అక్కడెక్కడో నరకం ఉందని పోయే లోపే భయపడుతుంటారు చాలామంది..! ప్రస్తుతం మనం అనుభవిస్తున్న మానసిక నరకానికి మించి పవర్ఫుల్ ఇంకేదీ లేదని తెలీదు పాపం!
ఇంతమంది మనుషుల మధ్య ఎలా హాపీగా బ్రతకాలో తెలీక అందర్నీ శత్రువులుగా భావిస్తూ, ద్వేషిస్తూ, ఆ ద్వేషం నుండి వచ్చే by products అయిన ఇన్సెక్యూరిటీ, భయాలతో బ్రతకడం అతి పెద్ద నరకం.
అసలు పక్క మనిషి అంటే ఎందుకు చులకనో మనకు తెలీదు. ఎవడో ఏంటి మనకు చెప్పేది అనే అహం. ఎవడో ఎదుగుతుంటే ఓర్వలేనితనం.. మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదనే అసంతృప్తి.. మనం అన్యాయమైపోతున్నామనీ, ఈ లైఫ్ ఇలా ఏడ్చిందేమిటని మనల్ని మనం తిట్టుకునే ఫ్రస్టేషన్.. ఇలా ఎన్నో.. కర్ణుడి చావుకి శతకోఠి కారణాలన్నట్లు.. నిరంతరం లోపల మండిపోతుంటాం.. అసలు ఇన్ని నెగిటివ్ ఎమోషన్లని ఎలా హ్యాండిల్ చెయ్యాలో, ఎలా తీర్చుకోవాలో తెలీక కన్పించిన ప్రతీ వాళ్లపై వాటిని వెళ్లగక్కి కొత్త శత్రువుల్ని తెచ్చుకోవడం!
ఓ చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.. నేను ఇలా నీతి వాక్యాలు రాస్తే… మీకు నచ్చదు… “మనకు తెలీదా ఏంటి.. వీడెవడు మనకు చెప్పేది” అని లోపల నుండి ఓ వాయిస్ పొడుస్తుంటుంది. ఫాస్ట్‌గా స్క్రీన్ scroll చేసి రిజెక్ట్ చేసి పారేస్తారు. అంతటితో అయిపోయిందా.. అయిపోదు. నేను రాస్తూనే ఉంటాను, నచ్చని వాళ్లు లోపల అలా ఫీలవుతూనే ఉంటారు, కొన్నాళ్లకి unfriend చేసో, ఫాలో అవడం మానేయడమో చేస్తారు. సమస్య తీరిందా? తీరదు.. లోపల ఓ గిల్ట్ ఫీల్ అలా పర్మినెంట్‌గా కూర్చుండిపోతుంది.
సో దీన్ని ఎనలైజ్ చేద్దాం.. నేను మీకు శత్రువునా? – straight answer కాదు.
మరి మీకు నాకు సమస్యేంటి? – నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు, నాకు అవి నచ్చట్లేదు, అయినా నాకు అన్నీ తెలుసు.
సో దీనిలో స్పష్టంగా కొంత అహం, కొంత ధిక్కార ధోరణి కన్పిస్తోంది. సో వాస్తవానికి ఇది ఎవరి సమస్య? నాది కాదు కదా, మీదే కదా? సో సమస్యని మీరే సృష్టించుకుంటున్నారు. నేను నథింగ్… ఏదో తెలిసీ తెలియని నాలుగు మాటలు చెప్తుంటాను.. వాటిని భరించలేక మీ ప్రశాంతత spoil చేసుకోవలసిన అవసరం లేదు కదా!
ఇలా విశ్లేషించుకుంటూ పోతే చాలా సమస్యలకు మనమే కారణం. మన ఆలోచనా విధానమే కారణం. అస్సలు మనకు జనాలు నచ్చరు, వాళ్లని accept చెయ్యం, ప్రతీదీ తెలుసనుకుంటాం, అప్పుడప్పుడు వినడం కూడా గొప్ప లక్షణం అన్నది గ్రహించం. ఒక సిట్యుయేషన్ని interpret చేసుకునే విధానంలోనూ లోపమే. అన్నీ ఘర్గణాపూరితంగానే ఆపాదించుకుంటాం. ఎదుటి వ్యక్తికి భిన్నమైన అభిప్రాయాలుంటే వాడు మన శత్రువే అనుకుంటాం. ఈ ప్రపంచంలో శత్రువులు, మిత్రులే కాదు.. ఏ వర్గానికీ చెందని గొప్ప మనుషులెందరో మన చుట్టూ బ్రతకుతూ ఉన్నారు. వాళ్లందరితో కలిసి.. ఓ గొప్ప హార్మోనీలో బ్రతికే మెచ్యూరిటీ కొరవడిన రోజున బ్రతికుండగానే నరకం కళ్ల ముందు కన్పిస్తుంది. ప్రతీ వాడినీ చూసి కోపమో, ద్వేషమో, తిరస్కార భావమో, చులకనో ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ పారేసుకుని లోపల రగిలిపోతుంటాం.
సో మనుషుల్ని అన్కండిషనల్గా accept చెయ్యాల్సిన అవసరం ఉంది. లేదంటే చచ్చేలోపు పది జన్మలకు సరిపడా నరకం అనుభవిస్తుంటాం… మన చుట్టూ ఉన్న ప్రతీ మనిషినీ శత్రువుగా భావించి.. వాళ్ల నుండి దూరంగా జరుగుతూ, మనకు మనం ముడుచుకుపోతూ భయం భయంగా!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply