Life is matter of Motivation…
స్ఫూర్తి పొందడానికి ఏమీ మిగలనప్పుడు జీవితం చాలా చప్పగానే సాగుతుంది…
సాధించిన వాళ్లనంతా వెధవాయిలుగానే, సాధిస్తున్న వాళ్లనంతా చేతకాని వాళ్లుగానే జమకట్టేసి.. వెకిలి నవ్వులు నవ్వుకునేటంత కాలం జీవితం అస్సలు గర్వంగా అన్పించదు…
బద్ధకంతో చేతులెత్తేసి.. చేసేవాళ్లని ఎగతాళి చేయడం ఎస్కేపిజమ్ యొక్క కామన్ నేచర్. మనకు ఏ పనీ చేయబుద్ధి కాదు.. ఏం సాధించబుద్ధీ కాదు… "ఫలానా వాళ్లు ఫలానా సాధించారని" ప్రస్తావన వస్తే చాలు.. "వాళ్లకు పనీపాటా లేక కష్టపడిపోతున్నారు… ఎంజాయ్ చేయడానికి రాసిపెట్టి ఉండాలి కదా" అని అస్సలు సిగ్గు కూడా పడని ఎస్కేపిస్టిక్ సమర్థనలు..!!
చుట్టూ మనుషుల జీవితాల్ని చూడాలి.. జీవనశైలిని చూడాలి.. ఏం సాధిస్తున్నారో, ఎలా పనిచేస్తున్నారో చూడాలి… మంచిని ఉన్నదున్నట్లు మైండ్లోకి తీసుకోవాలి.
"నేను చచ్చినా కష్టపడను" అని మొండికేసుకుని కూర్చుంటే…?
ఎవరని, ఎంత కాలమని ఈ నేచర్ని సమర్థిస్తారు?
కష్టపడకపోతే మన మనస్సే మనకు ఎదురు తిరుగుతుంది… లోపల్లోపల ఏమీ చెయ్యలేకపోతున్న లోటుని పెంచేసుకుంటూ పోతూ!!
"వాడిదేముంది…" అని చులకన చేసి మాట్లాడడం క్షణం పని…. మనం అలా అనుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తి గొప్పదనం తగ్గిపోదు… పైపెచ్చు మన ఈర్ష్య ప్రస్ఫుటంగా కన్పించేస్తుంది.
మనుషుల్ని ఒప్పుకోవాలి.. స్ఫూర్తి పొందాలి… వారికన్నా మెరుగ్గా ఎదగడానికి ప్రయత్నించాలి… ఎదిగాక వారిని తమ గురువులుగా గౌరవించే సంస్కారం ఉండాలి!! ఇంత విశాల దృక్పధం మనకున్నప్పుడే మనకు ఎదుగుదల దక్కుతుంది. ఎదిగే క్రమం గురించి గౌరవం లేని వ్యక్తికి ఎదుగుదల ఎలా సాధ్యపడుతుంది? కష్టపడి పైకొచ్చే పక్కోడి ఎదుగుదలను చిన్నచూపు చూస్తే ఎదగడంలో ఉన్న రహస్యం అర్థమవుతుందా?
"ఫలానా మనిషి" గురించి వంద తిట్లు తిట్టడానికి వచ్చే నోరు ఒక్క మాట గౌరవంగా మాట్లాడడానికి రాదెందుకు?
ఎంత ఎక్కువ సొసైటీలో కుళ్లుని చూస్తామో… మనుషుల్ని చిన్నచూపు చూస్తామో.. అంతకంత దిగజారిపోవడం అనివార్యం.
మనిషిలో మంచిని చూడగలిగిన రోజున మనుషులపై గౌరవం పెరుగుతుంది… అదే మనుషుల నుండి స్ఫూర్తి ఒలింపిక్ జ్యోతిలా చేతికందుతుంది.. దాన్ని పుచ్చుకుని మనమూ గర్వంగా, విజయవంతంగా పరుగు మొదలెట్టొచ్చు!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply