నీకంటూ ఓ platform క్రియేట్ అయ్యేటంత వరకూ నీది ఒంటరి ప్రయాణమే….
ఈ ఒక్క మాటా గుర్తుంచుకోండి చాలు!! ఎంత కష్టమైనా పడి ఓ platform క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం మనది. ఆ తర్వాతే ఏదైనా!
ఒక్కటంటే ఒక్క ఆపర్చ్యునిటీ రానప్పుడు జీవితంపై విరక్తితో.. “వెధవ జన్మ, పుడితే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాలి గానీ ఈ బ్రతుకెందుకు” అని చాలామంది తిట్టుకోవడం గమనించాను..
ఎవడి కష్టాలు వాడికున్నాయి.. ఆ ఫ్రస్టేషన్‌ని తట్టుకోలేక అలా మాట్లాడుతున్నాం గానీ చాలా విషయాల్లో గోల్డెన్ స్పూన్ బ్యాచ్ కన్నా మనమే మేలు.
———————
ఎవ్వరూ కోపరేట్ చెయ్యరు.. కనీసం మాట సాయం కూడా చెయ్యరు. ఈ లోకం ఇంతే… వాళ్ల పనులు మానుకుని మన గురించి పట్టించుకునే తీరిక ఎవడికుంది? అయినా ఎవడి లెక్కలు వాడికున్నాయి… “నీకేమైనా చేస్తే నాకేంటి లాభం” అని!
ఇదంతా చూస్తూ, ఊరికూరికే మనస్సు కష్టపెట్టుకుంటూ బాధపడుతూ కూర్చుంటామా? సిగ్గుచేటు అన్పించట్లేదూ?
————–
మన లైఫ్ మనమే లీడ్ చెయ్యాలి.. మన కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లైఫ్ ఇది. మనకు కొన్ని కష్టాలు వెరైటీగా డిజైన్ చెయ్యబడ్డాయి.. అవి స్థిమితంగా ఎదుర్కొంటేనే జీవితం కన్పిస్తుంది.. లేదంటే అంధకారమే మిగులుతుంది!!
జనాలు తిడతారు, చులకనగా మాట్లాడతారు, వెకిలిగా నవ్వుకుంటారు…. అవహేళన చేస్తారు… అన్నింటికీ సమాధానం ఒక్క చూపే… ఆ చూపులోనే తెలియాలి…. మన కసి, మనం అవన్నీ తొక్కిపడేసి ఎంత ఎత్తులోకి ఎదగబోవాలనుకుంటున్నామో అన్న కృతనిశ్చయం.
యెస్.. చేతుల్లో శక్తి ఉంది, శ్వాసలో నమ్మకముంది, పనుల్లో పట్టుదలా ఉందీ.. ఆలోచనల్లో స్పష్టతా ఉంది… ఇంకేం కావాలి?
—————
ఉన్న ఫళాన భూమిలోకి కూరుకుపోవాలన్నంత అవమానంగా ఈరోజు పరిస్థితులూ, మనుషులూ ఉండొచ్చు…. రేపు ఇవే పరిస్థితులూ, మనుషులూ వద్దంటున్నా ఖచ్చితంగా ఆకాశంలోకి ఎత్తేస్తారు… మనల్ని మనం అండర్లైన్ చేసుకోవాలన్న తపన ఉంటే ఇది ఖాయం.. ఖచ్చితంగా జరిగి తీరుతుంది… ఇదేదో మెట్ట వేదాంతం కూడా కాదు, నా స్వానుభవం కూడా!!
కొన్నాళ్లు, అవసరం అయితే కొన్నేళ్లు రేయింపగళ్లూ, సూటిపోటిగా మాట్లాడే మనుషులూ అన్నీ మర్చిపోయి శ్రమించండి… ఎందుకు జరగదో చూద్దాం అద్భుతం?
విజయం ఏ ఒక్కడి స్వంత ఆస్థి అని.. మనకు దక్కకుండా పోవడానికి?
ఒక్క విజయంతో ఆగకండి.. జీవితాంతం కసిని కాపాడుకోండి… పీల్చే శ్వాసలోనే, దాని బలంలోనే తెలియాలి మన కసి… ఏదో కొద్దిగా ఊపిరాడితే చాలు అని ఎప్పుడైతే సర్ధుకుపోతామో అప్పుడు కాన్ఫిడెన్సూ పోతుంది, జీవితమూ ఏ మూలనో ఇరుక్కుని సర్ధుకుంటుంది..
గుండెలనిండా గాలిపీల్చండి జీవించి ఉన్నంతవరకూ…. చచ్చాక ఎటూ పీల్చే అవకాశం ఉండదు!!!
– నల్లమోతు శ్రీధర్
prativakaru aacharinchavalasinadi.
what more courage to accept the facts