కూర్చున్న చోటి నుండి మహా అయితే ఎంత చూడగలం?
180 డిగ్రీలో, 270 డిగ్రీలో మనకు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మాత్రమే! అదీ స్పాండిలైటిస్ లాంటిదేదీ లేకుండా మెడ సహకరిస్తే 😛
ఇప్పుడు మనం ప్రపంచాన్ని చూస్తున్నదీ అంతే… బాల్యంలో గమనించినవీ, యౌవ్వనంలో అనుభవించినవీ, మధ్య వయస్సులో అర్థం చేసుకున్నవీ, అభిప్రాయాలు ఏర్పరుచుకున్నవీ, వృద్ధాప్యంలో పోగుచేసుకున్న వైరాగ్యమూ… వీటి చుట్టూనే మనకు అర్థమవుతున్న ప్రపంచం రూపురేఖలు మన మనస్సులో ముద్రించుకుపోయాయి..
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం… సమకాలీన జీవితంలో గుడ్డిగా గాలివాటంగా తోసుకుపోవడం కాదు…
ఈ క్షణపు మన జీవితానికి పునాది చరిత్ర…
చరిత్ర అర్థమైతే చాలా చిక్కుముడులు తేలికగా విడివడతాయి.. జీవితంపై స్పష్టత వస్తుంది…
ఆంధ్రుల, భారతీయుల చరిత్ర, వివిధ రాజులూ, రాజ్యాలూ, కులాలూ, మతాలూ, వాటి మధ్య ఉద్దేశపూర్వకంగా పెంచి పోషించబడ్డ ఆజ్యాలూ అన్నీ చదువుతుంటే పోతే…. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచమూ, మనుషుల ప్రవర్తనలూ, ప్రభుత్వాలూ అన్నీ గతం తాలూకూ చిహ్నాలుగానే ఖచ్చితంగా తోస్తాయి.
రాజకీయ నాయకుల్ని చూసి ఈరోజు మనం ఎంత ఆవేశపడిపోతున్నామో.. అంతే ఆవేశం అప్పటి రాజుల్ని చూసి ప్రజలూ పడిపోయారు..
నిజాయితీగా బ్రతకడం ఈరోజుల్లో కుదరదని మనం ఎలా నిట్టూరుస్తున్నామో అలాంటి నిట్టూర్పులే కొన్ని వందల ఏళ్ల క్రితమూ ఉన్నాయి….
ఎన్నో రకాల మనస్థత్వాల మిశ్రితమే ఈ ప్రపంచం. ఆ మనస్థత్వాలూ, వాటి కోరికలూ, ఆ కోరికలు తీర్చుకోవడానికి అవి అనుసరించే వ్యూహాలూ, కులాలూ మతాల లాంటి గుంపులూ… వాటి సిద్ధాంతాలూ ఇలా… ఏదీ కొత్త కాదు.
చరిత్ర అర్థమైతే, చరిత్రలో జరిగినవేంటో గమనిస్తే ముఖ్యంగా ఒక కామన్ మెన్‌గా ఇన్ని రకాల వత్తిడులను తలకెత్తుకుంటూ మనమూ ఊగిపోము… ఇది ఓ ప్రవాహం… ప్రవాహంలో అన్నీ కాలక్రమంలో కొట్టుకుపోతూనే ఉంటాయి.. ఆవేశపడేది త్వరగా ఊగీ ఊగీ మొదలు పీక్కుని ప్రవాహంతో పాటే కొట్టుకుపోతుంది. నిబ్బళంగా ఉన్నది ఉన్నంతకాలం స్థిమితంగా ఉండేది కాలధర్మం ప్రకారం పోతుంది…. దీన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా.
————————————–
మనుషుల్ని కలిపి ఉంచడానికి సృష్టించబడిన మతాలూ మనుషుల్ని విడదీస్తుంటే… మనం ఆ మతాల్ని పట్టుకుని వేలాగుతూ…. మన మతం ఎంతో గొప్పది అని అవసరం లేని వ్యామోహాన్నీ, తీవ్రవాద భావజాలాల్నీ పెంచుకుంటుంటే… మనుషులు కలిసి ఉండడం అనే మతం యొక్క మౌలిక సూత్రం గొప్పదా? లేక వర్గాలుగా చీల్చబడిన మతాలు గొప్పవా?
ఇలా అన్ని విషయాల్లోనూ మౌలిక సూత్రాలు మరుగున పడిపోతాయి.. మనం నమ్ముతున్నదల్లా….
– దేముడి ఫొటోనీ
– పూజ గదినీ
– చేతిలో ఉన్న డబ్బునీ
– చుట్టూ ఉన్న పదిమంది మందీ మార్ఛలాన్నీ!!
పైవన్నీ ఉంటే చాలు జీవితం ఎలాగోలా లాగించేయొచ్చు అన్నది మన నమ్మకం.
మనకు భక్తి ఉందని నిరూపించుకోవడానికీ, పాపభీతి తొలగించుకోవడానికి ఓ దేముడి ఫొటోని వేలాడదీసుకోవాలి… లేదా గుడికో చర్చికో, మసీదుకో వెళ్లాలి…. ఆయా మతాల మూల సూత్రాలు మనకు అవసరం లేదు.
చరిత్రలో రాజుల్లా అధికారం చెలాయించడానికి, ఆధిక్యత, డాబూ దర్పం ప్రదర్శించుకోవడానికి డబ్బు చేతి నిండా ఉంటే చాలు…
అలాగే మన వైపు కన్నెత్తి చూసే జనాలపై యుద్ధాల్లాంటి దాడులు చేయడానికి మంధీమార్భలం ఉంటే చాలు…
చరిత్ర నేర్పిన మౌలిక సూత్రాలివే…..!!
———————————–
మనలో చాలామందికి చరిత్రలో గతించిపోయిన వారంటే వల్లమాలిన జాలి. అనేక బలహీనతలతో అనవసరంగా కొట్టుకు చచ్చిన వారిగా అన్పిస్తుంది.
చరిత్రలో ఓ ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకోబడ్డాయని చదివి నవ్వుకుంటాం… అదే ఆడదాని కోసం వాస్తవంలోనూ అత్యాచారాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ చేసుకుంటాం.
ఏదీ మారలేదు… ఇంప్లిమెంటేషనే మారింది! మనకు రాజ్యాలు లేవు కాబట్టి చావడమో, చంపడమో, మానభంగం చేయడమో చేస్తున్నాం..
————————
అందుకే చరిత్రని అర్థం చేసుకుంటే జీవితం చాలా సరళం అవుతుంది. అనేక గందరగోళాలూ, మనుషులపై, సమాజంపై మనం వ్యక్తపరిచే అనవసర ఆవేశాలూ మనస్సులోనే శాంతిస్తాయి.. మనమైనా సుఖంగా ఉండగలం!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply