ఏమైంది లైఫ్‌కి? ఎందుకు ఇక్కడే ఆగిపోయింది.. మనం ఇంతకన్నా డిఫరెంట్‌గా, ఆనందంగా, గొప్పగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఏ క్షణమైనా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకున్నామా?
కష్టపడ్డాం, చాలా సాధించాం, జీవితంలో చాలా తెలుసుకున్నాం… ఇంకా లైఫ్ ఏమాత్రం కొత్తగా అన్పించట్లేదు.. ఇంతకన్నా ఏముంది లైఫ్ అన్పిస్తోంది.. అవును కదా.. అసలు సమస్యేమిటి?
బ్రెయిన్ లాక్ అయిపోవడం మన జీవితాల్ని రొటీన్ చేస్తున్న అతి పెద్ద సమస్య. “మనం ఇలాగే ఆలోచించాలి, ఇలాగే బిహేవ్ చేయాలి.. మనం ఓ హోదాలో ఉన్నాం, లేదా మనం చాలా బిజీ అయిన మనుషులం” ఇలా ఎవరికివాళ్లం గిరిగీసుకుని లైఫ్‌ని నాశనం చేసుకుంటున్న వైనం.
ఐదారేళ్ల క్రితం నేను పెద్దగా మనుషులు తిరగని రోడ్ మీద షటిల్ ఆడుతుంటే.. మా ఫ్లాట్స్‌లో ఉంటున్న ఇతర మిత్రులు విచిత్రంగా చూసేవాళ్లు… చిన్నపిల్లల్లా ఈ ఆటలేంటి అన్నట్లు… నేను కలిసి ఆడదాం అని అడిగినా సున్నితంగా తిరస్కరించే వాళ్లు 🙂 చిన్నపిల్లలతో సరదాగా ఆడుతున్నా ఇలాగే భావించే వాళ్లు.
అలాగే వారానికి రెండు సినిమాలు చూస్తుండడం గమనించి.. చాలామంది ఫేస్బుక్ మిత్రులు ఈయనేం ప్రొఫెషనల్.. అనుకోవడమూ నాకు తెలుసు, వాళ్లు బయటపడకపోయినా!
నేను ఎప్పుడూ చెప్పేదే అయినా మళ్లీ చెప్తాను.. ఉన్నది ఒక్కటే లైఫ్. దీన్ని ఎంత ఆస్వాదించాలో, ఎంత వెరైటీగా బ్రతకాలో మన చేతిలో ఉంది. మూతి బిగదీసుకుని, గంభీరంగా కూర్చుని.. కళ్లజోడు క్రిందకు వచ్చి… స్కానింగ్ చూపులు చూస్తూ మనుషుల్ని ఎస్టిమేట్ చేస్తూ.. ఆచితూచి మాట్లాడుతూ… దర్జా ఒలకబోస్తూ… లోపల అందరితో కలవలేకపోతున్నామనే వెలితిని అలాగే కప్పెట్టుకుంటూ బ్రతకడమే జీవితం అయితే అది మన ఖర్మ.
జీవితం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి.. ఇతరులకు హాని చెయ్యనంత వరకూ మనకు నచ్చినట్లు జీవించాలి. నేనూ మా సిస్టర్ గతంలో మా N9 ఛానెల్ కోసం హైదరాబాద్ నైట్ లైఫ్‌ని షూట్ చెయ్యడానికి కార్లో అర్థరాత్రి తిరిగాం. నగరం రాత్రిళ్లు ఎలా ఉంటుందో అణువణువూ పరిశీలిస్తూ తిరుగుతుంటే జీవితం కొత్తగా కన్పించింది. ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. అసలు లైఫ్‌కి ఎలాంటి ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామింగ్ ఉండకూడదు.
“నేను ఫలానా అంత గొప్ప మనిషిని కాబట్టి.. నేను ఫలానా హోదాలో ఉన్నాను కాబట్టి ఇలాగే బ్రతకడం కరెక్ట్” అని జడ్జ్మెంట్లు చేసుకోవడం మూర్ఖత్వం. అసలు ఎవరు మీ లైఫ్‌ని కంట్రోల్ చేసేదీ, కామెంట్ చెయ్యగలిగిందీ, మీ ఆనందాన్ని కాదనేవాళ్లు? ఈ లైఫ్‌లో కాకపోతే ఎప్పుడు లైఫ్‌ని కొత్తగా చూస్తారు?
జీవితం తెలుసుకోవడం అంటే.. కష్టపడి చదివి, మంచి జాబ్ సంపాదించి, పెళ్లి చేసుకుని, నాలుగు తరాలకు సరిపడా సంపాదించీ చనిపోవడం మాత్రమే కాదు.. ఈ జీవితంలో మనకు తెలీనీ, మనం చూడనివీ, ఆస్వాదించవలసినవీ చాలానే ఉన్నాయి.
అలా రోడ్ మీద తీరిగ్గా నడుచుకుంటూ.. మనుషుల వేగాన్ని మన నెమ్మదితనంతో చూడడమే తీసుకుంటే.. అసలు ఈ చిన్న ఎక్స్‌పీరియెన్స్‌లో ఉన్న కొత్తదనం ఎంతమందికి తెలుసు? యెస్.. చాలాసార్లు నేను ఇది చేస్తాను. ఇలాంటివి చాలా! అలా మొక్కల ముందు నిలబడి వాటి కదలికల్ని, వాటిలోని జీవాన్నీ గమనిస్తూ వాటితో మనస్సుతో కమ్యూనికేట్ చెయ్యడం.. ఆలోచించాలే గానీ జీవితం కొత్తగా కన్పించడానికి ఎన్ని లేవు?
లైఫ్ బోర్‌గా తయారైందని బాధపడడం కాదు, ఏదోలా రోజుని ముగించేయడం కాదు.. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలి, మన ఆలోచనలు విభిన్నంగా సాగాలి, ముఖ్యంగా ప్రపంచాన్ని మనం చూసే, విశ్లేషించే మైండ్‌సెట్ మారాలి. అప్పుడు లైఫ్ అద్భుతంగా ఉంటుంది.
– నల్లమోతు శ్రీధర్
శ్రీధర్ గారు చాలా బాగా చెప్పారు లైఫ్ గురించి .
జన్మదిన శుభాకాంక్షలు.
Supar