస్పృహకి సమీపంగా వెళ్లడం ఆటోమేటిక్‌గా జరిగేస్తాయి.
————————
ఈరోజు మనుషులు శరీరాలు కదల్చకుండా కుర్చీలో ఏళ్ల తరబడి అలాగే కూర్చుండిపోతున్నా…
ఫేస్‌బుక్‌లూ, టివిలూ, ఆడియో ఫంక్షన్లూ.. సినిమా గాసిప్పులూ, పొలిటికల్ అనాలసిస్లూ, ఎడతెరిపిలేని కబుర్లూ వంటివన్నీ ఏళ్లతరబడి మనల్ని ఓ మాయలో ముంచేస్తున్నా మనకు చీమకుట్టినట్లయినా ఉండకపోవడానికి కారణం… మనకు ఆయా విషయాల పట్ల ఎవరు చెప్పినా విన్పించుకోనంత వ్యామోహం పెరిగిపోవడమే!
వంద రకాల పనులు చెయ్యగల మనిషీ… ఎన్నో టాలెంట్లు కలిగిన మనిషీ…. నిట్టనిలువునా నిర్వీర్యం అయిపోవడానికి ఈ బలహీనతలూ, అటాచ్మెంట్లూ చాలవా?
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply