ఓ 19 ఏళ్ల కుర్రాడు ఫేస్‌బుక్‌కి addict అయ్యాడు… పేరెంట్స్‌కి పెద్దగా చదువు లేకపోయినా కొడుకులో వస్తున్న మార్పు అర్థమవుతూ నెట్ కనెక్షన్ తీసేయించారు.. పేరెంట్స్‌పై తిరగబడ్డాడు… గొడవైంది… లాభం లేదని ఇరుగు పొరుగు సలహాతో సైక్రియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు.. కత్తి చూపించి ఆయన్నీ బెదిరించాడు… ఏం చెయ్యాలో అర్థం కాలా….
చివరకు బాత్రూమ్ అందుబాటులో ఉన్న ఓ గోడౌన్ లాంటి క్లోజ్డ్ రూమ్‌లో టైమ్‌కి ఫుడ్ అందజేస్తూ నిర్బంధించారు… తలుపులు బాదేవాడు… చివరకు 15 రోజులకు అంతా నార్మల్‌కి వచ్చాడు….
ఇది కధా కాదు.. అలాగే ఎక్కడో విదేశాల్లో జరిగిన విషయమూ కాదు… నిన్న నేను సెమినార్‌కి వెళ్లొచ్చిన కల్వకుర్తిలో నా దృష్టికి వచ్చిన విషయం…!!
మనం దేనికీ అడిక్ట్ అయిపోం అని గర్వంగా చెప్పుకుంటూనే తెలీకుండానే ఫేస్బుక్ తెరవనిదే తోచుబాటు కాకుండా పోతున్నాం..
ఏం మాట్లాడాలి, ఏది బుర్రలోకి తీసుకోవాలి, దేని గురించి ఆలోచించాలి, ఏం రాయాలి… అన్నది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చేస్తేనే ఫేస్బుక్ కావచ్చు.. పబ్లిక్ platform ఏదైనా కావచ్చు బెటర్‌గా వాడినట్లవుతుంది.
ఎవరేంటో తెలీకపోవడం వల్ల మూర్ఖత్వంతో మాట్లాడే మాటలకూ, విషయాలకూ వివేకం ఉన్నవారు సమయం వృధా చేస్తున్నారు.. అలాగే వివేకం ఉన్న వారినీ మూర్ఖత్వం నరనరానా ఇంకించుకున్న వారు అవహేళన చేస్తున్నారు.
నిజమైన పెద్ద ప్రపంచంలో గొప్పవాళ్లుగా పేరున్న వాళ్లూ ఈ వర్చ్యువల్ చిన్న ప్రపంచంలో పదిమంది చేతా ప్రశంసించబడడానికి ఉవ్విళూరుతున్నారు… అస్సలు తమకంటూ ఉనికే లేనివాళ్లూ ఈ వర్చ్యువల్ ప్రపంచంలో నలుగుర్ని పూసుకు తిరుగుతూ గొప్పని సంతరించుకోవడానికి ప్రయాసా పడుతున్నారు. చివరకు ఇదంతా ఓ మాయాప్రపంచం అయిపోయింది.
ఈ మాయా ప్రపంచంలో మనకు తెలీకుండానే మనం మానసిక రోగులం అయిపోతున్నాం…
ఫేస్బుక్లో mutual friends ఎవరున్నారో మొదలుకుని.. మన స్వంతం అనుకున్న వాళ్లు ఎవరెవరికి likes కొడుతున్నారు.. ఎవర్ని friendsగా చేసుకుంటున్నారు.. వంటివన్నీ గమనిస్తూ.. లేనిపోని అనుమానాలూ, అపోహలూ పెంచుకుంటూ నిజమైన రిలేషన్లని చెడగొట్టుకుంటున్న కేసులు ఎన్నో నాకు తెలుసు.
అలాగే ముక్కూ మొహం లేని కొత్త పరిచయాలు చేసేసుకుని.. వాళ్లే ప్రపంచంగా ఓ పదిరోజులు గడిపేసి… కొత్తదనం పోయేసి… 11వ రోజు నుండి మరో కొత్త స్నేహం చేసే వాళ్లూ కోకొల్లలు….
అందరికీ కావలసింది ఆనందమే…
కొందరికి మాట్లాడడంలో, కబుర్లు చెప్పుకోవడంలో ఆనందం…
కొందరికి అందం చూపించుకోవడంలో ఆనందం…
కొందరికి likes, commentsతో మందిని పోగేసుకోవడంలో ఆనందం…. (వాటంతట అవి వస్తే నో ఇష్యూ.. వాటి కోసమే బ్రతికే జనాభాని చూస్తేనే జాలేస్తుంది)
కొందరికి రాజకీయాలూ, కులాలూ, మతాలూ, ప్రాంతాలూ, సినిమాల వారీగా విడిపోయి ఒకర్నొకరు కసిదీరా తిట్టుకోవడంలో ఆనందం…
ఇలా ఏదో ఒక దానికి అడిక్ట్ అయిపోయి మరీ ఆనందాన్ని వెదుక్కోవలసిన వెలితి మనస్సుల్లో ఎందుకు ఏర్పడుతోంది? ఈ మానసిక రుగ్మతను గుర్తించకపోతే మనం చేయాల్సిన పనులేమైపోతాయి? మనం జీవించాల్సిన జీవితాలు ఏమవ్వాలి? మనం బాధ్యతలు తీర్చుకోవాల్సిన కుటుంబ సభ్యులేమవ్వాలి?
పనుల్లో ఆనందం లేదా?
జీవితంలో ఆనందం లేదా?
నిజ జీవితపు రిలేషన్స్‌లో ఆనందం లేదా?
ఒక్కటి మాత్రం నిజం… మనందరి జీవితం అయిపోతోంది…. ఓ మానసిక రోగిని స్థంబానికి కట్టేస్తారు చూశారా… అలా మనకు మనం కంప్యూటర్‌కి కట్టేసుకుని బ్రతికేస్తున్నాం ఉన్న కొద్ది జీవితాన్నీ! కట్లు విప్పదీసుకుంటే నిజమైన జీవితం కన్పిస్తుంది.. లేదా భ్రాంతులే మిగులుతాయి.
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు. ఇకపోతే ఇదంతా రాయడానికి నాకు 100% అర్హత ఉంది… నేను అన్నింటికీ ఎంత detachedగా ఉంటానో నా మనస్సుకి తెలుసు… నన్ను గమనించిన వాళ్లకు తెలుసు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply