మన విచక్షణలు పనిచేయట్లేదు..
కొన్నేళ్ల తరబడి తమ తమ రంగాల్లో ఎంతో కృషి చేసిన మనుషుల్ని చాలా సామాన్య జనాలుగా పరిగణించేస్తున్నాం ఈ వర్చ్యువల్ ప్రపంచంలో!
మొన్నో ప్రముఖ రచయిత్రి ఓ మంచి విషయం పోస్ట్ చేస్తే కనీసం ఆవిడ ఆలోచనా విధానానికి ఏమాత్రం సరితూగని ఓ వ్యక్తి చాలా చులకనగా ఏదో రిప్లై రాశారు. ఆ రచయిత్రిని అభిమానించే వ్యక్తిగా నాకు బాధనిపించింది.
అందరికీ యాక్సెస్ ఉండేలా పోస్టులు పబ్లిక్‌గా ఎందుకు పెట్టుకోవడం, Facebookలో ప్రైవసీ సెట్టింగులు ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు.
ఇక్కడ నేను రాయబోతున్నది టెక్నికల్ జాగ్రత్తల గురించి కాదు.. మనం కోల్పోతున్న మన విచక్షణ గురించి.
మంచి విషయాలు పదిమందికీ పబ్లిక్‌గా తెలియాలనీ, తద్వారా మరింత మందికి తన ఆలోచనలు విస్తరించాలనీ కోరుకోవడం తప్పేం కాదు. అంతే తప్ప పబ్లిక్‌గా కన్పించిన ప్రతీ పోస్టుకీ వెళ్లి ఏదో ఒకటి చులకనగా రాసేయడం సంస్కారం కాదు.
ఒక రచయిత అయినా, ఓ మీడియా వ్యక్తయినా, లేదా ఓ సైంటిస్ట్ అయినా, సోషల్ వర్కర్ అయినా.. నిజజీవితంలో ఎవరి విలువ వాళ్లకు ఉంటుంది. కనీసం వాళ్లని కలవడానికి కూడా అర్హత లేని వ్యక్తులం మనం.
అలాంటిది ఫేస్బుక్ వంటి సైట్ల పుణ్యమా వారిని పలకరించే భాగ్యం కలుగుతోంది. దాన్ని సద్వినియోగం చేసుకోవలసింది పోయి ఆ వెసులుబాటుని మన సంకుచిత మనస్థత్వాలతో దుర్వినియోగం చేయడం ఎంతవరకూ కరెక్ట్?
సినిమా ఇండస్ట్రీ హైద్రాబాద్ వచ్చిన కొత్తలో మేము ఇంకా చెన్నైలోనే సినిమా జర్నలిజంలో ఉండేవాళ్లం. హైద్రాబాద్, చెన్నై తిరుగుతుండే ఆర్టిస్టులు వాపోతుండే వాళ్లు.. హైద్రాబాద్ వెళ్లాక విలువ లేకుండా పోయిందండీ అని!
మనుషులకు ఎంత సమీపంగా వస్తే మన కష్టం విలువ, మన హోదా విలువ అంత తగ్గిపోతుంది అనడానికి ఇంతకన్నా వేరే గొప్ప నిదర్శనం చెప్పాల్సిన పనిలేదు.
హీరోయిన్ శ్రియని ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్లోనో చూసి.. "ఆ ఏముంది పొట్టిగా ఉంది.. వీళ్లంతా షో చేస్తారురా" అని పోసుకోలు కబుర్లు చెప్పుకునే బాపతు జనాల్ని చూశాను.. అస్సలు తమ క్యారెక్టర్లు బ్రహ్మాంఢంగా చేయడానికి వారు పడే శ్రమ ఏమాత్రం మన తలకెక్కదు. కళ్లెదుట కన్పిస్తే నోరు పారేసుకోవడమే.
అందుకే చాలామంది పెద్ద పెద్ద వాళ్లు సాధారణ మనుషులకు సమీపంలోకి రావడానికి ఇష్టపడరు.. కారణం మన లాంటి సాధారణ మనుషుల్లోని చిల్లర స్వభావాలు వాళ్లని చాలా చిరాకు తెప్పిస్తాయి గనుక.
ఇక్కడ ఫేస్బుక్ లాంటి సైట్లలోనూ ఇదే ఇబ్బంది ఏర్పడుతోంది. ఎవరో వచ్చి ఎవరో పెద్ద వాళ్లని తేరగా కామెంట్ చేసేస్తారు.. ఏ అర్హత ఉందని అలా మాట్లాడేయగలం?
ఫేస్బుక్లో సెలబ్రిటీలకూ, గొప్ప గొప్ప వాళ్లకూ, మనకూ ఉండేవి ఒకటే ప్రొఫైళ్లే అయినా.. టైమ్లైన్లే అయినా… మనకూ వాళ్లకీ మధ్య ఎన్నో స్థాయీ బేధాలున్నాయి. ఈ basic factని విస్మరిస్తే ఎలా?
పెద్ద పెద్ద వాళ్లంతా మనకు అందుబాటులో ఉన్నంత మాత్రాన, వాళ్లకు మనం ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తే accept చేసినంత మాత్రానా వాళ్లు మనకు సమానమైపోరు. ఆలోచనావిధానంలోనూ, స్థాయిల్లోనూ వారికి మనం ఏమాత్రం సరితూగం. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే వాళ్లెంత స్థాయిలో ఉన్నా మనల్నీ తమతో కలుపుకుంటారు వారి సహృదయం కొద్దీ. అంతేగానీ వాళ్లు మనకు యాక్సెసింగ్ ఇచ్చారు కాబట్టి మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం, వాళ్లు బ్లాక్ చేస్తే పదిచోట్ల వెళ్లి bad ప్రాపగాండా చేయడం చిల్లరతనం కాదా?
వయస్సులో పెద్ద వాళ్లని క్వశ్చన్ చేస్తేనే మన తల్లిదండ్రులు ఊరుకునే వారు కాదు ఒకప్పుడు.. ఇప్పుడు ఓ ఫేస్బుక్ ఐడి ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రతీ ఒక్కర్నీ నోటికొచ్చినట్లు ప్రశ్నించేస్తున్నారు! ఇది సంస్కారమేనా?
ఒకప్పుడు ఓ గొప్ప రైటర్ అంటే నాకు చాలా గౌరవం అనుకుందాం.. ఇప్పుడు అతను నా లిస్ట్‌లో ఉన్నారు కాబట్టి.. ఆయన updatesనీ రోజూ నేను చూస్తున్నాను కాబట్టి.. ఆ అభిమానం, గౌరవం కాస్తా డైల్యూట్ అయిపోతే.. నేనూ అతని పట్ల చాలా సాధారణ వ్యక్తిలా ప్రవర్తిస్తుంటే మార్పు వచ్చింది నాలోనా, అతనిలోనా?
ఆలోచిస్తే చాలా చిన్న విషయం ఇది… చాలామంది నిజంగానే ఈ ఆలోచన లేక విచక్షణ కోల్పోతున్నారు.
ఏళ్ల తరబడి కష్టపడ్డ వాళ్ల ముందు అణిగి మణిగి ఉండడం తెలీకపోతే.. అది డైనమిజం అవ్వదు.. కన్నూమిన్నూ కానరానితనం అవుతుంది!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే మీ మిత్రులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply