


చరిత్ర శిలలపై శిల్పాలను మిగిల్చితే వర్తమానం శిలలపై ప్రేమ గుర్తులనూ, పిచ్చి రాతలనూ ముద్రిస్తోంది. వందల సంవత్సరాల భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ప్రతీ పర్యాటక ప్రదేశంలోనూ మనకు కన్పించే దృశ్యమిదే. బౌద్ధమన్నా, బౌద్ధ ఆనవాళ్లన్నా నాకు చాలా ఇష్టం. ఇటీవల అమరావతిలోని బౌద్ధస్థూపానికి వెళ్లినప్పుడు తవ్వకాల్లో బయటపడ్డ చారిత్రక సంపద మీద పై చిత్రంలోని విధంగా ప్రేమ గుర్తులు, పిచ్చి రాతలు రాయబడి ఉండడం బాధ కలిగించింది.
రాతిపై చెక్కుకున్నంత మాత్రాన ప్రేమ శాశ్వతమైపోదు. ప్రేమించిన వ్యక్తిని ప్రతీ క్షణం అపురూపంగా చూసుకోగలిగే పెద్ద మనసు ఉంటే చాలు.. దానికి ఎలాంటి ప్రదర్శనలు, నిదర్శనాలూ అవసరం లేదు. ఇలాంటి పిచ్చి గీతలు ఎందరో సందర్శకులకు ఏహ్యభావం కలిగిస్తాయి. ఆ ఏహ్యభావమా ప్రేమికులు కోరుకునేది?
చారిత్రక నిర్మాణాలు నిన్నా ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి, రేపూ ఉంటాయి.. ఎటొచ్చీ మనమే కాలగర్భంలో కలిసిపోతుంటాం. మన ఉనికికి భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా చాటిచెప్పడం అనేది ఇలాంటి చవకబారు చర్యలతో కాదు చేయవలసింది.. మనదైన ముద్రని మన కృషితో, మన సామాజిక బాధ్యతతో వీలైనంత ఎక్కువ మందికి చాటిచెప్పడం ద్వారా మనమొక్కళ్లం ఉండేవాళ్లం అనే గుర్తుని భవిష్యత్ కీ తోడ్కొనిపోగలం తప్ప అపురూపమైన శిల్పసంపదపై పేర్లు చెక్కుకున్నంత మాత్రాన మన ఉనికి పదిలపరుచుకున్నట్లు కాదు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply