ఇప్పుడు అందరూ కరోనా వైరస్ గురించి మళ్లీ విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి దానితో మొదలుపెడతాను. సెకండ్ వేవ్ వరకూ చుక్కలు చూపించిన కరోనా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఫళంగా ఎందుకు బలహీనపడింది? కేవలం గొంతు నొప్పిగా, ఒకటి రెండు రోజులు మాత్రమే ఇబ్బందిగా ఎందుకు మారిపోయింది? చాలామంది వ్యాక్సిన్స్ వల్ల అని భావిస్తుంటారు. వ్యాక్సిన్స్ గొప్పదనం మీదకు మన దృష్టి వెళితే పరిణామక్రమంలో ప్రకృతి లో జరిగిన అనేక మార్పుల గురించి మనం అర్థం చేసుకునే శక్తిని కోల్పోతాం.
ఈ విశ్వంలో ఏ జీవి అయినా ఉనికిని చాటుకోవడానికి పోరాటం చేస్తూనే ఉంటుంది. దానికోసం తన శారీరక నిర్మాణాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. మనుషులు లాంటి బుద్ధిజీవులు అయితే తమ ఆలోచననీ మార్చుకుంటూ ఉంటారు. ఆలోచనా విధానాన్ని మార్చుకోలేని వ్యక్తి కాలగర్భంలో ఎదగకుండా కలిసిపోతాడు. డైనోసార్ల సంగతి చెబుతాను!
180 మిలియన్ సంవత్సరాలపాటు భూమి మీద ఉన్న డైనోసార్లు, ఇప్పుడు చూడటానికి కూడా మిగలకుండా ఎందుకు అంతరించి పోయాయి అనేది అని చూస్తే, సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం నుండి భారీ పరిమాణం కలిగిన అస్టరాయిడ్ భూమిని తాకింది. దాని వలన, అలాగే అగ్ని పర్వతాలు విస్పోటనం చేయటం వలన ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. మొక్కలు మాడిమసైపోయాయి. కేవలం మొక్కలు తినడం ద్వారా తమ ప్రాణాల్ని కాపాడుకుంటున్న జీవులు ఆహారం దొరక్క అంతరించిపోయాయి. మీరు చైనా వెళ్లారనుకోండి, అక్కడ వెజిటేరియన్ దొరకకపోతే చచ్చినట్లు నాన్-వెజ్ తిని మీ ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు. లేదా మనిషికి చాలా ఛాయిస్‌లు ఉన్నాయి. కానీ ఇతర జీవులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోలేకపోతే అంతరించిపోతాయి.
డైనోసార్లు ఆకులు అలములను తినడంతో పాటు గుడ్లు, బల్లులు వంటివి తినేవి. ఆస్టరాయిడ్ వల్ల ఎన్నో చిన్న చిన్న జీవులు చనిపోవడంతో తినడానికి ఏమీ లేక, తమని తాము మార్చుకోలేక డైనోసార్లు అంతరించాయి. దీని గురించి భిన్నమైన చర్చలు, వాదనలు నడుస్తున్నాయి అనుకోండి.
సరిగ్గా కరోనా వైరస్ కూడా అలాంటిదే. మనిషి తాను కనుగొన్న వ్యాక్సిన్ వల్ల కరోనా నిలబడలేకపోతోంది అనుకుంటున్నాడు గానీ దీని వెనక లాజిక్ వేరు. విశ్వంలో ఏ జీవైనా ఎక్కువ కాలం పాటు ఉనికిని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తుంది. మనం ఒక దారిలో వెళుతుంటే ముళ్లకంప ఎదురైతే మరో దారిలో ఎలా వెళతామో సరిగ్గా అలాగే జీవులు కూడా దారి మార్చుకుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఒక మనిషికి సోకినప్పుడు తన హోస్ట్ చనిపోతే తనకి ఆవాసం పోతుంది, ఆ మనిషి ద్వారా ఇతరులకి విస్తరించి ఈ విశ్వంలో తన ఉనికిని కాపాడుకునే అవకాశం పోతుంది కదా! మొదట్లో వచ్చిన కరోనా వైరస్ తన సహజ సిద్ధమైన ప్రవర్తనతో లంగ్స్ ని డామేజ్ చేయడం వరకూ చేసుకుంటూ వెళితే దాని హోస్ట్లమైన మనం (మనుషులం) చనిపోవడం మొదలుపెట్టాం. అంటే ఆ వైరస్ విస్తరించటానికి అవకాశాలు తగ్గిపోయాయి.
దాంతో అది తన నిర్మాణం మార్చుకుంది. తన హోస్ట్ కి ఎక్కువ నష్టం చేయకుండా, వేగంగా విస్తరించేలా అది మార్పులు చెందింది. రేపు భవిష్యత్తులో కొత్త వేరియంట్స్ రావొచ్చు. కానీ అవి పూర్తిగా కొత్త రూపం సంతరించుకుంటే తప్పించి ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ బలహీన పడుతూనే ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నట్లు అది ఓ సాధారణ జబులు స్థాయికి చేరుకుని, భూమ్మీద మనతో పాటు జీవిస్తుంది.
దీన్ని బట్టి ఒక అర్థం చేసుకోవాలి. ప్రతీ జీవిలోనూ చుట్టూ వాతావరణ పరిస్థితులను బట్టి తన జెనెటికల్ సీక్వెన్సింగ్ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ జీవి అలవాటైన విధానంలో కంఫర్టబుల్‌గా బ్రతకడం కాకుండా, మారిన పరిస్థితికి తగ్గట్లు మారకపోతే అది ఉనికిని కోల్పోతుంది. ఇక్కడ అతి మామూలు ఉదాహరణ చెబుతాను. 24 ఏళ్లుగా నేను టెక్నాలజీ రంగంలో ఉన్నాను. 1998 ప్రాంతంలో ఓ జర్నలిస్టు మిత్రులు కంప్యూటర్ లో టైపింగ్ నేర్చుకోవడానికి బద్ధకించారు. నేను జర్నలిస్టుని కదా, నేను టైప్ చెయ్యడం ఏంటని మొరాయించారు. ఇప్పుడు ఆ మధ్య ఆ జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్లో మాట్లాడుతూ “అప్పట్లో నువ్వు చెబితే వినలేదు, ఇప్పుడు టైపింగ్ రాక చాలా ఇబ్బందిగా ఉంది” అంటూ వాపోతున్నారు.
మన శరీరం విషయానికి వస్తాను. బయట చలి వేస్తుంటే రక్తనాళాలు సంకోచించి మన శరీరం వేడిగా ఉండేలా కాపాడబడుతుంది. అదే వేడిగా ఉంటే రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తుంది. ఇదంతా కూడా అటానమస్ నెర్వస్ సిస్టమ్‌లో భాగంగా మన ప్రమేయం లేకుండా చేయబడే ఏర్పాటు. అంటే మన శరీరాన్ని చలి, వేడి నుండి కాపాడుకునే ప్రయత్నాన్ని మన శరీరం చేస్తుంది. ఒకవేళ కాలక్రమంలో ఉష్ణోగ్రతలు 50, 60 డిగ్రీలకు చేరాయి అనుకోండి. అప్పుడు ఎలా ధర్మోరెగ్యులేషన్ చేయాలో శరీరం నేర్చుకోకపోతే అది మానవ జాతికీ ప్రమాదకరంగా మారుతుంది.
ఇక్కడ ప్రధానమైన విషయానికి వస్తాను. “నేను శక్తివంతుడిని” అనే ఆలోచన మీరు చేస్తే ఆ ఆలోచనకి తగ్గ మార్పులు మీ జీన్ ఎక్స్ప్రెషన్లో మారతాయి. దానికి తగ్గట్లుగా శరీరంలో మన లింబిక్ సిస్టమ్ ఎమోషనల్ రెస్పాన్స్‌గా శరీరాన్ని నయం చేసే, శరీరాన్ని శక్తివంతంగా చేసే విధంగా ప్రవర్తిస్తుంది. శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న కణాలకు మధ్య కమ్యూనికేషన్ బలపడుతుంది. అంటే మన ఆలోచనలకు ఎమోషనల్ రెస్పాన్స్ని శరీరం మీద చూపించే లింబిక్ సిస్టమ్ మన ఆలోచనలకు తగ్గట్లు తన శరీరాన్ని తయారు చేస్తూ మనకు కావలసిన “శక్తివంతుడిని” అనే భౌతిక స్థితిని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.
అదే నేను బలహీనుడిని అని ఆలోచన చేస్తే మీ లింబిక్ సిస్టమ్ మీ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి మీ కోరికను నెరవేరుస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు.. మరి డైనోసార్లు అలా శక్తివంతంగా మారిపోయి ఉండొచ్చు కదా అని అడగొచ్చు. మనుషులు బుద్ధిజీవులు కాబట్టి తన ఆలోచనా విధానంతో తన శరీరాన్ని ప్రభావితం చేసుకోగలుగుతారు. తమ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ మార్చుకుని తన ఉనికిని కాపాడుకోగలుగుతారు. మిగతా జంతువులు అలా కాదు కదా!
ఏ మనిషైతే తన ఆలోచనతో తన శరీరాన్ని మార్చుకోవచ్చు అనే దాన్ని నమ్మడో ఆ మనిషి తన నెగిటివ్ ఆలోచనలతో తన శరీరాన్ని హింసపెట్టుకుంటూ, ఆ శరీరమే అనేక అవయువాల వైఫల్యాన్ని దారితీసేలా, చివరకు ఆ శరీరం అంతరించిపోయేలా తనని తాను తయారు చేసుకుంటాడు. అతను కోరుకున్న రియాలిటీ కూడా అదే.. నా శరీరం నన్ను బాధపెడుతోంది అనుకుంటే ఆ శరీరం బాధపెడుతూనే ఉంది. నా శరీరం నాకు సహకరిస్తుంది అనుకుంటే ఆ శరీరం సహకరించటం మొదలుపెడుతుంది!
అందుకే ఆలోచనా దృక్పధంలో మార్పు తెచ్చుకునే డైనోసార్లలా అంతరించిపోకుండా మంచి జీవితం లభిస్తుంది. కరోనా టైమ్‌లో చాలామందికి ఎందుకు ఇమ్యూనిటీ తగ్గిపోయి చనిపోయారు అంటే, వారు భయపడ్డారు, వాళ్లు తమని తాము శిక్షించుకున్నారు. తమ శరీరాన్ని, తమ రోగనిరోధకశక్తిని నమ్మలేదు. అంటే అది మైండ్ లెవల్ ఆలోచనే కదా!
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu