మా చెరువు జమ్ములపాలెం ఊరు నుండి చీరాల వెళ్లేటప్పుడు స్టూవర్ట్‌పురంలో ఓ విగ్రహం, స్లోగన్ కన్పిస్తుంది. నేను ఇంటర్ చదివేటప్పుడే దానికి ఆకర్షితుడుని అయ్యాను.. “పోరాడితే పోయేదేం లేదు, బానిన సంకెళ్లు తప్ప” అని రాయబడి ఉంటుంది. అలాగే బ్రిటీష్ వారి చెర నుండి భారతదేశం పొందిన స్వేచ్ఛ, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో తెగలు, జాతులు, వర్గాలకు మధ్య ఆధిపత్యపోరు, బానిసత్వం, స్వేచ్ఛ, దాని రూపురేఖలూ కూడా గమనిస్తూ వచ్చాను.
మనం సమాజాన్ని బయటకు ఎక్కువ చూస్తాం. భౌతికమైన స్వేచ్ఛ కోసం జీవితాలు అర్పిస్తాం. స్వేచ్ఛ లేదని మన స్వేచ్ఛని లాక్కునే వ్యక్తుల పట్ల resistance, ద్వేషం కలిగి ఉంటాం. కానీ బయటి ప్రపంచాన్ని మాత్రమే కాదు.. నాలోని అంతరంగిక ప్రపంచాన్ని పరిశీలించడం చాలా ఏళ్లుగా మొదలుపెట్టాక స్వేచ్ఛ అంటే ఏంటో స్పష్టంగా తెలియడం మొదలుపెట్టింది. మనం ఆలోచనల్లో ఎంత బానిసలమో తెలుసుకున్నాను. మన అంతరంగ ఉండే, మన ఆలోచనల్లో ఉండే కొన్ని బానిస భావనల గురించి చెబుతాను.
- నిన్న నాకు ఆదర్శమైన స్వామి వివేకానంద, నా ఆలోచనల గురించి రాస్తూ ఓ పోస్ట్ పెట్టాను. నా భావనలు నా స్వేచ్ఛ. అదే చదివిన వాళ్లేమైనా జడ్జ్ చేస్తారో అని నేను కుంచించుకుపోతే అది మీ జడ్జ్మెంట్కి నా బానిసత్వం. యెస్.. అలా మీ జడ్జ్మెంట్ గురించి సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ నా హృదయాన్ని ప్రభావితం చేసుకుంటే అది నా బానిసత్వం.
- ట్రాఫిక్‌లో వెళుతుంటాను. చాలాసార్లు అందరిలాగే నాకూ చిరాకు వస్తుంది. తిట్టుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కసారి నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుంటే.. What is happening with my mind అని గమనిస్తే.. అప్పుడు అర్థమవుతుంది. నేను నా ఎమోషన్లకి బానిసను అని! ఈ విషయం గమనించాక, ట్రాఫిక్‌లో నా కళ్లెదుట జరిగే ప్రతీదీ ఎలాంటి భావోద్వేగం లేకుండా జస్ట్ విట్నెస్ చేస్తున్నాను. దాంతో నా ఆలోచనలు, ఇతర వాహనదారుల చర్యల పట్ల నా జడ్జ్మెంట్ అన్నీ ఆగిపోయాయి. నా డ్రైవింగ్‌లో నెమ్మది చోటు చేసుకుంది. దాంతో నా భావోద్వేగాలు మాయమవుతున్నాయి. ఎప్పుడైతే మళ్లీ మైండ్ వర్క్ చేస్తుందో అప్పుడు మళ్లీ భావోద్వేగాల పట్ల నా బానిసత్వం మొదలుకావచ్చు.
- మీకు ఓ వ్యక్తి బాగా ఇష్టం అనుకోండి. ఆ వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి. అది ప్రేమ, ఎఫెక్షన్ అని రకరకాలుగా లేబుల్స్ వేసుకుని భావించవచ్చు. బట్ నీలో వెలితిని సృష్టించి నీ ఆలోచనలను హైజాక్ చేసేది ఏదైనా నా దృష్టిలో బానిసత్వమే! నేనూ అతి కొద్దిసార్లు ప్రేమ కోసం పరితపిస్తాను. కానీ నా రూట్ చక్ర, నా హార్ట్ చక్రలో ఎనర్జీ బ్లాక్స్‌కి అది దారి తీసేదైనప్పుడు నేను స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్ ఎలా సాగించగలను, నన్ను నేను, నా మైండ్‌ని నేను అధిగమించకపోతే ఎలా జీవన్ముక్తి వైపు వెళ్లగలను అనే భావన వచ్చిన క్షణమే ఆరాటం, బానిసత్వం మాయమవుతుంది.
- మీరు ఖాళీగా ఉన్నారని వీడియోలు చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు.. దాన్ని వదిలిపెట్టబుద్ది కాదు. వదిలిపెట్టబుద్ధి కానిది ఏదైనా బానిసత్వమే! దానికి అడిక్షన్ అనీ ఇంకోటనీ ఏ పేరైనా తగిలించుకోండి.
- మీరు నిరంతరం నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీ నెగిటివ్ థాట్స్‌కి మీరు బానిస అయిపోయారు. మీ ప్రమేయం లేకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఓ ఊబిలోకి లాగేస్తోంది. కొన్ని కోట్ల సార్లు మీకు మీరుగా కాన్షియస్గా నెగిటివ్‌గా ఆలోచించి, చివరకు అది అన్ కాన్షియస్ యాక్టివిటీ అయ్యేలా చేసుకున్నారు. ఆ బానిసత్వాన్ని వదిలించుకోవడానికి మెడిటేషన్ లాంటివి కొన్నేళ్ల పాటు చేయాలి.
- “ఈ పని నీ వల్ల ఏమవుతుంది, హాపీగా పడుకో” అని నీ ఇన్నర్ టాక్ నీకు చెబుతోంది. ఇక్కడ నీ ఇన్నర్ టాక్‌కి నువ్వు బానిసవి.
- మీరు అద్దంలో అదే పనిగా చూసుకుంటున్నారు. దీనికి రెండు కారణాలు ఉండి ఉండొచ్చు. మిమ్మల్ని మీరు వృత్తిపరంగా బాగా ప్రజెంట్ చేసుకోవడం ఒకటైతే, మరొకటి మీ శరీరం మీద మీకు వ్యామోహం కావచ్చు. ఏ వ్యామోహమైనా బానిసత్వమే! బానిసత్వం కొన్నాళ్లు బాగుంటుంది, ఆ తర్వాత పెయిన్‌కి గురి చేస్తుంది.
ఇలా పరిశీలించుకుంటూ పోతే మన ప్రతీ చర్యలోనూ, ప్రతీ ఆలోచనలోనూ బానిసత్వం ఉంటుంది. నిశితంగా గమనించి, దాన్ని వదిలించుకుంటూ వెళితేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. అప్పుడు మీ శరీరంలోని పై భాగంలో ఉండే ఎనర్జీ సెంటర్స్ (చక్రాస్) అయిన అన్ కండిషనల్ లవ్, థ్రోట్ చక్ర ద్వారా మీ మనస్సులో ఉన్నది ఏదైనా ఎలాంటి బానిసత్వం లేకుండా వ్యక్తపరిచే దృక్పధం, ఆజ్ఞా చక్ర ద్వారా intuition, సహస్రార చక్ర ద్వారా తోటి మానవులు, ప్రకృతి పట్ల వాళ్లు వేరు, ఇది వేరు అది వేరు అనే భావన తొలగిపోయి సపరేషన్ సమసిపోయి ఏకత్వం సిద్ధించే స్థితీ వస్తాయి.
- Sridhar Nallamothu