మీరొక వ్యక్తి దగ్గరకు వెళ్లారు. అతను మీకు ఇంతకు ముందు పరిచయం లేదు, అదే మొదటిసారి కలుస్తున్నారు.
అతను కూర్చోమని మీకు సీట్ ఆఫర్ చేసి “రెండు నిముషాలు ఓ చిన్న పని పూర్తి చేసి మీతో మాట్లాడతాను..” అని తలొంచుకుని తన పనిలో తాను నిమగ్నమయ్యాడు.
అతను ఆ ధ్యాసలో మిమ్మల్ని చూసి నవ్వలేదు, ప్రేమగా మాట్లాడలేదు. అయినా అతని ఎదురుగా కూర్చుంటే ఏదో తెలీని ప్రశాంతత మీ మనస్సుని ఆవరించింది. మనస్సు స్థిమితంగా అన్పించింది.
ఏం మాయ ఉంది అక్కడ?
మీరు మరో వ్యక్తిని కలిశారు. మిమ్మల్ని చూడగానే నోరంతా సాగదీసుకుని పెద్దగా నవ్వి, చాలా కాలం నుండి మీకు పరిచయం ఉన్నట్లు బాగా రిసీవ్ చేసుకున్నాడు.
మాటల్లో చాలా ప్రేమ ఉట్టి పడుతోంది. పైకి అంతా బానే ఉంది గానీ.. కారణం లేకుండానే మీలో అలజడి రేగుతోంది. మనస్సు స్థిమితంగా లేదు!
అతను బానే మాట్లాడుతున్నాడు కదా.. మరి అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న మీకు ఆ అలజడి ఎక్కడి నుండి వచ్చింది?
చాలామంది పైపై నవ్వే నవ్వులకీ, మాటలతో చూపించే ప్రేమలకి పడిపోతుంటారు. అలా పడిపోవడం వారి బుద్ధి చేసే అన్ కాన్షియస్ యాక్టివిటీ. కానీ వారి సోల్కి ఎదుటి వ్యక్తి ఎలాంటి వైబ్రేషన్ కలిగి ఉన్నాడో, ఆ వైబ్రేషన్స్ మన మానసిక స్థితిని స్థిమిత పరుస్తాయో, అల్లకల్లోలం చేస్తాయో స్పష్టంగా తెలుసు. అందుకే మీకు కారణం తెలీకుండానే గుండెల్లో అలజడి రేగుతుంది. ఒక మనిషిని కలవాల్సిన పనిలేదు.. ఒక పేరు తలుచుకుంటే తెలీని ప్రశాంతత, సంతోషం లభిస్తాయి.. మరో మనిషి పేరుని తలుచుకుంటే వరుసబెట్టి ఆలోచనల ప్రవాహం ఆగదు.
మీరు గనుక నిరంతరం మెడిటేషన్ చేస్తుంటే.. మన బుద్ధి ఏర్పరిచే కండిషనింగ్, జడ్జ్మెంట్, కంపారిజన్ వంటి అన్ని పొరలను దాటుకుని సోల్ లెవల్లో బ్రతకడం అలవాటు చేసుకుంటే.. మీరు ఒక వ్యక్తిని కలిసినా, ఒక వ్యక్తి మీరు ఉన్న గదిలోకి రావడానికి కొన్ని క్షణాల ముందు కూడా, ఓ సంఘటన జరడానికి కొంత సమయం ముందు కూడా ఆ వైబ్రేషన్ హృదయానికి తెలుస్తుంది.
ఎదుటి వ్యక్తి నోరు తెరిచి మాట్లాడాల్సిన పనిలేదు.. అసలు అతని రూపాన్ని కూడా మీరు చూడాల్సిన పనిలేదు.. అతని auraని మీరు అనుభూతి చెంది అది మీకు కంపాటబుల్ అవుతుందా లేదా అన్నది క్షణాల్లో అనుభూతి చెందగలుగుతారు. ఈ మధ్య చాలాసార్లు నేను ఈ స్థితిని కలిగి ఉండగలుగుతున్నాను. అలాంటప్పుడు మనం కళ్లెత్తి అవతలి మనిషిలోకి చూసే చూపు మామూలు ఐ కాంటాక్ట్ కన్నా ఎదుటి వ్యక్తి మనకు కంపాటబుల్ అవకపోతే అతనిలో ఓ తొట్రుపాటుని సృష్టిస్తుంది.. ఎదుటి వ్యక్తి మన హృదయం స్థాయిలో ఉంటే అనిర్వచనీయైన ప్రేమని సృష్టించి స్వేచ్ఛగా ఒకరికొకరు కలిసిపోయేలా చేస్తుంది.
- Sridhar Nallamothu