అదేంటో గానీ ఓ పదిమంది ధైర్యపు వచనాలు చెప్తుంటే పిరికోడు కూడా చాలా ధైర్యాలు చెప్తుంటాడు…
“బ్రతికి సాధించుకోవాలి..” అని స్టేట్మెంట్లు ఇవ్వడానికి చాలా బానే ఉంటుంది. బ్రతకాలని ఎవరికుండదు? చావడం ఎవరికైనా ఇష్టమా?
నేను స్వయంగా చాలా ధైర్యంగా ఉన్న రోజుల్లో కూడా అనుకోని పరిణామాల వల్ల ఆర్నెల్లు డీలా పడిపోయి “చనిపోవడం తప్పించి గత్యంతరం లేదనేటంత” ఏ క్షణం ఏం చేసుకుంటానో తెలీని స్థితిని అనుభవించాను.
పరిస్థితులు తెలీని వాళ్లూ, ఈరోజు ధైర్యాల గురించి మాట్లాడుతున్న వాళ్లకూ అర్థం కావు ఇవన్నీ!!
——————
అందుకే మనమందరం ఎంత ధైర్యవంతులమో పరీక్షించబడే భయానకమైన పరిస్థితులు ఎదురవ్వాలని కోరుకుంటూ కూడా ఉంటా.. కొన్ని ఉచిత సలహాలనూ, మేకపోతు గాంభీర్యాలనూ చూసినప్పుడు..!!
————–
డిప్రెషన్ చాలా దారుణమైంది.. మనం చెప్పే ఏ ధైర్య వచనమూ పనిచేయదు.. ఆ మనిషి మామూలు కావాలంటే మనం నిరంతరం ఆ మనిషిని కనిపెట్టుకుంటూ.. చిన్న చిన్నగానైనా సంతోషపెడుతూ… కొన్ని నెలల పాటు ప్రయత్నిస్తే గానీ సాధ్యపడదు…
—————————–
బ్రెయిన్ లో న్యూరాన్లు డిప్రెస్ట్ స్థితిలో ఓ దిశగా బలంగా పనిచేస్తుంటాయి. దాన్ని అడ్డుకట్ట వెయ్యడానికి న్యూరాలజీలో చాలా మందులు ఉన్నాయి. నేను డిప్రెస్డ్ స్థితి అనుభవించినప్పుడు కూడా వాటికి వెళ్దామా అనుకున్నాను.
కానీ అవి బ్రెయిన్ సహజసిద్ధ ఆలోచనా ధోరణిని పోగొట్టేస్తాయి. బ్రెయిన్ remapping జరుగుతుంది. అంటే చిన్న చిన్న స్పందనలకు కూడా నిస్తేజంగా చూడడం వగైరా. సహజసిద్దమైన స్పందనలు కోల్పోతాం అన్నమాట. దానికన్నా మనుషుల ప్రేమ చాలా ముఖ్యం, అటాచ్ మెంట్. దీంతో త్వరగా డిప్రెషన్ నుండి బయటకు రావచ్చు. నేనైతే మెడిటేషన్ ద్వారా బయటకు వచ్చాను..
——————
అందుకే..
మనుషులకు ఉచితంగా ధైర్యం చెప్పడం గాదు.. మనుషులతో ఉండండి, మనుషుల్ని ప్రేమించండి.. ధైర్యం కన్నా ప్రేమ జీవితాల్ని కాపాడుతుంది..
అంతేగానీ చనిపోయిన వాడూ, చనిపోవాలనుకున్న వాడూ ప్రతీ వాడూ పిరికివాడే అయినట్లూ, పిరికివాడు అస్సలు మనిషే కాదన్నట్లు ఆలోచించకండి… మీ ఆలోచనల మీ మీదే పగబడతాయి… మీకే అలాంటి పరిస్థితులు రుచిచూపిస్తాయి.!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply