బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ।। 29 ।।
ఇప్పుడు విను అర్జునా… ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృఢ సంకల్పం (ధృతి)లకు మధ్య వేర్వేరు వ్యత్యాసాలను వివరిస్తాను.
వివరణ:
ఈ 18వ అధ్యాయంలో ఇప్పటి వరకూ కృష్ణ భగవానుడిచే చెప్పబడిన వివిధ శ్లోకాలను పరిశీలిస్తే కర్మలు ఎన్ని రకాలు, కర్మలకు కారణం అయ్యే అంశాలు, జ్ఞానం, కర్మ, కర్త.. వాటి వివిధ గుణాలు వంటివి చెప్పబడ్డాయి. ఈ శ్లోకం నుండి మన చేత చేయబడే ప్రతీ కర్మకి సంబంధించిన అదనపు ప్రాపర్టీస్ (గుణ గణాలను) వివరించబోతున్నారు.
మనం చేసే ప్రతీ కర్మా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే విచక్షణ ఆధారంగా ఏర్పడే బుద్ధిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధి గురించి, అలాగే ప్రతీ కర్మనీ తప్పనిసరిగా చేయాలనే దృఢ సంకల్పం కలిగి ఉంటారు కదా, ఆ సంకల్పం గురించి భగవానుడు వివరించబోతున్నారు.
30వ శ్లోకం:
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్దిః సా పార్థ సాత్త్వికీ ।। 30 ।।
ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
వివరణ:
అన్నింటికంటే ఉత్తమైనది అయిన సత్త్వ గుణం కలిగిన వ్యక్తి మంచి, చెడులకు, ఎలాంటి పనులు బాధ్యతగా చేయాలి, వేటిని పక్కన పెట్టాలి, ఎలాంటి వాటికి భయపడాలి, దేనికి ధైర్యంగా ఉండాలి అన్న స్పష్టత కలిగి ఉంటాడు. ఇది చాలా అవసరమైన క్వాలిటీ. “ఆ ఏమవుతుందిలే, నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారు” అని ఇతరుల్ని కష్టపెట్టడం, చెడు అలవాట్లకి లోనవ్వడం, అనైతికంగా ప్రవర్తించడం వంటివి చేస్తే ఎవరూ ప్రశ్నించరేమో గానీ, ఖచ్చితంగా ఆ దుష్కర్మల యొక్క వైబ్రేషన్ క్వాంటమ్ ఫీల్డ్‌లోకి చేరుకుని దానికి సంబంధించిన ఫలితం ఏదో ఒక రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది. ఈరోజు మనం ఎదుర్కొనే చికాకులు, అసంతృప్తి, తెలీకుండా మనస్సులో నిరంతరం ఉండే రెసిస్టెన్స్ వంటివన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయో ఓసారి ధ్యానంలో కూర్చుని మైండ్‌ని అధిగమించి సోల్ స్థాయిలో గమనిస్తే అన్నీ మనం వెదజల్లిన వైబ్రేషనే మన చుట్టూ మాయలా కమ్ముకుని ఉంటాయి.
“ఏది మంచి, ఏది చెడు అన్నది ఎలా డిసైడ్ చేస్తారు? నాకు మంచి అనిపించినది మీకు చెడు కావచ్చు కదా” అనే ప్రశ్న చాలామందిలో వెంటనే వస్తుంది. నిజమే.. ఏరోజైతే ధర్మ, నీతి, సాంఖ్య శాస్త్రాలను మొదలుకుని వివిధ శాస్త్రాలలో ఏం చెప్పబడిందో కనీసం తెలుసుకోవడం మానేశామో అప్పటి నుండి “నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను” అనే ధోరణి ఎక్కువైంది.
“యుక్తాహారం తీసుకోమని” శాస్త్రాల్లో చెప్పబడింది అనుకోండి. కనీసం అలా ఒకచోట పూర్వ కాలంలోనే చెప్పబడింది అన్న కనీస అవగాహనే లేకపోతే ఇష్టమొచ్చినట్లు తింటాం దానివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటాం. అంటే మంచి చెడుల గురించి శాస్త్రాల్లో చెప్పబడలేదా అంటే చెప్పబడింది, కానీ తెలుసుకోవడానికి మనకు ఆసక్తి లేదు. అలా తెలుసుకోకుండా, కేవలం “నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను” అనే ధోరణిలోకి వెళ్లిపోయాం. ఉండండి.. ఎవరు కాదన్నారు? దానివల్ల ఏర్పడే పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలి కదా! సత్త్వ గుణ బుద్ధి కలిగిన వ్యక్తి శాస్త్రాలను తెలుసుకోవడం ద్వారా సమాజాన్ని గౌరవిస్తూ, తానూ గౌరవంగా బ్రతుకుతూ, తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతాడు.
అలాగే కొన్ని కర్తవ్యాలను విధిగా నెరవేర్చాలి. కొన్ని పనుల్ని అస్సలు చెయ్యకూడదు. ఇలాంటివి కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కుటుంబ పోషణ, సంసార బాధ్యతలు అనేవి తప్పనిసరి బాధ్యతలు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అది తెలిస్తే కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు. తెలీకపోతే “కుటుంబం ఎలా పోతే నాకేంటి, నా ఇష్టమొచ్చినట్లు నేనుంటాను” అని చేయాల్సిన పనుల్ని వదిలేస్తారు. ఇలా చాలానే చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు ఉంటాయి. వాటిని తెలుసుకోవడం కూడా సత్త్వ గుణ బుద్ధి కలిగిన వ్యక్తి చేస్తుంటాడు.
కొంతమంది అధికారంలో ఉన్న వారికీ, బాగా డబ్బున్న వారికీ భయపడుతుంటారు. అది బానిసత్వ లక్షణం. “మనం ఫెయిర్‌గా ఉన్నప్పుడు ఎదుట సియం ఉన్నా, పియం ఉన్నా ఎందుకు భయపడాలి..” అనే ధైర్యం మనిషిని శక్తివంతుడిని చేస్తుంది. ఎవరినీ అగౌరవపరచాల్సిన పనిలేదు.. అందర్నీ గౌరవిస్తూనే మన హుందాతనాన్ని, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోవచ్చు. ఆత్మ గౌరవం లేకపోతే సోలార్ ప్లెక్సెస్ చక్ర (మణిపూరక)లో ఎనర్జీ బ్లాక్ అవుతుంది. ఎప్పుడూ మనిషి తనని తాను తక్కువగా చూసుకుంటూ ఉంటాడు.
అత్యంత ముఖ్యమైన మరో విషయం “ఏది బంధకారకం.. ఏది మోక్ష కారకం” అని గుర్తించడం సత్త్వ గుణ బుద్ధి అవుతుంది. మనల్ని ఓ దగ్గర బంధించేది అది వ్యసనమైనా, బలహీనత అయినా, అహమైనా.. ఏదైనా వదిలిపెట్టాల్సిందే. ఒక వ్యక్తి అదే పనిగా యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చూస్తున్నాడు. అతని సమయం అతని కంట్రోల్లో లేదు. అతని ఎమోషన్స్ అక్కడ ప్రతీ వీడియోలో కనిపించే కంటెంట్‌ని బట్టి కాసేపు నవ్వుతూ, కాసేపు అయ్యో అని జాలిపడుతూ ఉన్నాయి అనుకోండి. ఈ నైజం బానిసత్వం. తన సమయాన్నీ, తన ఎమోషన్స్‌నీ తన నియంత్రణ నుండి అతను కోల్పోయినట్లు లెక్క. కాన్షియస్గా అతని మైండ్ అనేక ముఖ్యమైన పనుల్ని పక్కన పెట్టి అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని చూపిస్తోంది. ఇలాంటివన్నీ బానిసత్వాలే.
ఒక వ్యక్తి తనకు ఇష్టమైన స్నేహితుడిని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్‌కి గురవుతూ మానసిక వేదన పొందుతున్నాడు. ఇదీ బానిసత్వమే. స్నేహితుడికి ప్రేమని, ఆప్యాయతను పంచడం, అతను ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమగా ఉండడం వరకే అతని చేతిలో పని. అలా కాకుండా గతంలో ఆ స్నేహితుడితో గడిపిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని, భౌతికంగా అతను ఇప్పుడు దగ్గరగా లేడు అనే భావనకు లోనవ్వడం కూడా ఎమోషన్స్‌కి బానిసను చేస్తుంది. మన జీవితంలో ఉన్న ఇలాంటి అనేక బానిసత్వాలను అధిగమించగలిగితేనే అప్పుడు నిజమైన స్వేచ్ఛ అర్థమవుతుంది.
- Sridhar Nallamothu