న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ।। 11 ।।
దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును.
వివరణ: “ఒక పని చెయ్యడం వల్లనే నాకు పాప పుణ్యాలు అంటుకుంటాయి కాబట్టి అసలు ఏ పనీ చెయ్యకుండా ఉంటాను” అనే భావనతో కొంతమంది ఉంటారు. ఇక్కడ దేహము అనేది మన సోల్‌ని (అత్మ) అకామిడేట్ చెయ్యడానికి, సోల్‌కి ఓ భౌతిక ఉనికిని ఇవ్వడానికి ఉపయోగపడే ఓ సాధనం మాత్రమే. కాబట్టి మనం చేసే పనులను మన దేహం చెయ్యట్లేదు, మన సోల్ చేత ప్రేరేపించబడి మనస్సు (మైండ్) అనే మాయ చేత రకరకాల దృక్కోణాలు (perceptions) జత అయి, వాటికి భావోద్వేగాలు కలగలిసి “మన దేహం చేసే, చేసిన ఒక పనిగా అది బయట ప్రపంచంలోకి వ్యక్తమవుతూ ఉంటుంది.
ఒక కర్మ ఎలా చెయ్యబడుతుందో చాలా సూక్ష్మ స్థాయిలో చూద్దాం. ఇది కపిల మహర్షి చేత సాంఖ్య దర్శనంలో ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే “మా సైన్స్ గొప్ప, మా సైన్స్ గొప్ప” అని వెస్ట్రర్న్ ఆలోచనా దృక్పధాన్ని అనుసరిస్తుంటాం గానీ ఇప్పుడు పాశ్చాత్య సమాజం శాస్త్రీయంగా ఆలోచిస్తున్న అనేక విధానాలు అప్పట్లో భారతీయ ఆధ్యాత్మిక, తత్వ జ్ఞానంలో పేర్కొనబడి ఉన్నాయి. ఉదా.కి.. సైన్స్ కేవలం కళ్లకు కనిపించే ఎరుపు, తెలుపు, మనిషి, పక్షి వంటి భౌతిక రూపాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు ఆ భౌతిక రూపాల పట్ల ఒక మనిషి యొక్క ఇంటర్‌ప్రెటేషన్, జడ్జ్మెంట్ అనే కొత్త కోణాలని ఒక వస్తువుగా చూడకపోతే ఎలా? సరిగ్గా అదే కపిల మహర్షి సాంఖ్య శాస్త్రంలో ఉంది. జ్ఞానేంద్రియాలతో పాటు, మనస్సు, తెలివితేటలు, అహంకారం, నైతికత అనే ఇతర అంశాల ఆధారంగా మనం చూసే వస్తువులు, వాటి గుణాలు మారిపోతాయని, ఆయా గుణాల ఆధారంగా భిన్నమైన ఔట్పుట్ వచ్చినప్పుడు దాన్నీ లెక్కలోకి తీసుకోవాలని, కేవలం తెలుపు, నలుపు, మనిషి, సెల్‌ఫోన్ వంటి భౌతిక రూపాలతో సరిపెట్టుకోవడం ఓ అసమగ్ర దృష్టి అని సాంఖ్య శాస్త్రంలోని సూక్ష్మాలను శ్రద్ధతో చదివితే అర్థమవుతుంది.
సాంఖ్య శాస్త్రం ప్రకారం మనం చేసే ప్రతీ పనీ వివిధ దశల్లో సాగుతుంది. మొదట మన జ్ఞానేంద్రియాలు బయటి నుండి సమాచారాన్ని గుర్తిస్తాయి. అంటే కళ్లు రంగులను, మనుషులను, వస్తువులను గుర్తిస్తే, చెవులు శబ్ధాలను, చర్మం స్పర్శని.. ఇలా ప్రతీ జ్ఞానేంద్రియం బయట జరిగే సమాచారాన్ని సేకరిస్తుంది. రెండవ దశలో అలా సేకరించబడిన సమాచారాన్ని బ్రెయిన్లో రంగులు, మనుషులు, వాసనలకు సంబంధించిన వివిధ లోబ్స్‌లో ఉండే ప్రత్యేకమైన న్యూరాన్లను బట్టి ఇది ఎరుపు రంగు, ఇతను శ్రీధర్ అనే మనిషి, ఇతను స్నేహితుడు, ఇతను శత్రువు ఇలా మన మైండ్ ఆ విషయాలను అర్థం చేసుకుంటుంది.
ఇప్పుడు మూడవ దశలో “ఇంటెలిజెన్స్” (తెలివితేటలు)కు ఆ సమాచారం బదిలీ చెయ్యబడుతుంది. మనం చదివిన విషయాలు, చూసిన విషయాలు, మన ఆలోచనలతో పెంచుకున్న మేధస్సు, అంచనాలను బట్టి “ఫలానా ఎరుపు రంగులో డ్రెస్ ధరిస్తే ఎద్దులు, ఆవులు బెదిరిపోయి వెంటబడతాయి”, “ఫలానా వ్యక్తి గత ప్రవర్తనని బట్టి కాస్త దూరంగా ఉంటే మంచిది” అనే జడ్జ్మెంట్స్ ఏర్పడతాయి.
ఇప్పుడు నాలుగవ దశలో “ఇగో” (అహం) వద్దకు పై మూడు చోట్ల ప్రాసెస్ చెయ్యబడిన సమాచారం వస్తుంది. కళ్లతో చూసిన రంగూ, అది ఎరుపు రంగు అని మైండ్‌తో వేసిన లేబుల్, ఎరుపు రంగు ప్రమాదకరం అనే “తెలివితేటల”తో మనం ఇచ్చుకున్న జడ్జ్మెంట్.. ఈ మూడూ అయ్యాక.. “సరే ఎరుపు రంగు ప్రమాదకరమే, మరి అది “నాకు” (ఇగో)కి ఏ విధంగా హానికరం, మేలుకరం అనే వద్దకు సమాచారం వస్తుంది.
“ఒక మనిషి భౌతిక, మానసిక ప్రపంచానికి ఏమాత్రం హాని కలగకుండా ఇగో కాపాడుతూ ఉంటుంది” కాబట్టి.. ఈ క్రింది విధాలైన ఆలోచనలను అది వెంటనే మైండ్‌లో చేస్తుంది.
నేను ఎరుపు రంగు షర్ట్ వేసుకుంటే నేను కలిసిన వాళ్లందరిలో నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చి నాకు దూరం కావచ్చు, సో వెంటనే షర్ట్ మార్చుకో..
నేను రెడ్ షర్ట్ వేసుకుని బయటకు వెళితే జంతువులు ఇరిటేట్ కావచ్చు, ఆవులు, గేదెల లాంటివి రోడ్ మీద వెళుతుంటే భయపడి నా బండి మీదకు దాడి చేయొచ్చు…
ఇలా ఈ నాలుగవ దశలో ప్రతీ విషయమూ తనకి ఎలా మేలు, ఎలా చెడు చేస్తుంది, ఇది చేస్తే నాకేమొస్తుంది, అది చెయ్యకపోతే ఏర్పడే నష్టమేమిటి వంటి విశ్లేషణలు సాగుతాయి.
అన్నింటికన్నా చివరిది, ఐదవది, “నైతికత (మోరల్)”. “మనిషి సంఘజీవి” అని 322 BC వరకూ జీవించిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ కొటేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటాం గానీ “సంఘ జీవనంలో అనుసరించాల్సిన మోరల్ (నైతికత) ప్రస్తావన కపిల మహర్షి సమయంలోనే సాంఖ్య శాస్త్రంలో ప్రస్తావించబడింది అన్నది మనకు తెలీదు. అంటే మనం పాశ్చాత్య సంస్కృతిచే ఎంతగా కండిషన్ చెయ్యబడ్డాం అన్నది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
సరే ఐదవది అయిన మోరల్ విషయానికి వస్తే.. “ఈ భావన నైతికంగా సరైనదేనా, కాదా” అన్నది ఈ స్థాయిలో నిర్ణయించబడుతుంది. ఇతను ఓ మనిషి ఆకారాన్ని కళ్లు చూస్తే, “ఇతను నల్లమోతు శ్రీధర్లా ఉన్నాడే” అని మీ మైండ్ గుర్తిస్తే, “ఇతను మంచి వాడా చెడ్డ వాడా” అన్నది మీ తెలివితేటలు గుర్తిస్తే.. చివరిగా మీ మోరల్ ఏం చెబుతుందంటే.. “అందర్నీ ప్రేమించు, ఎవర్నీ ద్వేషించవద్దు, వెళ్లి అతన్ని మంచిగా పలకరించు” అని మోరల్ చెబుతుంది.
పైదంతా చదివాక మీకు అర్థమైంది కదా.. కృష్ణ భగవానుడు చెప్పిన కర్మలు ఎన్ని రూపాల్లో తమ రూపం మార్చుకుంటాయో! అన్ని ఆలోచనలు చేశాక మన ప్రవర్తన, మన చేతలు అనే వాటి ద్వారా మనం మన కర్మలు చేస్తుంటాం.
ఇక్కడ మెడిటేషన్ వంటి వాటి వల్ల భగవంతుడిని ఎలా చేరుకోవచ్చంటే.. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కళ్లు, చెవులు వంటి సెన్సరీ ఆర్గాన్ల సేకరించబడిన సమాచారాన్ని పైన ప్రాసెస్‌లో రెండవదైన మైండ్ పట్టించుకోకుండా చేసినప్పుడు, బయట ఎన్విరాన్మెంట్ నుండి మొదట పొల్యూషన్ తగ్గుతుంది. ఆ తర్వాత మిగిలి ఉండేది రెండవదైన మైండ్. అది సబ్ కాన్షియస్ మరియు కాన్షియస్ మైండ్ ద్వారా దానంతట అదే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మెడిటేషన్లో ఆ మైండ్ చేసే ఆలోచనలు పట్టించుకోవడం మానేస్తే కొంత అభ్యాసం తర్వాత ఆలోచనా రహిత (చాలా తక్కువ ఆలోచనలు వచ్చే స్థితి) ఏర్పడుతుంది. ఆ వచ్చే తక్కువ ఆలోచనలను కూడా మూడవదైన ఇంటెలిజెన్స్ ద్వారా జడ్జ్ చెయ్యకుండా సాక్షీ భూతంగా వాటిని విట్నెస్ చేస్తూ పోతే.. ఇగో (అహం) తనకు ఆ సమాచారాన్ని, జడ్జ్మెంట్లని అప్లై చేసుకుని రెసిస్టెన్స్ పెంచుకోవడం, తనని తాను కాపాడుకోవాలనే ప్రయత్నమూ తగ్గుతాయి. ఇక మొదట నాలుగు దశల నుండి రకరకాలుగా వడగట్టబడి సమాచారం తగ్గిపోతే ఇంకా ఐదవదైన మోరాలిటీ గురించి ఆలోచించడానికి ఏముంటుంది? – ఇవన్నీ తొలగిపోయాక మైండ్ చేసే మాయ తొలగిపోయి నేరుగా సోల్ మాత్రమే వైబ్రేట్ అవుతూ విశ్వ శక్తితో (భగవంతుడు) అనుసంధానం అవుతుంది.
కాబట్టి పై శ్లోకంలో చెప్పినట్లు దేహం కలిగి ఉన్న తర్వాత ఏ కర్మనూ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు.. కళ్లు చూస్తూనే ఉంటాయి, మనస్సు, ఇంటెలిజెన్స్ ఆలోచిస్తూనే, జడ్జ్మెంట్స్ చేస్తూనే ఉంటాయి. అవన్నీ కలిసి మన perception (దృష్టి కోణం) అనే ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి. ఇక్కడ ఓ అద్భుతమైన సత్యం చెబుతాను. “కర్మ ఫలములను త్యజించిన వాడే త్యాగి” అంటే చేసిన పనుల ఫలితాలపై ఆసక్తి లేని వాడు మాత్రమే కాదు.. పైకి కన్పించని ఇంతకుముందు చెప్పిన కర్మేంద్రియాల ద్వారా ఉత్పన్నమైన ఆలోచనలను మెడిటేషన్ వంటి ప్రాక్టీసెస్ ద్వారా త్యాగం చేసే వాడు, తన perception అనేదే ఏర్పడకుండా త్యాగం చేసే వాడు కూడా త్యాగి క్రిందే లెక్క. ఇది అర్థం చేసుకుంటే మన జీవితాలు ఆధ్యాత్మికంగా ఎదుగుతాయి.
చేతిలోకి కత్తి తీసుకుని ఒక మనిషిని చంపడం అనేది భౌతిక కర్మ అయితే, ఓ మనిషిని మనస్సులో ద్వేషించి, అతని పతనాన్ని కోరుకోవడం మానసిక కర్మ అవుతుంది. కృష్ణ భగవానుడు చెప్పిన కర్మలను భౌతికంగా కళ్లకు కనిపించేవి మాత్రమే కాదు, జ్ఞానేంద్రియాల ద్వారా పైన చెప్పిన వివిధ స్టేజెస్‌లో జరపబడే మానసిక కర్మలను కూడా త్యజించాలి. “నేను పైకి నవ్వుతూనే ఉన్నాను కదా, లోపల నేనెలా ఉంటే నష్టమేంటి” అని మీకు అన్పించవచ్చు. మనస్సులో చేసేదీ ఓ కర్మే, ఓ వైబ్రేషనే. అది మొత్తం ఐదు దశలూ దాటుకుని బయటకు కర్మేంద్రియమైన నోటి ద్వారా మాటల రూపంలో రాలేదు మాత్రమే. కానీ మనస్సులో దాని ప్రాసెస్‌ని ఆల్రెడీ చేసేశారు. మరి అలాంటప్పుడు దాని ఫలితం రాకుండా ఎలా ఉంటుంది? అది క్వాంటమ్ ఫీల్డ్‌లోకి వెదజల్లబడుతూనే ఉంటుంది. దానికి సరిసమానమైన ద్వేషం అనే మరో ఫలితాన్ని మీ చెంతకు టైమ్, స్పేస్ అనే లిమిటేషన్స్ని దాటుకుని తీసుకు వస్తుంది.
- Sridhar Nallamothu