కాలచక్రం, భూచక్రం, విష్ణుచక్రం అంటూ నేను పోల్చను గానీ….
ప్రతీ మనిషికీ జీవితంపై మరింత ఆశ పెరగాలి.. కోరికలు పుట్టాలి…
అలాగే “ఇప్పటివరకూ బాలేదన్న” ఫీలింగ్ ఒకటి ఎటూ ఇప్పటి వరకూ ఎంత బాగున్నా ప్రతీ ఒక్కరికీ ఏ మూలనో ఉండి ఉంటుంది కాబట్టి.. ఇకముందైనా చాలా బాగుంటుందన్న hope తినే బిర్యానీ ప్యాకెట్ల నుండీ, తాగే మందు బాటిళ్ల నుండీ పుట్టుకు రావాలి… సో దానికో అకేషన్ ఉండాలి.. ఆ అకేషన్కే కొన్ని గంటల్లో ముహూర్తం…
ఓ కంపెనీకి రాబడులూ, నష్టాలూ లెక్కలేసుకోడానికి ఓ బ్యాలెన్స్ షీట్ ఎలాగో, ఓ మామూలు మనిషికీ విజయాలూ, అపజయాలూ లెక్కలేసుకోడానికి అకౌంటింగ్ ఇయర్ క్లోజింగ్ అన్నమాట…
2 రోజులు పోతే కొత్త పాతబడిపోతుంది. అలా పాడబడిపోతుందనీ మనకు బానే తెలుసు.. కానీ ఈ క్షణం మాత్రం కొత్తగా ఉంటోంది కదా అన్న ఓ థ్రిల్…
ఇవ్వాళ ఆనందం పిడికిట్లో బంధించడం మిస్ అయితే మళ్లీ ఏ పొంగల్కో, ఉగాదికో, సమ్మర్ హాలిడేస్ వరకో మనకు దక్కాల్సిన ఆనందం postphone అవుతుందన్న ఆదుర్దా… అందుకే నిద్రొస్తున్నా ఈరోజు మెలుకూతూనే ఉండాలి….
————
మనస్సంతా డొల్లగానే ఉంటుంది… దేన్ని చూసి హాపీ ఫీలవ్వాలో అర్థం కాదు… కానీ పెకిలించుకుని వెలికి తెచ్చుకోవాలి…. ఎక్కడో మారుమూల ఏదైనా “happy” అనే ఫీలింగ్ దాక్కుందేమోనని.. అందరూ నవ్వుకుంటూ, కేరింతలు కొట్టుకుంటూ… వాక్యూమ్ ఫిల్ చేసుకుంటుంటే మనం మాత్రం శూన్యంలోకి చూస్తే గుండె మెలితిప్పినట్లు ఉండదూ..?
అందుకే బిర్యానీలు తినాలి, గ్లాసులు గల్లుమన్పించాలి… నాలుగు పచ్చి జోకులూ, నాలుగు పుకార్లూ, పది వాగ్దానాలూ, పది లోకశ్రేయస్సు కబుర్లూ చెప్పుకోవాలి.. వయస్సులో ఉప్పొంగిపోతుంటే.. హగ్గులు చేసుకుంటూ… షాంపైన్ ఒలకబోస్తూ… గుంపులో, ఏదేమిటో, ఎవరేమిటో అర్థం కానంత డల్ లైటింగుల చీకట్లో తపించిపోతూ, మైమరిచిపోతూ పైత్యప్రకోపాలన్నీ కక్కేయాలి.. అదయ్యాక ఎక్కడ పడి ఎలా ప్రాణాలు పోతాయో అని చూసేవాళ్లకు భయం వేసేలా ఫీట్లు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ.. చలికి గొంతులు పోయే వరకూ అరిచీ అరిచీ కంఠశోష వచ్చి ఏ అపరాత్రిలో కూలబడాలి…
———————-
“అకేషనల్గా…” అనే పదం అర్థం మార్చుకుంది… అకేషన్స్ ఎక్కువైపోవడం వల్ల!! మనకు మామూలు లైఫ్ కన్నా అకేషన్స్, డైలీ రిలాక్సేషన్ ప్లానింగులే ఎక్కువ కావల్సి వస్తోంది..
దేనిలో హాపీనెస్ ఉందో తెలీకపోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ఇదంతా…!!
మందు కొడితే పని వత్తిడి తగ్గుతుంది కాబట్టీ.. పది మంది మనుషుల మధ్య పార్టీ చేసుకుంటే కొంత ఇన్సెక్యూరిటీ పోతుంది కాబట్టీ… వందమందిని పిలుచుకుని వచ్చి న్యూ ఇయర్ పార్టీ ఇస్తే.. కెరీర్ గ్రాఫూ, ఆపర్చన్యుటీసూ బాగుంటాయి కాబట్టీ…. న్యూ ఇయర్లు ఇంత హడావుడిగా ఉంటున్నాయి…
——————
తప్పేం లేదు… ఎంజాయ్ చేసుకున్నోడికి ఎంజాయ్ చేసుకున్నంత.. కానీ ఏ హడావుడి చేసినా purpose నెరవేరాలి కదా? మనం వెదుక్కుంటున్న ఆనందం ఎక్కడ ఉందో కాస్త చిరునామా తెలిస్తే నాకూ చెప్పడం మర్చిపోకండేం!
– ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Touching & True
– Happy New Year!!!!