పేపర్లో నిన్న “కిడ్నీలు కుదేలు” అని డయాబెటిస్ గురించి ఏదో మెయిన్ పేజ్ ఐటెమ్ వచ్చింది. పొద్దున్నే టీ తాగుతూ మీరు దాన్ని చదివారు. అయ్యో మానసిక వత్తిడి నాకు కూడా ఉందే, నాకూ బిపి వస్తుందా, డయాబెటిస్ వస్తుందా అన్న భయం మీకు పట్టుకుంది. ఆ ఆలోచనకి ఆటోమేటిక్‌గా మీ శరీరంలో భయం అనే ఎమోషన్ కూడా జత అయింది. పేపర్ పక్కన పెట్టి ఆఫీసుకి రెడీ అవుతూ మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారే గానీ మీకు తెలీకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ భయం వెళ్లిపోయింది.
ఒకరోజు మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. “మన క్లాస్మేట్ ఫలానా రాజేంద్ర నిన్న హార్ట్ అటాక్‌తో చనిపోయాడు” అని చెప్పాడు.
“అయ్యో అవునా, మొన్ననే వాళ్లమ్మాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాడు కదా, అసలు ఎలా జరిగింది” అని మీరు ప్రశ్నించారు.
“చాలారోజుల నుండి బిపి ఉంది, పట్టించుకోలేదు, సడన్‌గా స్ట్రోక్ వచ్చింది” అని వివరిస్తున్నాడు.
వెంటనే పేపర్లో చదివిన కిడ్నీలు కుదేలు, తక్కువ వయస్సులోనే హార్ట్ అటాక్‌లు వంటి కధనాలు, వాటి తాలూకు భయాలు సబ్ కాన్షియస్‌లో ఉన్నవి కాస్తా సందర్భం వచ్చేసరికి మళ్లీ బలమైన భయాలుగా బయటకు తన్నుకు వచ్చాయి.
కాసేపు భయపడ్డాక, ఇలా భయపడుతూ కూర్చుంటే పనులు అవ్వవు అని ముందుకు సాగారు. కానీ లోపల ఓ థ్రెడ్ ఆ భయం పాసివ్‌గా నడుస్తూనే ఉంది. “చెత్త ఆలోచనలు, చెత్త ఆలోచనలని, మైండ్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను” అనుకుని అప్పుడెప్పుడో యోగా క్లాసులో నేర్చుకున్న మెడిటేషన్లో కూర్చున్నారు. అయినా ఆలోచనలు ఆగడం లేదు. “మెడిటేషన్ కూడా పనిచెయ్యడం లేదు” అని అసంతృప్తి మొదలైంది.
ఇప్పుడు అసలు విషయం చెబుతాను. మెడిటేషన్ అనేది ఆయింట్మెంట్ లాంటిది. మెడిటేషన్లో కొన్ని టెక్నిక్స్ ద్వారా సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకుని లోపల ఉన్న భయాలు, బాధలు, అసంతృప్తులను వెలికి తెచ్చుకుని ఆ ఎమోషనల్ బ్లాక్స్‌ని తొలగించుకోవచ్చేమో గానీ దానికి చాలా సాధన కావాలి. మిగతా అన్ని సందర్భాల్లో చాలామంది చేసే పై పై మెడిటేషన్ కాసేపు కామ్నెస్ని మాత్రమే అందిస్తుంది. లోపలికి వెళ్లి సమస్యని సాల్వ్ చేసేటంత లోతులకు చాలామంది వెళ్లరు.
“నాకు విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి.. నా మైండ్‌ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను” అని బాధపడే ప్రతీ ఒక్కరూ ఒక్క విషయం అర్థం చేసుకోండి. రోడ్ సైడ్ బిర్యానీ తిని తర్వాత కడుపు చెడిపోయిందని ఎలా బాధపడుతుంటారో అలాంటిదే మీ బాధ కూడా! పేపర్లు చదివి, టివిలు చూసీ, ఫేస్బుక్లో చెత్త పోస్టులు చదివి ఎలాంటి అసంతృప్తులు, భయాలను మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి నెట్టి వేస్తున్నారో గుర్తించండి. వాటిని మొదటి క్షణంలోనే వినియోగించుకోవడం, చదవడం ఆపేయండి.
ఒకవేళ ఏదైనా నెగిటివ్ ఎమోషన్ పుట్టించే అంశం చదివారు, చూశారు, లేదా మాట్లాడారు అనుకోండి. ఆ మరుసటి క్షణం నుండి మీ మైండ్‌లో కొద్దిసేపు అది తిరుగుతూ ఉంటుంది కదా! సరిగ్గా అప్పుడు పెన్నూ పేపర్ తీసుకుని అలా ఎక్కువసేపు మైండ్‌లో తిరుగుతున్న అంశాన్ని నోట్ చేసుకోండి. ఇది మీకు తెలీకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్లే అంశం అన్నమాట. సో కూర్చుని ఆ అంశం చుట్టూ మీకు ఏర్పడుతున్న ఎమోషన్ని తగ్గించుకోవాలి. ఆ అంశాన్ని 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకోవడం ద్వారా లేదా ఒకవేళ ఇతరుల గురించి అసంతృప్తి అయితే వారిని పూర్తిగా accept చెయ్యడం ద్వారా వారు మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఓ ఎమోషనల్ బ్లాక్‌గా ఏర్పడకుండా జాగ్రత్తపడండి.
సో ఇలా లోపల ఉన్న రూట్ కాజ్‌ని గుర్తించనంత కాలం ఎంత ఆలోచనలు ఆపుకోవాలన్నా రెట్టించిన వేగంతో వస్తూనే ఉంటాయి.
- Sridhar Nallamothu