నిరీక్షణ, విరహం మనస్సుని దహించేస్తాయి… ఈ జీవితం ప్రేయసి కోసమో, ప్రియుడి కోసమో మాత్రమే సృష్టించబడిందన్నంత విరహానికి గురిచేస్తాయి…
క్షణకాలపు ఎడబాటు కూడా యుగాలుగా మనస్సుని మెలితిప్పుతూ.. పాటలూ పుట్టుకొస్తాయీ.. కవితలూ కక్కుకొస్తాయి…
“వేచి ఉంటాను కడవరకూ…” అని మనస్సులోనే జీవితాన్ని ఆ వ్యక్తి కోసం త్యాగం చేసేసినంత ఉదాత్తత ఉట్టిపడుతుంది.
బేసికల్‌గా మనిషి స్వార్థజీవి. జీవితాంతం తన కోసం తపించిపోయే ప్రియుడి కోసం ప్రేయసీ… అలాంటి ప్రేయసి కోసం ప్రియుడూ మనస్సు పారేసుకోకుండా ఉండలేరు…
అవతలి మనిషి అస్థిత్వాన్ని వదులుకుని మనలో లీనమవ్వడానికి పరితపిస్తుంటే.. అంత గొప్ప అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకోగలరు?
అమ్మాయిలు ముద్దుముద్దుగా కబుర్లు చెప్తుంటే గంటల తరబడి మాట్లాడుతూ సెల్ బిల్లులూ, sms packలూ వేయించి మురిసిపోయే అబ్బాయిలూ… అలాగే వాటితో పాటే చిన్నవో, పెద్దవో మానసిక, శారీరక థ్రిల్లు తీర్చుకోవడం… సినిమాలూ, లాంగ్ డ్రైవ్‌లూ, పార్టీలూ.. నిరంతరం సంతోషాన్ని మనస్సులో నింపేసుకోవాలన్నంత తాపత్రయంలో ఎన్నెన్నో…
———————————
ఓ బెటర్ అండర్‌స్టాండింగ్‌తో ఎవరికీ రిస్క్ లేకుండా ఎవరి అవసరాలు వారు తీర్చుకునే రిలేషన్‌షిప్‌లు పక్కనబెట్టి ప్రేమా, త్యాగం చుట్టూ తిరిగే బలమైన రిలేషన్లకే వస్తే…
————————————————————————————
అలాంటి విరహాలూ, సంఘర్షణలూ… అన్నీ దాటుకుని మనుషులు దగ్గరవుతారు… ఎడబాటు చేసినంత మాయ కలయిక చేయలేదు…
“ఈ మనిషి ఇక మనకే స్వంతం” అన్న భావన కలిగిన తక్షణం… “ఈ మనిషి జీవితాంతం కళ్లెదురే ఉంటారు, మన ఆలోచనల పరిధిలోనే జీవిస్తారు….” అన్పించిన తక్షణం… అలాగే నిలువనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన శారీరక వాంఛలూ తీరిన తక్షణం….
“వేచి ఉంటాను కడవరకూ…” వంటి బలమైన భావనలు పలుచున పడిపోతుంటాయి…
భౌతికంగా దూరంగా ఉన్న ప్రియురాలి కోసం మనస్సుని మెలిపెట్టుకుని… ఆకాశంలోకి పిచ్చి చూపులు చూస్తూ… తానెంత తపించిపోతున్నదీ భూతద్ధం వేసుకుని… తన పట్ల తాను జాలి పెంచుకుని… “అంత విరహంలో ఉన్నా ప్రియురాలు అతి సాధారణంగా ప్రవర్తిస్తోందే” అని కొత్త కారణాలతో మనస్సుని మరింత దిగులుపెట్టుకుని.. శోకించిన మనిషి కాస్తా….. అదే ప్రియురాలు జీవితంలోకి శాశ్వతంగా వచ్చేసరికి… ఎడబాటులో పొందిన వేదనలో అణుమాత్రమంతైనా కలయికలో పొందలేకపోతుంటాడు…
“వేచి ఉంటాను కడవరకూ…” అని పాడుకుంటూ ప్రేయసి తప్ప ఇంకేం ప్రపంచమూ లేదన్నట్లుగా మైమరిచిపోయిన మనిషి కాస్తా…
పూర్తిగా అదే ప్రేయసి జీవితంలోకి వచ్చాక…..
అప్పటివరకూ మైమరిపించిన ప్రేయసి నవ్వూ…. ముద్దు ముద్దు మాటలూ, కోరికలు రేకెత్తించిన దేహమూ అతి సాధారణమైపోయి… విరహం కాస్తా పలుచనబడిపోయి సర్ధుబాట్ల మధ్య జీవితం సాగిస్తూ… వేచి ఉండడం మాట పక్కన బెడితే… “ఏకాంతం లభిస్తే ఎంత బాగుణ్ణు” అనే స్థితికి చేరుకునే సందర్భాలూ వస్తుంటాయి 😛
————————————————
ప్రేమ అనేది గారడీ….
కబుర్లూ, నవ్వులూ, కవితలూ, కోరికలూ, ఎంటర్టైన్మెంట్లూ, షాపింగులతో పెరిగి పెద్దదై ధడేల్మ కుప్పకూలిపోయే పేక మేడ… మనం సినిమాల్లోని లవ్ సీన్లని ఎంజాయ్ చేస్తూ… మైమరిపోతున్న ప్రేమ అనుకుంటున్న ఆకర్షణ…
ప్రేమని అనుభూతి చెందొచ్చు… ప్రేమలో పడొచ్చు…. కానీ ప్రేమ వైవాహిక జీవితం పట్ల ఆసక్తి కోల్పోయేలా చేయకూడదు…
అలాగే తపించిపోవడం కొన్ని నెలల తంతుగా మిగలకూడదు… అంత ప్రేముంటే జీవితాంతం వేచి ఉండడం సంగతి పక్కన బెట్టి… వేచి ఉన్న వ్యక్తి జీవితంలోకి వచ్చాక…. జీవితాంతం అంతే ప్రేమగా చూసుకునే విలువను ఇవ్వాలి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply