కొన్ని అనుభవాలూ.. కొన్ని రిలేషన్లూ.. కొన్ని పాటలూ, కొన్ని సినిమాలూ.. వయస్సుతో పాటూ, అప్పటి మానసిక స్థితితో పాటూ ముడిపడి ఉంటాయి..
చిన్నప్పుడు కాకా హోటల్లో విస్తరాకు వాసనని ఆస్వాదిస్తూ ఇష్టంగా తిన్న ఇడ్లీ సరిగ్గా అదే అనుభూతిని ఎప్పటికీ మిగల్చలేదేమో… మళ్లీ అదే కాకా హోటల్లో ఓ పదేళ్ల తర్వాత తింటే పాత జ్ఞాపకాలు అలమార్లోంచి తోసుకు వస్తాయేమో గానీ అప్పటి అనుభూతి మాత్రం రానే రాదు..
—————
అలాగే బంధువుల్లో మనల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్న వాళ్లో, ప్రాణ స్నేహితులో ఏళ్ల తర్వాత కన్పించినా అనుభూతులు ఆవిరైపోయి ఉంటాయి… ఏదో కొత్తగా తోస్తారు.. అంత మనస్ఫూర్తిగా కలిసిపోలేరు.. ఆలోచనల్లోనూ, జీవనశైలిలోనూ, కాలంతోనూ వచ్చిన మార్పులూ, అన్నింటికంటే ముఖ్యంగా బ్రెయిన్లో ఏ మారుమూలలకో archive చెయ్యబడిన ఆ పాత జ్ఞాపకాలూ సాంద్రతను కోల్పోయి చాలా పేలవంగా ఉంటాయి.
అందుకే మన పాత మిత్రులు కలిసినా, మన చిన్నప్పటి ఊళ్లూ, ప్రదేశాలూ తిరిగినా… సంతోషం కట్టలు తెచ్చుకోవాలన్పిస్తుంది…. కానీ ఏదో కోల్పోయిన ఫీలింగ్..
“ఇదంతా ఒకప్పుడు నా ప్రపంచం” అని అన్పిస్తూనే ఉంటుంది…. కానీ ఆ ప్రపంచంలో మనల్ని మనం పోగొట్టుకున్న బేలతనం ఆవరిస్తుంది.
———————–
సినిమాలూ, పాటలూ అంతే… కొన్ని వయస్సుతో పాటూ, కొన్ని అమాయకత్వంతో పాటు, మరికొన్ని అవగాహనతో పాటు ముడిపడి ఉంటాయి.
ప్రేమపావురాలు సినిమాతో ఉర్రూతలూగిన జనాభాని చూసి ఇప్పటి తరం విచిత్రంగా చూస్తారు… ఇప్పటి “గుండెజారి గల్లంతయ్యిందే..”తో మైమరిచిపోయిన జనాభాని చూసి.. ఇప్పుడు నిక్కర్లు వేసుకుని తర్వాత ఎదగబోతున్న తరం నవ్వుకుంటారు.
వయస్సూ, ప్రేమా ఒక్కటే ప్రధానం రెండుచోట్లా…. సినిమాలూ, హీరోలూ, హీరోయిన్లూ… అప్పటి జనాభాకి విపరీతంగా నచ్చేస్తారు… తర్వాత పాతబడిపోతారు.
—————–
ఏదో ఒక వయస్సులో, మానసిక స్థితిలో మన అనుభవంలోకి వచ్చి జ్ఞాపకంగా మిగిలిపోనున్న ప్రతీ అనుభూతికీ ఒడిచిపట్టుకోలేకా.. కోల్పోనూలేక నిస్తేజంగా ముందుకు సాగిపోయే సాధారణ మనుషులం… అలాగే మన అనుభూతుల్ని మిగతా ప్రపంచపు అనుభూతులతో పోల్చుకుంటూ, మన ఇష్టాఇష్టాలతో వారి ఇష్టాఇష్టాలు సరిపోలడం లేదని మొహం చిన్నబుచ్చుకునే అమాయకత్వం!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply