ఒక్క చిన్న మాట.. గుండెలోతుల్లోకి గునపంలా దిగిపోయే మాటా…
ఆ ఒక్క చూపూ.. చురుక్కుమని మనస్సుకి తగిలి కళ్లు మూసుకున్నా వెంటాడే తట్టుకోలేని చూపూ..
ఓ మనిషి ప్రవర్తనా.. జీర్ణించుకోలేక “ఈ మనిషేనా మన పట్ల ఇలా ప్రవర్తించింది” అని ఎంత వద్దనుకున్నా ఆలోచనల్ని మళ్లించుకోలేని దైన్యస్థితీ…
అన్నీ తీసుకోండి మనస్సుకి.. .. మనసారా బాధపడండి.. కరువు తీరా కన్నీళ్లు కార్చండి… మన మనస్సు లోతెంతో ఆ వేదనలో కొలతలేసుకోవడానికీ… అన్యాయమైపోయామనీ… దగాపడ్డామనీ కుమిలిపోడానికీ ఆ బాధని వాడేసుకోండి…
ఐదంటే ఐదు నిముషాల్లో అంతా ఫినిష్ అయిపోవాలి…. ఐదు నిముషాల తర్వాత బాధనేదే ఉండకూడదు.. ఎంత బాధపడిపోతారో, ఎంత కుంగిపోతారో ఆ extreme కూడా అనుభవించేయండి…
గట్టిగా ఊపిరి పీల్చండి…. ఇప్పుడు లోనికెళ్లిన శ్వాస మాత్రమే ఉంది… ఆ ఒక్క శ్వాసా తోడుంటే ఆఫ్టరాల్ మిగతావన్నీ ఓ లెఖ్ఖా?
మాటల్లేవ్, చూపుల్లేవ్, బిహేవియర్లేవ్… ఉన్నదొక్కటే అన్నీ చెరిపేసిన స్లేట్ లాంటి శుభ్రమైన మనస్సు…
మనుషులంతే.. ఉప్పూ కారమూ తింటారూ… పానీపూరీలూ, మిర్చి బజ్జీలూ కూడా.. డబ్బూ, దర్పమూ వెనకేస్తారూ… ఈర్ష్యాఅసూయలతో రగిలిపోతారు.. కోపావేశాలతో రగిలించేస్తారూ… ఆ మాత్రానికేనా… లైట్లన్నీ ఆర్పేసుకుని మూలకు ఇరుక్కుపోయి బకెట్ల కొద్దీ కన్నీరు కార్చేస్తూ కుమిలిపోయేది?
మనుషులే కాదు, పరిస్థితులూ కొన్నిసార్లు పగబడతాయి.. చూస్తూ ఉండడమే.. ప్రేక్షకుల్లా… వాటి టైమ్ అయిపోగానే అన్నీ సర్దేసుకుంటాయి. ఎంత ఎమోషనలైజ్ అయితే అంత మనం disturb అవుతాం, ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది.
ఆశావహ దృక్పధం అంటే అన్నీ బాగున్నప్పుడు కాలర్ ఎగరేయడం కాదు.. ఏదీ బాలేనప్పుడు కూడా మనస్సుకి ఆ బాధని తీసుకోకుండా నిశ్చబ్ధంగా, నిశ్చలంగా ఉండిపోవడం!!
ఏ చూపు ముల్లులా గుచ్చుకున్నా అది గాయంలా మారేలోపు ఆ ముల్లు పీకేయకపోతే.. ప్రతీ చూపూ ముల్లుగానే మారుతుంది.. తట్టుకోలేని గాయాలైపోతుంటాయి జీవితాంతం.. దేన్ని ఎంతవరకూ తీసుకోవాలో అంతవరకూ తీసుకుంటే చాలు!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply