ఫ్యామిలీ మెంబర్ కావచ్చు.. ఫ్రెండ్ కావచ్చు… ప్రేమించిన వాళ్లు కావచ్చు.. కళ్లల్లోకి తమ ప్రాణాల్ని ప్రవహింపజేస్తూ చూసే కొన్ని చూపులు జీవితాంతం గుర్తుండిపోతాయి..
ఆనందంతోనో, బాధతోనో మనస్సు మూగబోతే లయబద్ధపు కనురెప్పల కదలికలతో కళ్లు మాట్లాడుకునే సందర్భాలు కోకొల్లలు.
ఇంటర్నెట్లో డేటా కమ్యూనికేషన్‌కి TCP/IP, UDP వంటి వేర్వేరు ప్రొటోకాల్స్ ఉన్నట్లు కళ్లకూ ఓ కమ్యూనికేషన్ ప్రొటోకాల్ ఉంటుందనుకుంటా..
కళ్లు ద్వేషాన్ని చిమ్ముతాయి.. ప్రేమని కురిపిస్తాయి.. తిరస్కారం పలికిస్తాయి.. సంస్కారం ప్రదర్శిస్తాయి.. దేహాన్ని దేములాడతాయి.. కాలి మునిగోళ్ల వద్దే అపరాధభావంతో ఆగిపోతాయి..
కావలసిన వ్యక్తుల నుండి కావలసిన భావాన్ని కళ్లల్లో వెదుక్కుంటూ మనస్సుని పురివిప్పుకునే ఆనంద జీవులెందరో.. కావలసిన భావం కన్పించనప్పుడు మనస్సుని చిన్నబుచ్చుకునే అభాగ్యులెందరో!
ఇరువురు మనస్సుల లోపలా ఒకే విధమైన భావాలూ లేకపోతే.. ప్రపంచంలోని ఏ రెండు కళ్లూ అరక్షణం కూడా తిన్నగా చూసుకోలేవు.
లోపల జుగుప్సాకరమైన ఆలోచనలు ఒకరికుంటే.. మరొకరికి సంస్కారవంతమైన ఆలోచనలు ఉంటే కొన్ని క్షణాల్లోపే ఏదో ఒక కన్ను వాలిపోతుంది.. లేదా దృష్టి మళ్లించబడుతుంది.. లోపల అపరాధ భావాన్నో, ఛీత్కార భావాన్నో మిగుల్చుతుంది.
చివరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లలో చెప్పే "ఎదుటి వ్యక్తి కళ్లల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడాలి" వంటి మాటలూ వీటికి మినహాయింపు కాదు. ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ సందర్భాల్లో ఆ ఇద్దరి కాన్ఫిడెన్స్ లెవల్ పోటాపోటీగా లేకపోతే కళ్లు సూటిగా చూసుకోలేవు.
కళ్లు వర్షిస్తాయి.. శూన్యమవుతాయి.. స్థబ్ధమవుతాయి.. కోపంతో ఎర్రటి జీరల్ని అలంకరించుకుంటాయి.. సంభ్రమాన్ని పలికిస్తాయి.. ఉబ్బితబ్బిబ్బయ్యేటప్పుడు టకాటకా ఆ చివరకూ ఈ చివరకూ కొట్టుమిట్టాడతాయి..
ఈ ప్రపంచంలో కంటి భాషకు మించిన అద్భుతమైన భాష మరేదీ అవసరం లేదు. కానీ మనుషుల కళ్లల్లోకి చూసి అర్థాలు పట్టుకోగలిగే తెలివిడితనమే మన మేధావితనానికి లేకుండా పోతోంది 🙁
ఈ మధ్య కళ్లకూ తెలివితేటలు నేర్పించేస్తున్నాం. స్వభావసిద్ధమైన కంటి కదలికల్నీ మెకానికల్‌గా మన అవసరాలకు ఉపయోగపడేలా నియంత్రించే నేర్పుని బానే సంతరించుకుంటున్నాం.
లోపల బాధ ఉన్నా కళ్లల్లో ఆనందం…
లోపల చెడ్డబుద్ధి ఉన్నా పైకి సంస్కారం…
లోపల కోపమున్నా కళ్లల్లో ఒద్దికని పలికించడం… ఎన్నెన్ని విద్యలని నేర్చుకుంటున్నామో 🙂
డాక్టర్లు పాడైపోయిన అవయువాలను మార్చేస్తుంటే.. మనకు చేతనైనంతలో మనం మన మనస్థత్వాల్ని పూర్తి విరుద్ధంగా మార్చుకుని ప్రకటించుకునే విద్యల్ని నేర్చేసుకుంటున్నాం.
డాక్టర్లచే రిపేర్ చేయబడ్డ ఆవయువం మనకు మరింత జీవితాన్ని ఇస్తుంది… కానీ మనకి మనం పాడుచేసుకుంటున్న సహజత్వం జీవితం పట్ల ఎవరూ పూడ్చలేని నిస్పృహనే మిగుల్చుతుంది.
ఎలా బ్రతకాలనుకుంటే అలాగే బ్రతుకుదాం.. మన స్వేచ్ఛని ఎవరూ ప్రశ్నించకూడదనుకునే మొండితనం కదా మనది.. మన ఖర్మకు ఎవరు బాధ్యులవుతారు… మనకి మనం తప్ప!!
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
excellent