గుండెల్లో అగ్గి రగలాలి.. దున్నపోతుల్లా కదలిక లేకుండా బ్రతకడం మీద మన మీద మనకే సిగ్గేయాలి.
మూడు పూట్లా గ్రాములు గ్రాములు తినే తిండంతా ఏమైపోతోంది.. బెడ్ మీద పడి దొర్లడానికా?
“మీ సక్సెస్‌కి పది సూత్రాలు” లాంటి తొక్కా తోలూ సలహాలూ, కాకరకాయ కబుర్లూ నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు. సక్సెస్‌ని షార్ట్‌కట్‌లతో, సెల్ఫ్ హెల్ప్ బుక్స్‌తో పొందడానికి ప్రయత్నించకండి.
బర్నింగ్ ఫైర్.. ఎవడో వచ్చి భుజం తట్టేదేంటి.. ఏదో ఒకటి సాధించాలనే తపన నీలో ప్రతీ క్షణం రగిలిపోవాలి. అందరూ బద్ధకంగా చతికిలబడ్డప్పుడు కూడా నువ్వు పనిచేయాలి, నీ భవిష్యత్‌ని నిర్మించుకోవాలి.
ఇక్కడ నేను రాసే ఫైర్‌నే నన్ను నిలబెట్టింది.. ఈ మధ్య స్పిరిట్యువల్ ప్రయాణంలో నన్ను నేను explore చేసుకునే ప్రయత్నంలో ఉన్నా గానీ, ఒక్కసారి అన్నీ దులపరించుకుంటే గుండెల్నిండా అగ్గి రగులుతూనే ఉంటుంది.
గట్టి సంకల్పం అనుకుంటే గుండెలు ఉప్పొంగిపోతాయి, పళ్లు బిగదీసుకుని కూర్చోవడమే… అదో నేనో అంతు తేల్చడమే. ఏం సాధ్యం కాదు? ఎందుకు సాధ్యం కాదు? “ఈ పని నా వల్ల కాదు” అనుకోవడానికి నాకైతే సిగ్గేస్తుంది. అందుకే ఇదీ అదీ అని కాదు ఏదైనా అంతు తేలుస్తా. చెమడాలు వలవాల్సిందే.
అటూ ఇటూ దిక్కులు చూసుకుంటూ సుకుమారంగా బ్రతకడానికి కాదు ఈ లైఫ్ ఉన్నది. అలా నువ్వు ఉన్నావంటే కంపర్ట్ జోన్లో ఉన్నావని అర్థం. లే.. లేచి నీ దమ్ము చూపించు.. నువ్వేం చెయ్యగలవో ఈ ప్రపంచానికి చూపించు. ఎంతకాలమని అనామకంగా నీకంటూ ఓ అండర్లైన్ లేకుండా బ్రతికేస్తావు? ఈరోజు నువ్వు తలుచుకుంటే రాబోయే ఐదేళ్లలో నిన్ను అందరూ అబ్బురంగా చూసేలా ఎదగాలి! మొదలుపెట్టు, ప్రయాణం! నేను నీతో ఉన్నా..! మనబోటి వాళ్లందరం కలిసి ఎదుగుదాం.
- Sridhar Nallamothu